ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
- DV RAMANA

- 4 days ago
- 4 min read
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ
ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్
నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం
నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం

(ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ చరిత్రను తరచి చూస్తే మన దేశానికి సంక్షోభాలు కొత్త కాదు.. వాటిని ఎదుర్కొనేందుకు పొదుపు పాటించడం కూడా కొత్త కాదన్నది అర్థమవుతుంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో జవహర్‌లాల్ నెహ్రూ హయాం నుంచి నేటి మోదీ పాలన వరకు అనేక సందర్భాల్లో.. అనేక కారణాలతో ప్రభుత్వాలు పొదుపు పాటించాయి.
జీతాల కోత.. చిన్న ఇళ్లు
దేశంలో మొదటి పొదుపు చర్యలు 1957లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో మొదలయ్యాయి. అప్పట్లో దేశంలో ఉక్కు, సిమెంటుతో పాటు విదేశీమారక నిల్వల కొరత తీవ్రంగా నెలకొంది. దాంతో నెహ్రూ తనతోనే పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. పెద్ద అధికార నివాసం నుంచి చిన్న నివాసానికి మారారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన కేబినెట్‌లోని మంత్రులు తమ జీతభత్యాల్లో స్వచ్ఛందంగా పది శాతం కోతకు అంగీకరించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. లక్ష ఆదా అవుతుందని అంచనా వేశారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తమే. మంత్రులతో జీతాలకే కాకుండా ఇతరత్రా పొదుపు చర్యలు కూడా తీసుకున్నారు. ప్రధానమంత్రి నివాసం వద్ద సాయుధ బలగాల భద్రతను తొలగించారు. ముఖ్యమంత్రులు రైలు, రోడ్డు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు వారి సెక్యూరిటీ కాన్వాయ్‌లను తగ్గించారు. జూనియర్ మంత్రుల అధికారిక వాహనాలపై జాతీయ జెండాలను ఉపయోగించడంపై ఆంక్షలు విధించారు. తద్వారా ఆర్థిక ఇబ్బందుల భారాన్ని ప్రజలు, అధికారులతోపాటు రాజకీయ నాయకత్వం కూడా పంచుకోవాలన్న సంకేతం పంపారు. అయితే చిన్న నివాసంలోకి మారాలని నెహ్రూ నిర్ణయించుకున్నా.. ఆయన భద్రతా, పాలనావసరాలకు తగిన చిన్న భవన వసతులు ప్రభుత్వ స్థాయిలో లేకపోవడంతో ఏకంగా కొత్త నిర్మాణం జరపడం విమర్శలకు ఆస్కారమిచ్చింది. చేసిన పొదుపు కంటే దీనికి అయిన ఖర్చే ఎక్కువన్న వాదనలు వినిపించాయి.
స్వర్ణానికి బదులు డిఫెన్స్ బాండ్లు
1962లో చైనాతో యుద్ధం తర్వాత భారతదేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పటి ఓటమి దేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. దీంతో విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, రక్షణ రంగానికి అవసరమైన వనరుల సేకరణకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. పౌరులు తమ నగలను విరాళంగా ఇవ్వాలని, బంగారం కొనడం మానేసి ఆ డబ్బును నేషనల్ డిఫెన్స్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలని అప్పటి నెహ్రూ ప్రభుత్వం పిలుపునివ్వడమే కాకుండా దేశ మనుగడ కోసం ప్రజలు విలాసాలను త్యజించాలని కోరుతూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. బంగారం దిగుమతుల వల్ల సైనిక ఆధునీకరణకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యం వృథా అవుతున్నదనే భావన ఆ సమయంలో బలంగా ఏర్పడింది. అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బంగారం కొనడం దేశద్రోహంతో సమానమని ప్రకటించారు. పెళ్లిళ్ల సమయాల్లో కుమార్తెలకు బంగారు నగలకు బదులుగా డిఫెన్స్ బాండ్లను బహుమతిగా ఇవ్వాలని సూచిస్తూ వినూత్నమైన పిలుపునిచ్చారు. ఈ పొదుపు చర్యలను స్మగ్లింగ్ నిరోధక ప్రయత్నాలతో కూడా ప్రభుత్వం ముడిపెట్టింది. ఆ విధంగా ప్రజల వ్యక్తిగత కొనుగోలు నిర్ణయాలను దేశభక్తితో కూడిన బాధ్యతాయుతమైన చర్యలుగా మార్చడానికి ప్రయత్నించింది.
బంగారం తాకట్టు పెట్టిన దుస్థితి
ఆ తర్వాత 1990-91 నాటి పరిస్థితిని కూడా ఇప్పటి పరిస్థితులతో పోల్చవచ్చు. నాడు కువైట్‌పై ఇరాక్ దాడి చేసిన నేపథ్యంలో గల్ఫ్ యుద్ధం ముదిరిన సమయంలో మనదేశం అప్పటికే తీవ్రమైన విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. మన చెల్లింపులతోపాటు విదేశాల నుంచి రావాల్సిన వసూళ్లపైనా ఒత్తిడి పెరిగింది. ఫలితంగా సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ 1991 జనవరిలో హాసన్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ గల్ఫ్ యుద్ధం వల్ల కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజలు భయంతో వస్తువులను అవసరం లేకపోయినా పెద్ద ఎత్తున కొనుగోలు చేయవద్దని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన పొదుపు చర్యలు ప్రారంభించింది. రైల్వే శాఖ బొగ్గు, ఇనుము, ఆహార ధాన్యాల రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. గూడ్స్ రవాణాను పెంచడానికి, అలాగే ఇంధనాన్ని ఆదా చేయడానికి 41 జతల రైళ్లను రద్దు చేశారు. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎటువంటి సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసే సిమెంట్ పరిమాణాన్ని 15 శాతానికి తగ్గించారు. అయినా ఆర్థిక పరిస్థితి విషమించడంతో ప్లానింగ్ కమిషన్ (ప్రస్తుత నీతి ఆయోగ్) ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను వాయిదా వేసింది. అటు అంతర్జాతీయ చమురు సంక్షోభం.. ఇటు దేశీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఒకేసారి జరగడంతో దేశం ఆర్థికంగా దివాలా తీసే ప్రమాదం ఏర్పడింది. దాంతో కొన్ని నెలల్లోనే భారతదేశం తన బంగారు నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన ఆర్థిక అత్యవసర పరిస్థితిగా పేరుపడింది.
