top of page

అగ్రరాజ్యంలో ఆర్థిక పతనం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 2 min read

ree

ఆధునిక ప్రపంచంలో అమెరికాయే ఏకైక అగ్రరాజ్యంగా కొనసాగుతోంది. ఆర్థికంగా, సాంకేతికంగా, అభివృద్ధిపరంగా ప్రపంచానికి పెద్దన్న అన్నట్లు వ్యవహరిస్తోంది. అనేక చిన్నదేశాలకు అప్పులు, గ్రాంట్లు ఇస్తూ మన గ్రామాల్లోని మోతుబరి పాత్ర పోషిస్తోంది. అదే సాకుతో తరచూ పెత్తనాలు సాగిస్తూ ఇతర దేశాలపై రుబాబు చేస్తోంది. మరోవైపు చాలా దేశాలు తమ బంగారం, ఇతర కరెన్సీని సైతం అమెరికా వద్ద దాచుకుంటున్నాయి. అవసరానికి అక్కరకు వస్తాయన్నది దాని వెనుక ఉద్దేశం. కానీ ప్రస్తుతం అమెరికాకు అంత సీన్‌ లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. అమెరికా అనే పెద్దన్న వెనుక పేద్ద అప్పులమూట ఉంది. అది ఎప్పటికైనా గుదిబండగా మారనుంది. వాస్తవానికి దైనందిన కార్యక్రమాలు, పాలనా నిర్వహణకు రాష్ట్రాలు, దేశాలు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం సహజ ప్రక్రియ. కానీ ఆ అప్పులు మన తలకు మించిపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆదాయమంతా రుణ వాయిదాలు, వాటి వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. ఒకదశలో అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఫలితంగా రెగ్యులర్‌ పాలన, కార్యక్రమాలు అన్నీ పడకేసే ప్రమాదం దాపురిస్తుంది. ఇప్పుడు అమెరికా సరిగ్గా ఇటువంటి సమస్య ముంగిటనే నిలిచింది. ఇది ఒక్క అమెరికాకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా సవాలుగా మారనుందని ప్రముఖ పెట్టుబడి బ్యాంకరు అయిన సార్థక్‌ అహుజా హెచ్చరిస్తున్నారు. ఐఎంఎఫ్‌ తాజా నివేదిక ప్రకారం అమెరికా అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయింది. ఆ నివేదిక ప్రకారం అగ్రదేశం ఏకంగా 36 ట్రిలియన్‌ డాలర్ల రుణాలు.. అంటే భారతీయ కరెన్సీలో ఎనిమిది లక్షల 80 వేల 809 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇది ఎంత పెద్దమొత్తమంటే.. ఐరోపా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల మొత్తం జీడీపీ కంటే ఎక్కువ. ఈ అప్పు మొత్తాన్ని అమెరికా జనాభాపరంగా లెక్కిస్తే ప్రతి అమెరికన్‌ తలపై సగటున లక్ష డాలర్ల అప్పు ఉన్నట్లేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికా తలపై ఉన్న ఈ 36 ట్రిలియన్‌ డాలర్ల అప్పు ఒక్క రాత్రిలోనో ఒక్కరోజులోనో పెరిగింది కాదు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా బ్యాంకులను దివాలా తీయకుండా కాపాడటానికి, ఆ దేశ సైన్యానికి తగినన్ని నిధులు సమకూర్చడానికి, కరోనా సమయంలో సంభవించిన ఆర్థిక నష్టాన్ని సరిదిద్దడానికి, ఆ దేశ వినియోగదారుల మార్కెట్‌ను నిరంతరం సజీవంగా ఉంచడానికి (ప్రజలు క్రెడిట్‌ కార్డుల ద్వారా వస్తువులను కొనుగోలు చేసే పరిస్థితిని కొనసాగించడానికి), ఇంకా అనేక ముఖ్యమైన కార్యకలాపాల కోసం అమెరికా అప్పుల మీద అప్పులు చేస్తూ వచ్చింది. ఇన్నాళ్లూ అమెరికాకు అప్పు ఇచ్చిన అంతర్జాతీయ సంస్థలు దేశీయ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ డబ్బును తిరిగి