కట్టుతెంచి చేటు చేస్తున్న ఎమ్మెల్యేలు!
- DV RAMANA

- 3 days ago
- 2 min read

పార్టీల్లో అసంతృప్తి ఉండటం.. కొందరు బాగా పని చేయడం.. ఇంకొందరు అంటీముట్టనట్లు ఉండటం సహజం. ఇటువంటి లోపాలను అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా పార్టీలు ట్రీట్ చేస్తుంటాయి. ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పార్టీల్లో ఇలాంటి సమస్యలు పెద్దగా కనిపించవు. ఒకవేళ కొద్దోగొప్పో ఉన్నా అవి పెద్దగా బయటపడవు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న ఎన్డీయే కూటమి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీలో దాదాపు మూడోవంతు ఎమ్మెల్యేల పార్టీని పట్టించుకోవడంలేదని సాక్షాత్తు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, హెచ్చరికలను చూస్తే అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇంత భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటుతుండటం పార్టీ, ప్రభుత్వంపై ఎంత ప్రభావం పడుతుందన్నది అధినేతకు తెలుసు. అందుకే ఆయన ఆ ఎమ్మెల్యేలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న 135 ఎమ్మెల్యేల్లో 35 శాతం.. అంటే 48 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలను, నియమావళిని పక్కనపెట్టి సొంత వ్యవహారాలు, అనవసర వివాదాల్లో తలమునకలవుతుండటంపై పార్టీ వేగుల ద్వారా అందిన నివేదికల ఆధారంగా చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మీడియాలోనూ వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. వారంతా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. చివరికి పన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలకూ గైర్హాజరవుతున్నారు. ఇటువంటి వారిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. పార్టీని పట్టించుకోని ఎమ్మెల్యేల పేర్లు నేరుగా ప్రకటించకపోయినా వారిలో కొందరు రాజకీయంగా పదవులు దక్కని, పనులు జరగక, స్థానిక రాజకీయ విభేదాల వల్ల అసంతృప్తితో ఉన్నారన్నది సుస్పష్టం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య రాజుకున్న విభేదాలు రాజుకుని రచ్చకెక్కుతున్న పరిస్థితులే అనేక నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. వీరికితోడు పార్టీ ఆదేశించినా ప్రజా దర్బార్లు నిర్వహించకపోవడం, కార్యకర్తలతో కలవకపోవడం, నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టకుండా అధికార ప్రయోజనాలను మాత్రమే ఆశించడం వంటి చర్యలతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి చేటు చేస్తున్నారని అధినేత భావిస్తున్నారు. అటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం అవసరమైతే సస్పెండ్ చేయడం లేదా వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించడం వంటి చర్యలను నాయకత్వం పరిశీలిస్తోంది. అసభ్య వర్తన ఆరోపణలు ఎదుర్కొన్న అమదాలవలస, గుంటూరు ఈస్ట్, అనంతపురం ఎమ్మెల్యేలను చంద్రబాబు స్వయంగా వార్నింగులు ఇవ్వడం అందులో భాగమే. చంద్రబాబు హెచ్చరికలు ఆ 48 మంది ఎమ్మెల్యేలకు పరిమితం కాదు. వీటిని మొత్తం పార్టీకి, ఎమ్మెల్యేలకు మేలుకొలుపుగా భావించవచ్చు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు ఇటీవల ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ సందర్భంగా అందిన ఫిర్యాదుల ఆధారంగానే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేల తీరు ప్రజలను అసంతృప్తి గురిచేయడం ఒకటైతే.. మరోవైపు ప్రతిపక్షానికి విమర్శించేందుకు చేజేతులా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ కుమ్ములాటలను వైకాపా అస్త్రంగా చేసుకుని టీడీపీలో అంతర్గత కలహాలు అంటూ ప్రచారం చేస్తోంది. ఈ పరిణామాలు అటు టీడీపీని, ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయనడంలో సందేహం లేదు. ఇటువంటి ధోరణులను మొగ్గలోనే తుంచివేయకపోతే పార్టీ మనుగడకే ప్రమాదంగా పరిమించవచ్చు. చివరికి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను కూడా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు పార్టీని చక్కదిద్ది గాడిలో ఉండేలా చూడాలని భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలపైనా కొరడా రaుళిపించేందుకు వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే విజయవాడలో కేశినేని చిన్ని, కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య చోటుచేసుకున్న టికెట్ కోసం డబ్బు ఆరోపణలు, వైఎస్సార్సీపీ లింకులు వంటి అంశాలపై ఇద్దరికీ నోటీసులు పంపి విచారణ జరపాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. అలాగే చిత్తూరులో పార్టీ టికెట్ కోసం ఒక నాయకుడికి రూ.ఏడు కోట్లు సమర్పించి అన్యాయమైపోయానని ఒక మహిళా నేత చేసిన ఆరోపణలు పార్టీకి ఎంతోకొంత నష్టం చేసే ప్రమాదం ఉంది. పలువురు ఎమ్మెల్యేలు మద్యం, కాంట్రాక్టులు వంటి దందాల్లో మునిగితేలుతుండటాన్ని వైకాపా నేతలు ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గట్టి చర్యలు తీసుకుని పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. టీడీపీ అంతర్గత రాజకీయాలు, ఎమ్మెల్యేల తీరు మళ్లీ 2019 ముందునాటి పార్టీ పరిస్థితులను జ్ఞప్తికి తెస్తున్నాయంటున్నారు. చంద్రబాబు ఈ పరిస్థితులను అరికట్టి లోకేష్‌కు బాటలు వేస్తే, టీడీపీ మరింత బలపడుతుందని భావిస్తున్నారు. లేకపోతే ‘అధికార అమర్యాద’ పార్టీని మళ్లీ కుప్పకూల్చవచ్చని పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు హెచ్చరికలను పలువురు నాయకులు తేలిగ్గా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటువంటి హెచ్చరికలు చేయడం, డెడ్‌లైన్లు పెట్టడం ఆయనకు కొత్త కాదంటున్నారు. పరిస్థితులు చేతులు దాటుతోందనిపించినప్పుడు సీరియస్ కావడం.. తర్వాత మళ్లీ పట్టించుకోకపోవడం మామూలేనని తీసిపారేస్తుండటాన్ని కూడా పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది.










Comments