UPA -2లో రెండుసార్లు
కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యÖపీఏ ప్రభుత్వ హయాంలో మరోసారి పొదుపు చర్యలు తెరపైకి వచ్చాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత 2009 సెప్టెంబర్‌లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కొత్త పొదుపు మార్గదర్శకాలు ప్రకటించారు. మంత్రులు, ఉన్నతాధికారులు దేశీయ విమాన ప్రయాణాల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ను నివారించాలని సూచించారు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించారు. ప్రణాళికేతర వ్యయంలో పది శాతం కోత విధించారు. ఈ ఆంక్షలు కేంద్ర కేబినెట్‌లోనే తీవ్ర చర్చకు దారితీశాయి. విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇలాంటి ఆంక్షలు ఎంతవరకు ఆచరణాత్మకమైనవని పలువురు మంత్రులు ప్రశ్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం ఈ పొదుపు చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అలాగే యÖపీఐ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీ స్వయం ఎకానమీ క్లాస్‌లో విమాన ప్రయాణం చేశారు. అలాగే రాహుల్ గాంధీ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులోని సాధారణ చైర్ కార్‌లో ప్రయాణించి తోటి ప్రయాణికులతో కలిసి సాధారణ ఆహారం తీసుకున్నారు. అయితే ఆర్థికవేత్తలు మాత్రం ఈ చర్యలపై సందేహాలు వ్యక్తం చేశారు. దేశ బడ్జెట్ లోటు, సమస్యల పరిమాణంతో పోలిస్తే ఇలాంటి పొదుపు చర్యల ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు చాలా స్వల్పమని చాలామంది వాదించారు. 2012లో మరోసారి పరిస్థితి దిగజారింది. వృద్ధిరేటు పడిపోవడం, ఆర్థిక లోటు పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. దీంతో ప్రభుత్వం మళ్లీ పొదుపు చర్యలు అమలు చేసింది. ఫైవ్‌స్టార్ హోటళ్లలో సెమినార్లు నిర్వహించడాన్ని నిషేధించారు. కొత్త వాహనాల కొనుగోళ్లు నిలిపివేశారు. ప్రణాళికేతర వ్యయాన్ని పది శాతం తగ్గించుకోవాలని అన్ని శాఖలను ఆదేశించారు. విదేశీ పర్యటనలపై ఆంక్షలు పెట్టారు. మార్చి నెల ముగిసేలోపు ఏదోవిధంగా బడ్జెట్ నిధులను ఖర్చు చేయాలన్న తొందరపాటు నిర్ణయాలకు గేట్లు వేశారు.
కోవిడ్ కష్టకాలం
కోవిడ్`19 మహమ్మారి దేశాన్ని మరోమారు సంక్షోభంలోకి నెట్టింది. దానివల్ల సంక్షేమ, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరగడంతో 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం ఖర్చుల్లో కోత విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపును నిలిపివేసింది. కొత్త నియామకాలను కుదించి, పరిపాలన ఖర్చులు తగ్గించుకుంది. మళ్లీ ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అటువంటి సంక్షోభం ముంగిట దేశం నిలిచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు అంతరాయాలు, విదేశీమారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్నాయి. దీంతో ఇంధన వినియోగంలో పొదుపు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయనే స్వయంగా తన కాన్వాయ్ లోని వాహనశ్రేణిని తగ్గించుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పొదుపు చర్యలు అమలు చేస్తున్నాయి. అసోం ప్రభుత్వం తమ అధికారిక వాహనాల ఇంధన ఖర్చుల్లో 20 శాతం కోత విధించింది, ఆరునెలల పాటు కొత్త వాహనాల కొనుగోళ్లను నిషేధించింది. అధికారుల విదేశీ పర్యటనలను నిలిపివేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇచ్చే అల్పాహారాలను టీ, బిస్కెట్లకు మాత్రమే పరిమితం చేసింది. సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు కొన్ని శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలు తమ మంత్రులు, అధికారుల కాన్వాయ్‌ల పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీనితో పాటు కార్ పూలింగ్ (వాహనాలను పంచుకోవడం), ప్రజా రవాణా వినియోగం, రిమోట్ వర్క్‌లను ప్రోత్సహించే యత్నాలు ప్రారంభించాయి. మొత్తంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్లో నమ్మకాన్ని నింపేందుకు తాము కూడా ప్రజలతో పాటు సమానంగా త్యాగం చేస్తున్నామనే సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్లడానికి రాజకీయ నాయకత్వాలు, ప్రభుత్వాలు ఈ పొదుపు చర్యలను వినియోగించుకుంటున్నాయి.






Comments