top of page

దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 18 hours ago
  • 3 min read
  • బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్

  • యూపీఏ వైపు జగన్, విజయ్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్‌రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్‌రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజేపీ కెలకలేదు. ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అనేక స్కామ్‌లు జరిగాయంటూ విచారణలు చేపడుతున్నా బీజేపీ మాత్రం ఇది తమ వ్యవహారం కాదనుకుంది. మొదటిసారిగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదంలో మాత్రం బీజేపీ కూడా ఒక రాయి వేసింది. మొన్నటి వరకు వైకాపా, టీడీపీలు తగలడిపోతుంటే, అందులో చలికాచుకుంది తప్ప వేలు పెట్టలేదు. కానీ గడిచిన నాలుగు రోజుల నుంచి ఇందులో బీజేపీ కూడా వైకాపాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. రానున్న రోజుల్లో జగన్‌పైన బీజేపీ దూకుడు పెంచడానికి ఇది ఆరంభం మాత్రమేనన్న భావన కలుగుతోంది. అందుకే జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి చెన్నైలో జరిగిన జగన్ కజిన్ వివాహంలో చోటుచేసుకున్న ఘటనలు మరింత ఊపును తెచ్చాయి. ఒకేసారి తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, కొత్త పార్టీ అధినేత విజయ్‌లతో జగన్ మాట్లాడటం దక్షిణాది రాజకీయాలు కొత్త సమీకరణాల వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే కేరళలో హిందూ అజెండాతో బీజేపీ స్థానిక ఎన్నికల్లో దూసుకువస్తోంది. ఆ తర్వాత రాష్ట్రం 2026లో ఎన్నికలు జరగనున్న తమిళనాడే. ఆంధ్రాలో కూటమిలో భాగస్వామి కావడం ద్వారా బీజేపీ బలం పెంచుకుంది. దీనికి తోడు పవన్ కల్యాణ్ పేరుకు జనసేన అయినా.. బీజేపీ అజెండానే మోస్తున్నారు. ఇటువంటి సమయంలో హిందువులకు దూరం కాకుండా రాజకీయాలు నెరపాల్సిన పరిస్థితి జగన్‌కు ఏర్పడింది. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని రచ్చ చేయడం ద్వారా హిందూ ఓటుబ్యాంకును పూర్తిగా జగన్ నుంచి దూరం చేసే ఎత్తుగడను అడ్డుకోవాలంటే జగన్ బీజేపీకి దూరం కాకతప్పని పరిస్థితి. అందుకే తమిళనాడు ఎన్నికల లోపు దక్షిణాది రాజకీయ ముఖచిత్రం మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు చెందిన అగ్రనేతలు ఇప్పుడు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా గత కొంతకాలంగా సాగిస్తున్న రాయబారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. బెంగుళూరు వేదికగా మొదలైన మంతనాలు ఇప్పుడు చెన్నైలో ‘ఫైనల్ డీల’ దిశగా సాగుతున్నాయి. ఒకవైపు జగన్‌ను, మరోవైపు తమిళనాడులో క్రేజీ స్టార్‌గా మారిన విజయ్‌ను యూపీఏ (ఇండియా) కూటమిలోకి తీసుకురావడంలో డీకే కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ అంశంలో బీజేపీ కూడా తనపై దేశవ్యాప్తంగా విమర్శలు చేయడం, వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ బీజేపీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు.

కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోగా, తనపై జాతీయ మీడియాలో వస్తున్న నెగటివ్ కథనాల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని భావించిన జగన్.. యూపీఏలో చేరి మోదీకి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు.

మరోవైపు కాంగ్రెస్‌తో ‘దళపతి’ విజయ్ దోస్తీ!

తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ (టీవీకే) కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. పెరియార్, అంబేద్కర్‌లతో పాటు కాంగ్రెస్ దిగ్గజం కామరాజ్ సిద్ధాంతాలను కూడా విజయ్ తన పార్టీ ఎజెండాలో చేర్చుకున్నారు. ఇది కాంగ్రెస్‌తో పొత్తుకు మార్గం సుగమం చేసింది. డీఎంకేతో పొత్తు విషయంలో కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న తరుణంలో.. విజయ్ పార్టీ కాంగ్రెస్‌కు ‘పవర్ షేరింగ’ (ప్రభుత్వంలో భాగస్వామ్యం) ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

చెన్నై వేదికగా జరిగిన మంతనాలు..

చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్, విజయ్‌లతో జగన్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని, వీరంతా కలిసి దక్షిణాదిలో ఒక లౌకిక కూటమిని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే జగన్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి దీనిపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జగన్ తన అనుకూల మీడియా ద్వారా త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయ్‌ను జగన్ కలవడాన్ని వైకాపా సోషల్ మీడియా అకౌంట్లలో హోరెత్తిస్తున్నారు. జార్జి రెడ్డి మనవడు, సునీల్ రెడ్డి కొడుకు అయిన సాహిల్ వివాహం చెన్నైలో జరిగింది. ఆ సందర్భంగా.. పనిలో పనిగా ఈ ‘డీల’ కూడా కుదిరిందని ప్రచారం జరుగుతోంది. విజయ్ రాక సందర్భంగా వైకాపా నాయకులు అనిల్‌కుమార్ యాదవ్ నుండి అందరూ ఎదురుచూడటం, జగన్ స్వయంగా వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ విజయ్‌ని ఆహ్వానించడం లాంటి పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ దిశగా జగన్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఇటీవలే పార్లమెంటులో.. “నేను గెలిచినా కూడా ఎన్నికల విధానం మీద, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి” అని మిథున్ రెడ్డి ద్వారా మాట్లాడించి రాహుల్ గాంధీకి నేరుగా సంకేతాలు పంపించారు జగన్. ఈ వ్యూహం ఫలితంగానే ఇప్పుడు కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు వేగంగా పడుతున్నాయి.

మరోవైపు విజయ్ తన పార్టీని (టీవీకే) ప్రకటించినప్పటి నుండి తమిళనాడులోని అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించాలని చూస్తున్నారు. అయితే, లడ్డూ కల్తీ వివాదంలో జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయనతో కలవడం వల్ల, తమిళనాడులోని హిందూ ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పుడే ఆయనతో భేటీ అవసరమా?’ తెలంగాణాలో కేటీఆర్ లెక్కన తప్పు చేస్తున్నారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

తమిళనాడు బీజేపీ నేతలు (అన్నామలై వంటి వారు) ఇప్పటికే లడ్డూ వివాదాన్ని తమిళనాడులో కూడా హైలైట్ చేశారు. ఇప్పుడు విజయ్ జగన్‌తో జతకడితే, ‘హిందూ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి’ అని బీజేపీ విమర్శించే అవకాశం ఉందని, అది విజయ్ కొత్త పార్టీకి నష్టం చేస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణాదిలో మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలంటే జగన్ మద్దతు అవసరం అని మరికొందరు తమిళనాడులో వాదిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page