గ్రీవెన్స్‌కు ఎండార్స్‌మెంట్ల గ్రహణం
- BAGADI NARAYANARAO

- Jul 17, 2025
- 3 min read
పరిష్కారానికి నోచుకోని వేలాది వినతులు
97 శాతం ఫిర్యాదులు క్లియర్ చేసేశామని నివేదికలు
కానీ పాత సమస్యలతోనే మళ్లీ మళ్లీ వస్తున్న బాధితులు
వాటిని ఆన్‌లైన్ చేయకుండా పక్కన పడేస్తున్నారని ఆరోపణలు

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన అలికాన జగన్మోహనరావు వారసత్వ హక్కులు కలిగిన భూమిని తనకు దఖలుపరచాలని కోరుతూ మీకోసం గ్రీవెన్స్‌లో ఐదుసార్లు అర్జీ సమర్పించాడు. చివరికి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆరు వారాల్లో పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించగా.. కోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటే పని పూర్తిచేస్తామని ఉన్నతాధికారులు హమీ ఇచ్చారు. ఆ మేరకు కేసులను విత్‌డ్రా చేసుకున్న ఫిర్యాదుదారుడు ఈ వారం గ్రీవెన్స్‌కు వచ్చి సమస్యను పరిష్కరించాలని మరోసారి అర్జీ సమర్పించుకున్నా అధికారులు దాన్ని తిరస్కరించారు. అదేమిటంటే.. న్యాయస్థానంలోనే తేల్చుకోవాలంటూ పంపించేశారు.
పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన దివ్యాంగుడు చౌదరి అసిరినాయుడు వికలాంగుల పింఛను కోసం ఏడాది కాలంలో రెండుసార్లు గ్రీవెన్స్‌లో విన్నవించినా ఫలితం కనిపించలేదు.
గార మండలం కే.మత్స్యలేశం పాఠశాలను కళింగపట్నానికి తరలించవద్దని కలెక్టర్ గ్రీవెన్స్‌కు నాలుగుసార్లు విన్నవించినా స్పందించపోగా.. పాఠశాలలో ఉన్న 40 మంది పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు.
శ్రీకాకుళం మండలం సానివాడ సర్పంచ్ లక్ష్మి తమ గ్రామ పరిధిలో అంపోలు బౌండరీలో ఉన్న బరాటం చెరువులో ఆక్రమణలను తొలగించి, ఆయకట్టుకు నీరందించాలని ఇప్పటికి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
శ్రీకాకుళం మండలం గూడెం గ్రామానికి చెందిన సీర కోటేశ్వరరావు తనకు వారసత్వంగా దక్కిన భూమి రీసర్వేలో లే అవుట్‌గా నమోదైందని, దీన్ని సరిదిద్ది మ్యూటేషన్ చేయాలని కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఐదుసార్లు విన్నవించారు. సీఎంవోకు ఫిర్యాదు చేయడంతోపాటు రెవెన్యూ మంత్రిని వినతిపత్రం ఇచ్చారు. అయినా ఇప్పటికీ పరిష్కారం చూపలేదు.
జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ప్రతి వారం వినతులు, ఫిర్యాదులు పట్టుకొని గ్రీవెన్స్‌లో అధికారులకు సమర్పిస్తున్నా.. మెజారిటీ సమస్యలకు పరిష్కారం చూపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా చెప్పుకొంటున్న గ్రీవెన్స్‌ను అన్ని స్థాయిల అధికారులు భారంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు ప్రస్తావించే సమస్యలకు సకాలంలో కచ్చితమైన పరిష్కారం చూపించాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మొక్కుబడి తంతుగా మార్చేస్తున్నారు. ప్రతివారం అధికారులు ప్రభుత్వానికి ఇస్తున్న లెక్కల ప్రకారం కలెక్టర్ గ్రీవెన్స్‌కు వందకు పైగా అర్జీలు వస్తున్నాయి. వీటిని మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ వచ్చే, గతంలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదంటూ రెండోసారి, మూడోసారి అందే రిపీటెడ్ వినతులు మరో 40 వరకు ఉంటున్నాయి. అయితే వీటిని ఆన్‌లైన్ చేయకుండా పరిష్కార దశలో ఉన్నాయని చెప్పి తిప్పి పంపిస్తున్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను శాఖల వారీగా విభజించి ఆయా శాఖలకు ఆన్‌లైన్‌లో పంపించి పరిష్కారించాలని ఆదేశిస్తున్నారు. అర్జీలు అందిన 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపించాలి. దీంతో అధికారులు ఎండార్స్‌మెంట్ ఇచ్చి అర్జీదారుడి ఫోటో తీసుకొని పంపించేస్తున్నారు. సమస్య పరిష్కారం కావడానికి సమయం పడుతుందని, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అవకాశం వచ్చినప్పుడు కచ్చితమైన పరిష్కారం చూపిస్తామని ఈ ఎండార్స్‌మెంట్లలో పేర్కొంటున్నారు. ఇటువంటి వారంతా కొన్ని రోజుల తర్వాత తమ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదంటూ మళ్లీ అర్జీలు పట్టుకొని గ్రీవెన్స్‌కు వస్తున్నారు. సమస్యకు పరిష్కారం కోరుతూ అర్జీ పెట్టుకొనేవారు కచ్చితంగా ఆధార్‌ను జత చేయాల్సి ఉంటుంది. ఒకసారి వినతిపత్రం ఇచ్చిన వ్యక్తి మళ్లీ మళ్లీ అదే ఆధార్‌తో పీజీఆర్‌సీలో నమోదు చేసుకోవడంతో సమస్య రీ ఓపెన్ అవుతుంది. ఇలాంటి వారందరికీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు.
పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు
కలెక్టరేట్ గ్రీవెన్స్ కాకుండా తహసీల్దారు కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ చాలా మంది గ్రీవెన్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లోనూ వినతులు తీసుకుంటున్నారు. కలెక్టర్, జేసీలను వ్యక్తిగతంగా కలిసి అర్జీలు సమర్పిస్తున్నవారూ ఉన్నారు. కొందరు నేరుగా సీఎంవో(ముఖ్యమంత్రి కార్యాలయం)లో ఫిర్యాదు చేస్తుంటే.. కూటమి పార్టీలు తమ కేంద్ర కార్యాలయాల్లో ప్రజాదర్బార్లు నిర్వహించి వినతులు, ఫిర్యాదులు స్వీరించి, పరిష్కారం కోసం వాటిని ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నారు. గ్రీవెన్స్‌లో సకాలంలో సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో ఒకే వ్యక్తి అన్నిచోట్ల ఒకే సమస్యపై ఫిర్యాదు చేయడం వల్ల ప్రజా సమస్యల పరిష్కార వేదికపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిపిన భూముల రీ సర్వేలో తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపిస్తామని గ్రామసభలు, ఆ తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించినా ఫలితం లేదు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఈ సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయారన్న అపవాదు ఉంది. రీసర్వేలో తలెత్తిన సమస్యలపై వేలల్లో అర్జీలు అందాయి. వీటి పరిష్కారం కోసం రైతులు గ్రీవెన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. జాయింట్ ఎల్‌పీఎంలు జనరేట్ కావడంతో ఈ`క్రాప్ నమోదు, పంట రుణాలు, భూముల క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. గ్రీవెన్స్‌లో జాయింట్ ఎల్‌పీఎంలపై సుమారు 12 వేల అర్జీలు వచ్చాయి. వీటిని పరిష్కరించకుండానే రైతులకు ఎండార్స్‌మెంట్ ఇస్తున్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం వెల్లడిరచిన తర్వాతే పరిష్కారం చూపించగలమని అధికారులు చెబుతున్నారు.
భూ సమస్యలపై వినతులే అధికం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 ప్రభుత్వ శాఖలకు సంబంధించి జిల్లాలో నిర్వహిస్తున్న మీకోసం గ్రీవెన్స్‌లో ఇప్పటి వరకు 63,975 అర్జీలు వచ్చాయి. వీటిలో 62,219 అర్జీలను పరిష్కరించినట్టు అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ పరిధిలో 31327 అర్జీలకుగాను 30372, సర్వే ల్యాండ్ రికార్డ్స్ పరిధిలో 22,737కు గాను 22,562 అర్జీలు పరిష్కరించినట్టు చూపిస్తున్నారు. కానీ ఈ లెక్కల్లో వాస్తవం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు గ్రీవెన్స్‌ను పర్యవేక్షిస్తుండంతో జిల్లా అధికారులు అర్జీదారులకు ఎండార్స్‌మెంట్లు ఇచ్చి సమస్యలు పరిష్కారించినట్లు చూపించి చేతులు దులుపుకొంటున్నారు. ఎండార్స్‌మెంట్ ఇచ్చిన తర్వాత సమస్య పరిష్కారం కాలేదని మళ్లీ అందే అర్జీలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసిన వెంటనే పాతవి కూడా రీ ఓపెన్ అవుతాయి. అందువల్ల ఇటువంటి వినతులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న పొరపాట్ల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపణలున్నాయి. దీనివల్ల వచ్చే అర్జీలకు పరిష్కారం లభించడం లేదని విమర్శలున్నాయి. వీటిని క్షేత్ర స్థాయిలో పరిష్కంచాల్సిన రెవెన్యూ ఉద్యోగులు తప్పులు చేయడం వల్ల ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావల్సి ఉంటుంది. దీంతో ఎల్పీఎం, జీరో ఎక్స్‌టెంట్, ప్రభుత్వ భూమి ఆక్రమణ, అడంగల్ లాంటి సమస్యలకు పరిష్కారం చూపించకుండా ఎండార్స్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు, వివాదస్పద భూములు, చెరువులు, ప్రభుత్వ భూమి ఆక్రమణ, రీ`సర్వేలో రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాలపైనే గ్రీవెన్స్‌కు అధిక శాతం ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. 20 ఏళ్లు పైగా లబ్ధిదారుల అనుభవంలో ఉన్న డీ పట్టా భూములు, పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను వారి వారసుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ఫ్రీ హోల్డ్ జీవోను వైకాపా ప్రభుత్వం 2023లో జారీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవోను పెండిరగులో పడేసింది. వీటికి సంబంధించిన అంశాలపైనా వినతులు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు 97 శాతం అర్జీలకు పరిష్కారం చూపించినట్టు ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తున్నారు.










Comments