టెస్టింగే నకిలీ..‘పేట’ స్వర్ణానికి మకిలి!
- NVS PRASAD
- 1 day ago
- 3 min read
నరసన్నపేటలో హాల్‌మార్కు మాయాజాలం
జీఎన్‌ఆర్‌లో ముద్రల్లేకుండానే అమ్మకాలు
నాగరాజుకే అవగాహన లేదంటే.. కొనుగోలుదారుల పరిస్థితేంటి?
బీఐఎస్ అధికారుల సోదాల్లో బండారం బట్టబయలు
బంగారం అమ్మకాల్లో మతలబులు షరామామూలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘బంగారం అమ్మితే పెద్దగా లాభాలుండవండీ.. తాత తండ్రుల నుంచి చేస్తున్నాం కాబట్టి నడపక తప్పదు’.. ఇదీ బంగారం కొనడానికి వెళ్లేవారికి తరచూ వినిపించే మాట. కానీ బంగారం వ్యాపారం చేస్తున్నవారు మాత్రం ఏడాదికో బ్రాంచి పెడుతూ స్థలాలు, పొలాలు, కార్లు, బంగ్లాలు కొనడం చేస్తుంటారు. వ్యాపారంలో పెద్ద మార్జిన్ లేనప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యమనే ప్రశ్న ప్రతి సామాన్యుడిలోనూ ఉంటుంది. కానీ బంగారం కొనడం సగటు భారతీయుడి వ్యసనం. ఆ మాటకొస్తే ఒంటిపై అలంకరించుకున్న బంగారాన్ని బట్టే గౌరవ మర్యాదలు లభిస్తాయి. చివరకు ఆ గౌరవం కోసం బంగారంలాగే ఉండే వన్‌గ్రామ్ గోల్డ్ ధరించి ఫంక్షన్లకు వెళ్తున్న మహిళలను చూస్తున్నాం. అయితే బలిసినవారు కొనుగోలు చేసిన బంగారం కూడా వన్‌గ్రామ్ గోల్డ్‌కు ఎక్కువ, కేడీఎం బంగారానికి తక్కువ అన్నట్టు ఉంది. కావాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్ పరిశీలించాలి.
కొన్నింటిపై భోగస్ మార్క్.. కొన్నింటిపై అదీ లేకుండానే..
నరసన్నపేట కేంద్రంగా గుడ్ల నాగరాజు షాపు (జీఎన్‌ఆర్)లో కేజీకి పైగా బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఎందుకయ్యా.. అంటే వాటి మీద బోగస్ హాల్‌మార్క్, బీఐఎస్ ముద్ర ఉందని, అలాగే హెచ్‌యూఐడీ నెంబరు లేని బంగారం ఉందని అధికారులు మీడియాకు తెలిపారు. హాల్‌మార్క్ లేకుండా 1072.45 గ్రాముల బంగారు ఆభరణాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు బీఐఎస్ అధికారులు గుర్తించారు. అయితే ఇది తమ తప్పు కాదని, స్థానిక హాల్‌మార్క్ సెంటర్ చేసిన తప్పిదమని బంగారం షాపు యజమాని గుడ్ల నాగరాజు చెప్పుకొచ్చారు. నిజమే.. హాల్‌మార్క్ ముద్రించే శ్రీ లక్ష్మీ హాల్‌మార్క్ కేంద్రానిదే తప్పు.. కాదనడంలేదు. మరి ఎటువంటి హాల్‌మార్క్ లేకుండా జీఎన్‌ఆర్ షోరూమ్‌లో దొరికిన బంగారం సంగతి ఏమిటి? సాధారణంగా పట్టణాలే కాదు గ్రామాల నుంచి పట్టణాలకు బంగారం కొనుగోలుకు వచ్చేవారికి అసలు బీఐఎస్ ఏమిటి? హాల్‌మార్క్ ఏమిటి? హెచ్‌యూఐడీ ఏమిటి? అనేవి తెలియవు. నరసన్నపేటలో బంగారు ఆభరణాల మీద ప్రభుత్వం నిర్దేశించిన బీఐఎస్, హాల్‌మార్క్/హెచ్‌యూఐడీ మార్క్ వేయడానికి నాలుగు సెంటర్లు ఉన్నాయి. వీటిలో కాకుండా బుడితి నేతింటి గోవిందరాజులుకు చెందిన శ్రీలక్ష్మీ గోల్డ్ టెస్టింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్‌లోనే తన బంగారు ఆభరణాలకు గుడ్ల నాగరాజు ఎందుకు బీఐఎస్ ముద్ర వేయించారన్నదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న.
