కృతజ్ఞతారాగం.. వసంతగానం
- NVS PRASAD

- 3 days ago
- 3 min read
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి
ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి
తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం
ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...!
కోయిల గానం అమ్ముడుపోదు. అందుకే ఆ కోయిలను ఎవరూ పెంచుకోరు. చిలుక అతి తెలివితో మాట్లాడి పంజరంలో చిక్కుకుంటుంది. నెమలి మనం ఆడమంటే ఆడదు. వానవిల్లు కనబడితేనే అది పులకరించి పురివిప్పి రంగుల హరివిల్లు సష్టిస్తుంది.
కానీ ఆ నమ్మకం.. ఆ అభిమానం.. ఆ గొప్పతనాలే శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎప్పుడో పాటను మర్చిపోయిన ఓ కోయిలమ్మను గుర్తుచేసుకుంటూ 31 ఏళ్లుగా ఓ వసంతం పండగ చేసుకుంటుంది.. ఆ కోయిలమ్మనే తల్లిగా భావించి ఆమె పుట్టినరోజే తనకు పండుగ రోజు అన్నట్లు సెలబ్రేట్ చేసుకుంటున్నది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఆ తల్లి పుట్టినరోజునాడే కొత్తబట్టలు తొడుక్కునే సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నది. ఆ కోయిల, ఈ వసంతం నిజానికి తల్లీకొడుకులు కాదు.. కానీ పదవి రాగానే అమ్మ ఆశీర్వాదం కంటే ముందే ఆ తల్లిలాంటి అక్క దీవెనలు తీసుకున్న నాయకుడి కథే ఇది.
నాణేలు విసిరి నోట్లు ఏరుకోవడమే నాయకత్వపటిమగా భావించే ఈ రోజుల్లో నోట్ల కట్టలు ఇంటికొచ్చినా కాదని తనకు రాజకీయ భిక్ష పెట్టిన మాజీ స్పీకర్, మాజీ మంత్రి కావలి ప్రతిభాభారతి పుట్టినరోజు వేడుకను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించారు. ప్రతిభాభారతి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటుండగా.. అప్పలనాయుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఫిబ్రవరి ఆరో తేదీ ప్రతిభాభారతి పుట్టినరోజు సందర్భంగా కొత్తబట్టలు తొడుక్కోవడం, కేక్ కటింగ్ చేయడం, ప్రతిభాభారతికి శుభాకాంక్షలు చెప్పడం 1995 నుంచి అప్పలనాయుడుకు ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఆరోజు ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన రోజుగా నమోదైంది. అప్పట్లో అంటే.. ఆమె కీలక పదవుల్లో ఉన్నప్పుడు అప్పలనాయుడు కనీసం ఎంపీటీసీ కూడా కాదు. తమ రాజకీయ భవితవ్యం కోసం ఆమెకు శుభాకాంక్షలు చెప్పేవారంటే ఒక లెక్క. ఇప్ప్పుడు ఒకవైపు పార్లమెంట్ సెషన్, మరోవైపు ఆంధ్రాభవన్‌లో పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులతో ప్రెస్ కాన్ఫరెన్స్, శనివారం, ఆదివారం పార్లమెంట్‌కు సెలవు కావడంతో శుక్రవారం సాయంత్రమే సొంత నియోజకవర్గం బయల్దేరడం వంటి బిజీ షెడ్యూల్ మధ్య కూడా ప్రతిభాభారతికి శుభాకాంక్షలు చెప్పి ఢిల్లీలో కేక్ కట్ చేసి, తన రాజకీయ భవితకు పునాది వేసిన ఆమె కోసం నాలుగు మంచిమాటలు చెప్పడం అప్పలనాయుడు కతజ్ఞతాభావానికి నిదర్శనం. ప్రతి ఏడాది నేరుగా ఆమె వద్దకే వెళ్లి శుభాకాంక్షలు తెలిపేవాడినని, పార్లమెంట్ సెషన్ ఉండటం వల్ల ఈసారి వెళ్లలేకపోతున్నానంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతిభాభారతికి ఫోన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఆమె కూడా అదే రీతిలో స్పందించారు. మనిషి అమీబా లాంటివాడు. ఈ క్షణం ఉన్నట్టు మరుక్షణం ఉండడు. ఎవరికి తోచిన లెక్కలు వారు కట్టి మంచీచెడులను నిర్దేశిస్తుంటారు. మనకు ఎదురైన అనుభవం, ప్రయోజనాల ఆధారంగా తీర్పు చెప్పేస్తుంటాం. కానీ ఇక్కడ ఈ రెండు క్యారెక్టర్లు అందుకు భిన్నంగా ఉండటమే ఈ కథనానికి మూలసూత్రం.
