ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
- NVS PRASAD

- 17 hours ago
- 2 min read
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు
సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో వేసిన సెటైర్లు యథాతథంగా అందిస్తున్నాం..
‘చిన్న విషయం ఏమీ కాదు కదా ఇది.. ఇవాళ్టి మన రాజకీయాల్లో ఉండాలంటే చాలా కష్టం కూడా, అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇవి ఎటో వెళ్లిపోయాయి. అలా అలా వెళ్లిపోయాయి, అందరూ భ్రమలో ఉన్నారు. ఎమ్మెల్యే అయితే డబ్బు సంపాదించవచ్చని, సర్పంచ్ అయితే డబ్బు సంపాదించవచ్చని, ఎంపీ అయితే డబ్బు సంపాదించవచ్చని.. ఈ భ్రమలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. తేలు కుట్టిన వాళ్ళు ఎవరంటే.. ఆల్రెడీ పోటీ చేసిన వాళ్లకి ఆ సంగతి తెలిసిపోయింది. ఏమీ లేదు ఇందులో సరుకు అని. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకువెళ్లి పారేయడం, ఆ తర్వాత ఇసుక అమ్మేయడం, పేడ అమ్మేయడం, మట్టి అమ్మేయడం, ఆ చెట్లు అమ్మేయడం.. అది చేయడం ఇది చేయడం. ఎన్ని చేసినా సరే మనం ఖర్చు పెట్టిన కోట్లు కలెక్ట్ అవుతాయా చెప్పండి? అవ్వవు అలాగా.
ఇప్పుడు సర్పంచ్‌గా పోటీ చేసేవాడికి కూడా నేను చెబుతున్నాను. ఊరికే మీరు చేతులు కాల్చుకోకండిరా బాబు. అక్కడ ఏమీ లేదు. ఊరికే మీరు ఖర్చుపెట్టిన డబ్బు ఆ పంచాయతీకి ఆదాయం లేదు ఐదేళ్లు. నువ్వు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నావు? ఆ ఆలోచనతో ఎవరూ రాజకీయాల్లోకి రాకండి. గౌరవం వస్తుంది, ఫర్వాలేదు నాకుంది ఖర్చుపెట్టుకో.. ఖర్చుపెట్టుకోండి. అక్కడ సంపాదించేది లేదు, గౌరవంగా ఇంకేవైనా మార్గాలు ఉంటే చేసుకోండి. అపఖ్యాతి పాలైపోయి, అది అయిపోయినప్పటికల్లా.. వీడు దొంగముండాకొడుకు, వీడు ఎప్పుడు వదిలిపోతాడురా అనే భావన తెచ్చుకోవడం అవసరమా?
కొత్త తరానికి నేను చెబుతున్న మాట ఇది. ఇంటెలిజెంట్‌గా నా దగ్గరికి వచ్చే సర్పంచ్ లందరికీ నేను చెబుతాను ‘వద్దు’ అని. వాళ్లు అప్పుడు వినరు. ఊరోడు ఒప్పుకోవట్లేదని, వాడు రెచ్చగొడుతున్నాడని.. అప్పుడు వినరు. తర్వాత తెలుస్తుంది. రాలిపోనాడు అని వాడే తర్వాత అంటాడు. ఇవన్నీ కాదురా.. నా మాట వినండి, స్టడీ చేయండి. చెడిపోయిన వాళ్లందరినీ చూడండి. ఎంతమంది చెడిపోయి ఉన్నారో.. ఇక్కడ మనమందరం చాలా పెద్దలం ఉన్నాం. వీళ్లందరూను ఇందులో కన్నంలో చేయి పెట్టి కలిపేసిన వాళ్లే. ఎవరినైనా అడగండి.. ఎవ్వడూ సంతోషంగా లేడు. రాజకీయాలు డబ్బు వైపు వెళ్లిపోయాయి. వెళ్లిపోతే అందులో సంపాదిద్దామని డబ్బు ఖర్చుపెట్టడం.. ఇదొక డర్టీ యాక్టివిటీ లాగా అయిపోయింది. పొలిటికల్ పార్టీలు కూడా డబ్బున్న వాడి వైపు పరుగులు పెడుతున్నాయి. డబ్బున్న వాడు ఎవడు దొరుకుతాడురా.. టికెట్ ఇచ్చేద్దాం అని.’










Comments