top of page

సరికొత్త అనుభూతి.. క్యాప్సూల్‌ హోటల్లో వసతి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 18, 2025
  • 2 min read
  • విశాఖ రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్‌ ప్యాడ్ల ఏర్పాటు

  • తక్కువ ఛార్జీలకే ఏసీ, వైఫై సహా అన్ని సౌకర్యాలు

  • ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లోనే తొలిసారి ఇక్కడ నిర్వహణ

  • దూరప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ఆధునిక సంతరించుకోవడంతోపాటు ప్రయాణికుల అవసరాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ మన్ననలు అందుకుంటోంది. తద్వారా ఆదాయం కూడా పెంచుకుంటోంది. ఇప్పటికే రైల్వేస్టేషన్లను అమృత్‌ భారత్‌ తదితర పథకాల కింద ఆధునీకకరిస్తున్న రైల్వేశాఖ టికెట్ల విక్రయాలు కార్గో రవాణా ద్వారానే కాకుండా ఇతరత్రా సౌకర్యాలు కల్పించి.. దానికి ప్రతిఫలంగా కొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషిస్తోంది. ఎప్పటికప్పుడు ఆచరణలో పెడుతోంది. అలాంటి ఆలోచనకు ఆచరణ రూపమే క్యాప్సుల్‌ హోటళ్ల ఏర్పాటు. దూరప్రాంత ప్రయాణికులకు, కనెక్టింగ్‌ రైళ్ల కోసం ఎదురు చూసేవారికి అందుబాటు ధరలో రైల్వేస్టేషన్ల ఆవరణలోనే సకల సౌకర్యాలతో వసతి సౌకర్యం కల్పించేవే ఈ హోటళ్లు. అటువంటి క్యాప్సూల్‌ హోటల్‌ విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఇదే మొదటి క్యాప్సూల్‌ హోటల్‌ కావడం విశేషం.

జపాన్‌ వ్యవస్థ ఇక్కడ అమల్లోకి

రైల్వే ప్రయాణికుల కోసం జపాన్‌లో ఇటువంటి వ్యవస్థను తొలుత అమల్లోకి తీసుకొచ్చారు. తర్వాత పలు ఇతర దేశాల్లోనూ క్యాప్సూల్‌ హోటళ్లు అమల్లోకి వచ్చాయి. వాటి నుంచి స్ఫూర్తి పొందిన ఇండియన్‌ రైల్వే అధికారులు అటువంటి వసతిని భారత రైల్వేస్టేషన్లలో కల్పిస్తే బాగుంటుందని యోచించి అమల్లో పెట్టారు. స్లీపింగ్‌ ప్యాడ్స్‌ అని కూడా వ్యవహరించే ఈ క్యాప్సూల్‌ హోటళ్లను ఇప్పటివరకు ముంబై, హైదరాబాద్‌ స్టేషన్లలోనే ఏర్పాటు చేశారు. తాజాగా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు ఈ జోన్‌ పరిధిలో అత్యధికంగా ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈ సౌకార్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ మేరకు విశాఖ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫారం మొదటి అంతస్తులో దీన్ని ఏర్పాటు చేశారు.

తక్కువ ధరకే అధునాతన సౌకర్యాలతో

సాధారణంగా రకరకాలు పనుల మీద, తీర్థయాత్రలకు, విహార యాత్రలకు వెళ్లే ప్రయాణికులు సంబంధిత రైల్వేస్టేషన్‌లో దిగిన వెంటనే ఎదురయ్యే మొదటి సమస్య వసతి. పరిచయం లేని, తెలిసినవారు లేని ఊరి కాని ఊళ్లలో లాడ్జింగులు, స్టార్‌ హోటళ్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. అయితే వీటిలో గదులు అద్దెలు ఏమాత్రం అందుబాటులో ఉండవు. కనీసం రోజువారీ అద్దె కనీసం రూ.500 నుంచి మొదలవుతుంది. కొంతమంది రైలు మారే క్రమంలో కనెక్టింగ్‌ రైళ్ల కోసం లేదా తాము ఎక్కాల్సిన రైలు ఆలస్యమైతే గంటల తరబడి స్టేషన్లలోనే వేచి ఉండాల్సి వస్తుంది. స్టేషన్లలో ఉండే డార్మెటరీలు, వెయిటింగ్‌ హాల్స్‌ ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. కాలకృత్యాలు వంటివి తీర్చుకోవడం కూడా కష్టమే. వాటి కోసం బయట లాడ్జింగులకు వెళ్దామంటే.. రోజువారీ అద్దె తప్ప గంటలవారీగా అద్దెకు రూములు ఇవ్వరు. ఫలితంగా ఈ తరహా ప్రయాణికులు చేతిచమురు వదిలించుకోవాలి లేదా కష్టమైనా రైల్వేస్టేషన్లలోనే కాలక్షేపం చేయాలి. సరిగ్గా ఇటువంటి వారి కోసమే రైల్వే శాఖ క్యాప్సూల్‌ హోటళ్లు లేదా స్లీపింగ్‌ ప్యాడ్లను అందుబాటులోకి తెచ్చింది. రైల్వేస్టేషన్లలో అన్ని రకాల ధరలు గుభేల్‌మనిపిస్తాయి. కానీ క్యాప్సూల్‌ హోటల్లో మాత్రం రూము ఛార్జీలు చాలా తక్కువగా ఉండటం విశేషం. మూడు గంటల కాలానికి సింగిల్‌ బెడ్‌ ఛార్జీ రూ.200గా నిర్ణయించారు. అదే సింగిల్‌ రూముకు 24 గంటలకు అంటే ఒక రోజుకైతే రూ.400 వసూలు చేస్తారు. డబుల్‌ బెడ్‌ తీసుకుంటే బూడు గంటలకు రూ.300, 24 గంటలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు ప్రత్యేకంగా బెడ్స్‌ కేటాయించారు. ఏసీ, వైఫై, వేడి నీరు వంటి సౌకర్యాలతో పాటు సౌకర్యంగా కూర్చొని టీవీ చూసేందుకు సోఫాలు కూడా ఏర్పాటు చేశారు.

రైలు బోగీలో ఉన్నట్లే..

తక్కువ స్థలంలో సౌకర్యవంతంగా స్లీపింగ్‌ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. అచ్చం రైలు బోగీలో ఉన్నట్లే ఇక్కడ స్లీపింగ్‌ ప్యాడ్లు అమర్చారు. ఒకే వరుసలో, అలాగే ఎదురెదురుగా పైన, కింద బెర్త్‌లు ఏర్పాటు చేశారు. దేనికి దానికి కర్టెన్లు కూడా ఉండటం వల్ల ప్రైవసీకి ఇబ్బంది ఉండదు. విశాఖ క్యాప్సూల్‌ హోటల్లో ఏసీ సౌకర్యంతో కూడిన సింగిల్‌ బెడ్‌ ప్యాడ్స్‌ 73, డబుల్‌ బెడ్‌ ప్యాడ్స్‌ 15 ఉన్నాయి. మహిళల కోసం 18 బెడ్‌లు ప్రత్యేకంగా కేటాయించారు. ఉచిత వైఫై సౌకర్యంతోపాటు విశ్రాంతి తీసుకునేవారి కోసం స్నాక్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. ఆధునిక వాష్‌రూముతోపాటు విశాఖపట్నం ప్రయాణికులు, పర్యాటకులకు అవసరమైన సమాచారం అందజేసే హెల్ప్‌ డెస్క్‌ కూడా అందుబాటులో ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page