గతంలో ఈనాడులో రణస్థలం రిపోర్టర్‌గా ఉన్నప్పుడే ప్రతిభాభారతి ఫాలోవర్‌గా ఉన్న అప్పలనాయుడు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే లక్షలాది రూపాయలు ఇస్తామంటూ అదే రణస్థలానికే చెందిన ఒక తెలుగుదేశం నాయకుడు అప్పట్లో ప్రతిభాభారతికి ఆఫర్ చేశారు. అప్పటికే మండలస్థాయి పదవిలో ఉన్న ఆయనకు రాజకీయ ఉనికి ఉన్న, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న అప్పలనాయుడును ప్రోత్సహిస్తే ఏదో ఒకరోజు పై స్థాయికి వెళ్తాడని, అలాగే ఎవరో ఇచ్చే డబ్బుతో అన్నం తినాల్సిన పరిస్థితిలో తమ కుటుంబం లేదని భావించి ఈ పదవిని అప్పలనాయుడుకే ఇస్తానని మాటిచ్చిన కావలి ప్రతిభాభారతి అప్ప్పుడే అప్పలనాయుడులో నాయకుడ్ని చూశారు. అప్పట్లో పొందూరు మార్కెట్ కమిటీ చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో ఉండేది. గద్దె బాబూరావు అక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. ప్రతిభాభారతి తనకు పదవి ఇవ్వనందుకు కినిసి చీపురుపల్లి వైపు నుంచి నరుక్కొచ్చిన రణస్థలం నాయకుడిని, చీపురుపల్లి ఎమ్మెల్యేను కాదని చంద్రబాబును ఒప్పించి మరీ ఏఎంసీ చైర్మన్ పదవిని అప్పలనాయుడికే ఇప్పించారు ప్రతిభాభారతి. అదే అప్పలనాయుడు రాజకీయానికి తొలి అడుగు. ఆ తర్వాత పార్టీలో ఎన్ని పదవులు నిర్వహించినా 1995 నుంచి ఆమె ప్రతి పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేసుకోవడం, శుభాకాంక్షలు చెప్పడం ఒక సెంటిమెంటుగా మార్చుకున్నారు. ప్రతిభాభాs తి నిర్దేశించిన మేరకు కింజరాపు ఎర్రన్నాయుడుతో కలిసి అడుగుల వేగం పెంచారు. ఆ తర్వాత పార్లమెంట్ నాయకుడిగా ఎదిగారు. సమాంతరంగా పాత నీరు పోయి, కొత్త నీరు చేరడంతో ప్రతిభాభారతి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎవరైనా పరామర్శిస్తే ముక్తసరిగా నాలుగు ముక్కలు మాట్లాడటం తప్ప ఆమె క్రియాశీల రాజకీయాల్లో లేరు. కానీ తాను నాటిన విత్తనం ఒకటి మొక్కగా ఎదిగి.. ఒక పువ్వును తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిందని ఆమె మురిసిపోయారు. 2024 ఎన్నికల తర్వాత పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ప్రతిభాభారతి వద్దకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే అప్పలనాయుడు స్వగ్రామం వీఎన్‌పురంలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కారు.
సముద్రంలోని ముత్యం ప్రేమకానుకగా మారేవరకు దాని విలువ తెలియదు. పురుగు, పక్షి, మనిషి ఎవరు పండు తిన్నా చెట్టుకు సంతోషమే. ఆ చెట్టు నుంచి ఏమీ నేర్చుకోకుండా నరికేయడం మానేసి, ఆ కొమ్మపై కోయిల కూయడానికి వచ్చే ప్రతి వసంతాన్ని ఆస్వాదించడమే గొప్ప అనుభూతి.










Comments