top of page

మార్పు అంత ఈజీ కాదు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 8 hours ago
  • 2 min read
ree

బీహార్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార ఎన్డీయే కూటమి గతం కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారాన్ని పటిష్టపర్చుకోవడం, కాంగ్రెస్‌`ఆర్జేడీల నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కనీస సీట్లకే పరిమితం కావడం వంటి పరిణామాలపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజకీయ పార్టీలు, కూటములు, ప్రజలు.. ఇలా ఎవరికి వారు తమ కోణం నుంచే ఎన్నికల ఫలితాలను, తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించి తోచిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. వాటికి సొంత వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. ఈ ధోరణి సహజమే కానీ.. వీటిలో ఏకత్వం ఆశించడం భ్రమే అవుతుంది. ఎన్నో మతాలు, వర్గాల సమ్మేళనంతో వైవిధ్యమైన సామాజిక దృశ్యాన్ని ఆవిష్కరించే భారత్‌వంటి విశాల దేశంలో ఏ ఒక్క అంశంపైనా ఏకాభిప్రాయం సాధించడం అసాధ్యం. ఏకకాలంలో అందరూ ఒకే సమస్యపై దృష్టి సారించడమూ సాధ్యం కాదు. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఒక సమస్యపై అందరికీ అవగాహన కూడా ఉండకపోవచ్చు. అందువల్ల దేశంలో గానీ, ఒక రాష్ట్రంలో గానీ సార్వత్రిక రాజకీయ మార్పు రావడానికి కొన్ని దశాబ్దాలు పడతాయన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. అందరినీ కదిలించగలిగే భావోద్వేగ అంశాలైనా, ప్రజల జీవితాలను ఏకకాలంలో ఒడుదిడుకుల్లోకి నెట్టేసే రాజకీయ, సామాజిక పరిణామాలైనా దేశం మొత్తాన్ని ఒకటిగా కదిలించేందుకు కచ్చితంగా చాలా సమయం పడుతుంది. అంత గొప్ప స్వాతంత్య్రోద్యమం కూడా కిందిస్థాయి వరకు జనంలోకి వ్యాపించి, వారిని ఏకోన్ముఖంగా కదిలించడానికి ఎన్నేళ్లు పట్టిందో అందరికీ తెలిసిందే. అప్పటికీ ఉద్యమంలోకి రాకుండా ఎందరో బయటే ఉండిపోయారు! ఇక మతం అనే భావోద్వేగ అంశం ఆధారంగా మెజారిటీ జనాన్ని రాజకీయంగా సమీకరించడానికి హిందుత్వ శక్తులకు కూడా తక్కువ కాలం ఏమీ పట్టలేదు. ఈ మార్పు రావడానికి దాదాపు వందేళ్ల సుదీర్ఘకాలం పట్టింది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి తప్పించి తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ప్రతిష్టించడానికి చాలా ఏళ్లే పట్టింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మాత్రమే లెక్కిస్తే ముప్పై ఏళ్లుగా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలోనే చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమికి కారణమైనా కూడా ఓటర్లు కాంగ్రెస్‌ను క్షమించేసి ఆ తర్వాత ఏకంగా ఇరవయ్యేళ్లు నెత్తిన పెట్టుకుని గెలిపించారు. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా 1977లో అధికారం చేపట్టిన జనతా ప్రభుత్వ పాలన మూన్నాళ్ల ముచ్చటగా మారడంతో ఎమర్జెన్సీ విధింపు లాంటి తీవ్ర అప్రజాస్వామిక చర్యలకు పాల్పడినందుకు కాంగ్రెస్‌ను గద్దె దించిన ప్రజలే 1980లో జనతా వైఫల్యం కారణంగా తిరిగి కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. 