ఓ తల్లీ వందనం!
- DV RAMANA
- 2 days ago
- 2 min read
తల్లికి వందనం సొమ్మును వెనక్కిచ్చిన మాతృమూర్తి
పిల్లల చదువుకు ఇస్తున్నవి చాలు.. నగదు అక్కర్లేదు
దాన్ని పాఠశాల అభివృద్ధికి వెచ్చించాలని వినతి
ఆమె స్ఫూర్తిదాయక తీరుపై ప్రశంసల వర్షం
అభినందన సందేశం పంపిన విద్యాశాఖ మంత్రి లోకేష్

ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో ఆర్థిక ప్రయోజనం లభిస్తుందంటే చాలు.. అర్హతలు, అవసరం ఉన్నవారితోపాటు డబ్బు ఉన్నవారు, ఉద్యోగులు సైతం ఆ ప్రయోజనాన్ని చేజిక్కించుకునేందుకు ఎగబడిపోతున్న కాలమిది. పథకం అందకపోతే ప్రభుత్వాన్ని, దాన్ని నడుపుతున్న పార్టీని నానారకాలుగా ఆడిపోసుకునే వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రూ.13వేల ఆర్థిక ప్రయోజనాన్ని ఆ మధ్య పాఠశాల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఆ సొమ్ము అందనివారు ఇప్పటికీ దాని కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు. తమకు ఎందుకు రాలేదని పలుచోట్ల అధికారులను నిలదీస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. కానీ ఓ మాతృమూర్తి మాత్రం వీరికి భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ప్రభుత్వం నుంచి తన ఖాతాలో జమ అయిన తల్లికి వందనం సొమ్ము రూ.13వేలు తనకు వద్దంటూ వెనక్కి ఇచ్చేసింది. అమె అలా తిరస్కరించడానికి రాజకీయ కారణాలో.. ఇంకేదో కాదు! తన బిడ్డను చదివించుకునే స్తోమత తనకు ఉన్నందున ఆ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తున్నానని ఆమె చెప్పడం కచ్చితంగా ఎందరికో కనువిప్పు అవుతుంది.. ఆదర్శంగా నిలుస్తుంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఆమె సాధారణ గృహిణి. పేరు శోభారాణి. స్వగ్రామం గార మండలం కె.మత్స్యలేశం. ఆమెకు ఇద్దరు కుమారులు. వారు గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో చదువుతున్నారు. చిన్న కుమారుడు ఎల్‌కేజీ చదువుతుండటంతో ఆ అబ్బాయికి తల్లికి వందనం మంజూరు కాలేదు. పెద్దవాడైన మరో కుమారుడికి మాత్రం పథకం మంజూరు కాగా ఇటీవల అందరితోపాటు ఆ సొమ్ము రూ.13 వేలు ఆ బాలుడి తల్లి శోభారాణి బ్యాంకు అకౌంట్‌లో జమ అయ్యింది. అయితే ఆమె ఆ సొమ్ములో ఒక్కపైసా అయినా తీసుకోకుండా.. ఆ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తిరిగి ఇచ్చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన మొత్తానికి మరో రెండువేలు కలిపి.. రూ.15 వేలు ఇవ్వడం విశేషం. దాంతో ప్రధానోపాధ్యాయుడు సుధీర్‌కుమార్ శోభారాణిని పిలిపించి.. ఎందుకు ఇలా చేశారని అడిగారు. దానికి ఆమె చెప్పిన సమాధానం ఆయన్ను అబ్బురపర్చింది.
అవి ఇస్తున్నారు చాలు..

సాధారణంగా ప్రభుత్వం ఎంత ఇచ్చినా.. ఇంకా ఏదో చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తుంటుంది. కానీ శోభారాణి దానికి భిన్నంగా ఆలోచించింది. ప్రభుత్వం ఇచ్చిన రూ.13 వేలు వెనక్కి ఇచ్చేయడానికి కారణాలు చెబుతూ ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ‘మా కుమారుడి చదువుకు ప్రభుత్వం బట్టలు, బూట్లు, పాఠ్య నోట్ పుస్తకాలు, బ్యాగు తదితర సరంజామా ఇవ్వడంతోపాటు రోజూ మధ్యాహ్నం భోజనం కూడా పెడుతోంది. ఇక నాకు డబ్బుతో అవసరం ఏముంటుంది? రెండోపూట నా కొడుకును పోషించుకునే బాధ్యత మాదే. ఉపాధ్యాయులు మా పిల్లలకు మంచి చదువులు చెబితే చాలు.. మాకు ఇంకేమీ అవసరం లేదు’ అని ఆమె చెప్పిన వివరణ ప్రధానోపాధ్యాయుడిని విభ్రమకు గురిచేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వడం సరే.. కానీ దానికి అదనంగా రూ.రెండు వేలు ఎందుకు ఇచ్చారు’ అని ఆయన ప్రశ్నించగా పాఠశాల అభివృద్ధికి తన వంతుగా ఇచ్చానని.. ఆ మొత్తం రూ.15 వేలను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని ఆమె కోరింది.
ఆమె ఓ స్ఫూర్తి జ్యోతి
దీనిపై ప్రధానోపాధ్యాయుడు సుధీర్ స్పందిస్తూ శోభారాతిని స్ఫూర్తి జ్యోతిగా అభివర్ణించారు. తల్లిదండ్రులందరూ ఇలాగే ఆలోచిస్తే విద్యా వ్యవస్థ ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుందన్నారు. ఇటీవల జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఆమె ఈ సొమ్మును వెనక్కి ఇచ్చారన్నారు. ఆమె చర్య మిగిలినవారికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. కే.మత్స్యలేశం పూర్తిగా మత్స్యకార గ్రామమని ఇక్కడి వారిలో అధికశాతం వెనుకబడినవారేనని చెప్పారు. వారిలోనే స్ఫూర్తిదాతలు ఉండటం విశేషమని కొనియాడారు. మోడల్ స్కూల్ తరహాలో నడుపుతున్న ఈ పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి తరగతులు ఉన్నాయని చెప్పారు. తల్లిదండ్రులందరూ ఇదే తరహాలో ఆలోచిస్తే విద్యారంగం కొత్త వెలుగు సంతరించుకుంటుందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు శోభారాణిని ప్రశంసిస్తున్నారు. కాగా ఛైల్డ్ రైట్స్ సంస్థ ప్రతినిధులు ఆమెను స్వయంగా అభినందించి, సత్కరించారు. కాగా శోభారాణి తల్లికి వందనం సొమ్మును తిరిగి ఇచ్చేయడం, దానికి ఆమె చెప్పిన కారణం గురించి విద్యాశాఖ మంత్రి లోకేష్ వరకు వెళ్లింది. దాంతో ఆయన స్పందించి ఆమెను అభినందిస్తూ ప్రత్యేకంగా సందేశం పంపించారు.
Comments