
`టీడీపీ అభ్యర్థుల్లో కొందరిని మారుస్తారని ప్రచారం
`దానికి బలం చేకూర్చుతున్న ఫోన్ సర్వేలు
`గుండతో కూన రవి భేటీ అయిన రోజే ఇవి ప్రారంభం
`శ్రీకాకుళం అసెంబ్లీ, విజయనగరం ఎంపీ సీట్ల ప్రస్తావన
`దాంతో ఇండిపెండెంట్‌గా పోటీ నిర్ణయం వాయిదా
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో సుదీర్ఘ కాలం టీడీపీ తరఫున రాజకీయాలు చేసి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తమను కాదని వేరే వర్గానికి చెందిన నాయకులకు టికెట్లివ్వడంపై గత కొద్దిరోజులుగా సీనియర్లంతా తమ అనుచరులతో అసమ్మతి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతామన్న సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఓటేస్తారంటూ టీడీపీ తరఫున ఐవీఆర్‌ఎస్ సర్వే పేరుతో రికార్డెడ్ కాల్ వస్తోంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే విషయంలో తన అభిప్రాయం మంగళవారం నాటికి చెబుతానని అప్పలసూర్యనారాయణ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి నియోజకవర్గంలో చాలామందికి ఐవీఆర్‌ఎస్ కాల్ రావడం గమనార్హం. మీ నియోజకవర్గ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి అంటూ కేవలం రెండే ఆప్షన్లు ఇచ్చి ఐవీఆర్‌ఎస్ కాల్ ముగుస్తోంది. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా తమ అభ్యర్థుల జాబితా ప్రకటించక ముందు కూడా ఆ పార్టీ ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారానే జనాభిప్రాయాన్ని సేకరించింది. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ముందు గుండ లక్ష్మీదేవి, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, గొండు శంకర్‌ల పేర్లతో ఒక సర్వే జరిగింది. ఆ తర్వాత గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ పేర్లతో మరో సర్వే జరిగింది. మూడోసారి గుండ లక్ష్మీదేవి లేదా నోటా అనే ఆప్షన్లతో ఇంకో సర్వే జరిగింది. చివరిగా శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా గొండు శంకర్‌ను ఖరారు చేస్తూ అధిష్టానం జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గంలో అప్పలసూర్యనారాయణ, పాతపట్నం నియోజకవర్గంలో కలమట రమణ తమ అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. అప్పలసూర్యనారాయణ టిక్కెట్ రాదని స్పష్టమైన తొలిరోజు నుంచి తమ అసంతృప్తిని ఓ పద్ధతి ప్రకారం తెలియపరుస్తున్నారు. గుండ లక్ష్మీదేవికి పార్టీ అన్యాయం చేసిందన్న సానుభూతి ప్రజల్లో పెరిగేలా వ్యూహాత్మకంగా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఐవీఆర్‌ఎస్ కాల్ రావడం, లక్ష్మీదేవి పేరు మాత్రమే అందులో ఉండటం వల్ల అధిష్టానం పునరాలోచనలో ఉందన్న భావన అప్పలసూర్యనారాయణ వర్గానికి కలుగుతోంది. నిజంగా ఐవీఆర్‌ఎస్ కాల్ ఆధారంగా అభ్యర్థిని మారుస్తారా? లేదా ఇది కేవలం చంద్రబాబు రాజకీయమా? అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో కొన్నిచోట్ల ఇచ్చిన టిక్కెట్లు వెనక్కు తీసుకుంటారని ఆంధ్రజ్యోతి ఈ రోజు కథనం ప్రచురించింది. అలాగే టీడీపీలో కొత్తగా చేరిన ఎంపీ రఘురామరాజుకు ఇప్పుడు ఓ స్థానం కల్పించాల్సి ఉంది. అయితే ఇందులో ఎక్కడా శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గం పేరూ లేదు. మడకశిర, సూళ్లూరుపేట, గజపతినగరంలలో అసెంబ్లీ అభ్యర్థులకు అసమ్మతి పోటు ఉందని పేర్కొన్నారు తప్ప అందులో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఇక విజయనగరం ఎంపీ విషయంలో కూడా కళా వెంకట్రావు, మీసాల గీత, కలిశెట్టి అప్పలనాయుడు, గేదెల శ్రీనుబాబుల పేరుతో ఐవీఆర్‌ఎస్ కాల్ సర్వే నడుస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా పాతపట్నంలో కలమట రమణ, శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవిల అభ్యర్థిత్వాన్ని మరోసారి అధిష్టానం పరిశీలిస్తుందన్న ప్రచారం జరుగుతుంది.

Kommentarer