తీసుకోవడం ప్రారంభించాయి. చైనా, జపాన్‌, బ్రిటన్‌, కెనడా వంటి దేశాలు అమెరికా ట్రెజరీ బాండ్లను నిరంతరం అమ్మడాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ బాండ్లలో చైనా అతిపెద్ద పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రధాన రుణదాతగా ఉంది. ఆ చైనాయే ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థను, తన సొంత కరెన్సీ విలువను స్థిరీకరించడానికి అమెరికన్‌ ప్రభుత్వ బాండ్లను అమ్మడం ప్రారంభించింది. అదేవిధంగా జపాన్‌ కూడా ఇటీవలి కాలంలో అమెరకన్‌ బాండ్ల అమ్మకాల వేగాన్ని పెంచింది. బ్రిటన్‌, కెనడా వంటి దేశాలు కూడా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ ఆకస్మిక అమ్మకాలు అమెరికా ఆర్థిక స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఈ పరిణామాల వల్ల అమెరికా అప్పుల చిత్రం మరింతగా దిగజారుతోంది. దాంతో పెట్టుబడిదారులను ఆకర్షించి బాండ్ల అమ్మకాలను స్థిరీకరించడం, కొనుగోళ్లు పెరిగేలా చేయడానికి అమెరికన్‌ బాండ్లపై వడ్డీరేట్లను అక్కడి ప్రభుత్వం పెంచుతోంది. అయితే దీనివల్ల బాండ్ల అమ్మకాలు స్థిరకరణ సాధిస్తాయో లేదో గానీ వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల అమెరికాకు ఒక ట్రిలియన్‌ డాలర్ల అదనపు ఖర్చు మాత్రం తప్పదు. ఈ మొత్తం ఆ దేశ సైనిక బడ్జెట్‌ కంటే ఎక్కువ. ఈ మార్పుల వల్ల ఇటీవలి కాలంలో ప్రపంచ మూలధన ప్రవాహాలు(గ్లోబల్‌ క్యాపిటల్‌ ఫ్లోస్‌) మారాయి. అమెరికా ప్రభుత్వ బాండ్లను అమ్మేస్తున్న ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ఈ డబ్బును బంగారం వైపు మళ్లించాయి. అందువల్లే బంగారం ధర ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా 53 శాతం పెరిగింది. ఇదే సమయంలో డాలర్‌ విలువ పడిపోయి చైనీస్‌ యువాన్‌ విలువ పెరగడం ప్రారంభించింది. ఈ మార్పులు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపి పలు అవాంఛనీయ మార్పులకు కారణమవుతున్నాయన్నది వాస్తవం. ఇటువంటి దారుణమైన పరిస్థితి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ట్రంప్‌ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి ఉంది. ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులు బయటకు వెళ్లడాన్ని తక్షణమే నియంత్రించాలి. అదేవిధంగా బాండ్లు అమ్మేస్తున్న దేశాలకు డబ్బు ఇవ్వడానికి తగినంత ఆర్థిక వనరురు సమకూర్చాలి. ఇందుకోసం ప్రభుత్వ ఖర్చులను తగ్గించి పన్నులు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కానీ ట్రంప్‌ సర్కారు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. తన మాట వినని దేశాలపై టారిఫ్‌లు విధిస్తోంది. దీనివల్ల అంతిమంగా అమెరికాకే నష్టమన్న విషయాన్ని పట్టించుకోవడంలేదు. టారిఫ్‌ల పెంపు వల్ల ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు ఇప్పటికే అమాంతం పెరిగిపోయి సగటు అమెరికావాసులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పాక్‌, ఉక్రెయిన్‌ వంటి దేశాలకు వందల కోట్ల విలువైన సైనిక సాయం చేయడం అమెరికా అర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page