1990 దశకంలో స్వల్ప కాలం యునైటెడ్‌ ఫ్రంట్‌ పగ్గాలు చేపట్టింది. 1998లో తొలి ఎన్డీయే ప్రభుత్వం, ఆ తర్వాత కూడా 2004 వరకు రెండో ఎన్డీయే ప్రభుత్వం పరిపాలించినా మళ్లీ కాంగ్రెస్‌ ప్రజామద్దతుతో నెగ్గి ఇంకో పదేళ్లు పాలన సాగించింది. అంటే.. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం తొలి ముప్పై ఏళ్లు ఏకధాటిగా, అనంతరం మధ్యలో పదేళ్లు చొప్పున రెండుసార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలువుదీరాయి. స్వాతంత్య్రానంతరం దాదాపు 80 ఏళ్ల ప్రజాస్వామ్య భారతంలో రకరకాల ధోరణులకు అతీతంగా జనం అవగాహన, ఆలోచనలు, అంచనాల్లో పరిణతి వచ్చి ఉండొచ్చుగానీ.. కాలంతో పోటీ పడగల స్థాయిలో అది పెరగలేదనే అభిప్రాయం ఉంది. నాటి కాంగ్రెస్‌ హయాంలో కంటే మీడియా విస్తృతి బహుముఖంగా పెరిగిపోయినా కూడా అదే పరిస్థితి. పైగా మీడియా వ్యాప్తితో ఇంకో ప్రమాదం వాటిల్లుతోంది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌, డిజిటల్‌ అంటూ బహుముఖంగా విస్తరించిన మీడియా కచ్చితమైన సమాచారాన్ని చేరవేసే బదులు తప్పుడు సమాచారానికి, సమాచార రాహిత్యానికి, నిజానిజాలు తెలియనివ్వకుండా జనాన్ని త్రిశంకు స్థితిలో ఉంచడానికి, మాయ చేయడానికి, రాజకీయ పార్టీలకు అనుకూల వాతావరణం సృష్టించడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద మీడియా వ్యాప్తి జన సామాన్యానికి మేలు చేయడం కంటే పాలకులకు ఊడిగం చేయడానికే ఎక్కువ చెమటోడ్చుతోంది. జనతా ప్రయోగం మూన్నాళ్ల ముచ్చటే అయినా ఆనాడు మొరార్జీ దేశాయ్‌ని కానీ, ద్వంద్వ సభ్యత్వ వివాదంలో భాగస్వాములై ఆ ప్రభుత్వ పతనానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారకులైన వాజ్‌పేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్‌ తదితరుల విషయంలో కానీ, భిన్నధ్రువాల్లాంటి అన్ని పక్షాలనూ ఒకతాటి మీదికి తెచ్చిన జయప్రకాశ్‌ నారాయణ్‌ విషయంలో కానీ వాళ్ల వైఫల్యాలను ఎత్తిచూపి ఏ మీడియా కూడా ఆక్షేపించలేదు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదు. వారి నాయకత్వ దక్షతను కానీ, వారి అజెండాను కానీ ఎవరూ ప్రశ్నించలేదు. కానీ నేటి మీడియా దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీపరంగా, ప్రతిపక్ష ఇండియా కూటమిపరంగా ఎదురవుతున్న వైఫల్యాలకు, అపజయాలకు రాహుల్‌గాంధీని బాధ్యుడిని చేసి దక్షతను ప్రశ్నించడం, ఆయన్ను ఆక్షేపించడం, అపహాస్యం చేయడం, ఆయనకసలు అజెండాయే లేదనడం మీడియా నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తోంది. విపక్షాలపై మీడియా ఆపాదిస్తున్న ఇలాంటి బ్రాండిరగ్‌కు కేంద్రంలోని ఎన్డీయే కూటమికి ఆయాచిత అవకాశంగా మారింది. బ్రాండిరగ్‌ అనే ఈ అంటురోగం అధికార కూటమిని, దాని అభిమానులను ఇప్పుడు ఇతరులకూ వ్యాపిస్తోంది. కేంద్రంలోని అధికార కూటమి అనుసరించే విధానాలు దీర్ఘకాలంలో దేశానికి చేసే చెరుపును గుర్తించగల దీర్ఘ దృష్టి అధిక సంఖ్యాక జనంలో లేదు. సమస్యలతో జనం ఇబ్బందిపడే స్థాయికి చేరి పెద్ద కుదుపు కుదిపే వరకు మార్పుకోసం నిరీక్షించక తప్పదు. అందుకు పట్టే కాలాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడమే పౌరసమాజ కర్తవ్యం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page