వేరే వారి నెంబర్లతో హాల్‌మార్క్
నేతింటి గోవిందరాజులు, సింహాచలం పార్టనర్లుగా ఉన్న ఈ గోల్డ్ టెస్టింగ్ సెంటర్‌కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. బీఐఎస్ లైసెన్స్ పొందడానికి అవసరమైన ఇతర నిబంధనలను కాసేపు పక్కన పెట్టినా.. బంగారం, వెండి నాణ్యతను పరీక్షించే మిషనరీ విలువే కోటి రూపాయల వరకు ఉంటుంది. పోనీ స్థానిక లేదా చైనా మిషనరీ సమకూర్చుకోవాలన్నా కనీసం రూ.60 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే బంగారం షాపులు తెచ్చే నగలకు హాల్‌మార్క్ ముద్ర వేసి ఇచ్చేస్తుండటాన్ని బీఐఎస్ అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల ఆభరణం మీద ఉన్న హెచ్‌యూఐడీ నెంబర్‌ను గూగుల్‌లో టైప్ చేస్తే అసలు అందులో ఎంత బంగారం ఉంది? ఎక్కడ హాల్‌మార్క్ వేశారు? వంటి వివరాలన్నీ వచ్చేస్తాయి. దీన్నే ఆసరా చేసుకుని నెట్‌లో ఉన్న వేరే వారి హెచ్‌యూఐడీ నెంబర్లు వేసి గుడ్ల నాగరాజు పంపించిన బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ వేసే పంపించేసేవారు. ఇవన్నీ ఫేక్. నాగరాజు ఎంత చెబితే అంతమేరకు బీఐఎస్, హాల్‌మార్క్‌లు ముద్రించడం వల్ల అధికారుల తనిఖీలో ఇవి బయటపడిపోయాయి.
అనుమతులు లేవని తెలియని అమాయకుడట!
శ్రీకాకుళంలో రెండు గోల్డ్ హాల్‌మార్క్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఒకదాంట్లో కొన్నాళ్లు పని చేసిన గోవిందరావు తనకు మొత్తం పని వచ్చేసిందంటూ మరో పార్టనర్‌ను కలుపుకొని నరసన్నపేటలో హాల్‌మార్క్ సెంటర్ ప్రారంభించారు. గుడ్ల నాగరాజు షాపులో పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతుండటం గమనించి ఆయన్ను కస్టమర్‌గా పట్టుకున్నారు. లక్ష్మీ హాల్‌మార్క్ సెంటర్‌కు లైసెన్స్ ఉందో లేదో నాగరాజుకు తెలియకపోవచ్చు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనదే. కానీ దాన్ని విస్మరించి అందరికంటే చౌకగా ముద్ర వేస్తున్నాడని చెప్పి మొత్తం ఆభరణాలను ఆయన చేతిలో పెట్టి బీఐఎస్ అధికారులకు దొరికిపోయారు. లక్ష్మీ టెస్టింగ్ సెంటర్‌కు అనుమతులు లేని విషయం తమకు తెలియదని నాగరాజు బీఐఎస్ అధికారులకు చెప్పుకొచ్చారు. కానీ ఇదే జీఎన్‌ఆర్ షాపులో ఎటువంటి హాల్‌మార్క్ లేని ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. జోగిపేటలో నిర్వహిస్తున్న షాపులో వీటిని సీజ్ చేస్తున్నట్టు యజమానికి నోటీసు ఇచ్చామని అధికారులు పేర్కొన్నారు. నకిలీ హాల్‌మార్క్, హెచ్‌యూఐడీతో బంగారం ఆభరణాలు అమ్మడం ఒక నేరమైతే, అసలు ఎటువంటి హాల్‌మార్కూ లేకుండా విక్రయిస్తుండటం మరో నేరం. గ్రాము బంగారంలో 8 శాతం కాపర్(రాగి) పోను 92 శాతం బంగారం ఆభరణంలో ఉండాలి. రెండు గ్రాముల లోపు ఆభరణాలకు హాల్‌మార్క్ అవసరంలేదని నిబంధనలు చెబుతున్నాయి. అసలు 92 శాతం బంగారం ఉందో లేదో.. ప్రతి జాయింట్ వద్దా చెక్ చేసి బీఐఎస్ హాల్‌మార్క్ ఇవ్వాలి. కానీ టెస్టింగ్ సెంటరే నకిలీది కావడంతో షాపు యజమాని కోరుకున్నట్లు బీఐఎస్ హాల్‌మార్క్, హెచ్‌యూఐడీ ముద్రలు వేసి ఇచ్చేశారు. అసలు బంగారమే పెద్ద మోసం. 916 కేడీఎం బంగారం అంటూ కొనుగోలుదారులకు చెబుతారు. దాన్ని తిరిగి అమ్మినప్పుడు ఆ బంగారానికి 100 శాతం రేటు లెక్కగట్టి వెనక్కు తీసుకుంటామని చెబుతారు. కానీ గ్రహస్థితి బాగులేక అమ్మడానికి వెళ్తే.. అందులో 72 శాతం కూడా బంగారం లేదని, ఆ మేరకు మాత్రమే లెక్క కడతామని చెబుతారు. బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటే 92 శాతం బంగారం ఉంటుందనే గ్యారెంటీ ఇచ్చినట్లు లెక్క. ఈ ముద్ర ఉన్న తర్వాత కూడా బంగారాన్ని కరిగిస్తే 80 శాతం కూడా రావడంలేదని తేలిన సందర్భాలు కోకొల్లలు. అందుకే బంగారం బిస్కెట్లు అమ్మే షాపులు తక్కువగా ఉంటే.. ఆభరణాలు అమ్మే షాపులు మాత్రం పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నరసన్నపేటలో బీఐఎస్ అధికారుల దాడుల వల్ల ఈ వ్యవహారం బయటపడిరది కానీ ప్రతిచోటా ఇదే జరుగుతోంది.
Comments