చెప్పకుండా వెళ్లడంపై కలెక్టర్ ఆగ్రహం
నోటీసులు ఇవ్వనున్న ప్రత్యేక అధికారి
మూడు తప్పులు దాటేసిన దుర్గాప్రసాద్
రివ్యూలకు గైర్హాజరుపై గతంలోనే సంజాయిషీ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సంక్రాంతి సెలవులకు సొంతవూరు వెళ్లి, మళ్లీ విధుల్లో చేరిన నగరపాలక సంస్థ కమిషనర్ దుర్గాప్రసాద్‌కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రaలక్ ఇచ్చారా..? అంటే అవుననే అంటున్నాయి కలెక్టరేట్ వర్గాలు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇవ్వకుండా, ముందస్తు అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టినందుకు నగరపాలక సంస్థ కమిషనర్‌కు కలెక్టర్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇప్పటికే రెండుసార్లు మందలించినా కమిషనర్ వినిపించుకోనందున మూడోసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నెల 11న మూడోసారి కలెక్టర్ అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టి 17న విధుల్లో చేరేందుకు వచ్చిన కమిషనర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పనిలో పనిగా కమిషనర్‌కు కేటాయించిన వాహనాన్ని వారం రోజుల పాటు వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. కానీ శుక్రవారం మళ్లీ విధుల్లో చేరిన కమిషనర్ నగరంలోని అనేక ప్రాంతాలు పర్యటించారు.
గత ఏడాది నవంబర్ 9న జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమీక్షకు హాజరు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్‌కు కలెక్టరేట్ నుంచి సమాచారం ఇచ్చారు. కాని ఆ సమావేశానికి హాజరు కాకుండా సెలవుపై వెళ్లిపోయారు. సమావేశానికి హాజరు కానివారిని హెచ్చరిస్తూ సంజాయిషీలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులు సెలవుపై వెళితే తప్పనిసరిగా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని జెడ్పీ సమావేశంలో సూచించారు. దీన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ రెండుసార్లు ధిక్కరించారు. సెలవు కావాలని మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు మెయిల్ చేసి, అందులో కాపీ టు అంటూ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్‌కు ఒక మెయిల్ చేశారని తెలిసింది. దీన్ని తప్పుపడుతూ మెయిల్ చేసే బదులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అనుమతి తీసుకోవాలని చెప్పినా చెప్పాపెట్టకుండా సమాచారం ఇవ్వకుండా మూడోసారి సెలవుపై వెళ్లడాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ నోటీసులు జారీ చేసి కమిషనర్‌కు కేటాయించిన వాహనాన్ని వారం రోజుల పాటు వెనక్కి తీసుకుంటూ నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నిబంధనల ప్రకారం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్‌కు సమాచారం ఇవ్వకుండా డైరెక్టర్ నుంచి అనుమతి తీసుకొని సెలవుపై వెళ్లడం కుదరదని నోటీసులో పేర్కొంటూ కొన్ని సెక్షన్లను ఉదహరించారని తెలిసింది. కమిషనర్‌కు వారం రోజుల పాటు వాహనం నిలుపుదల చేయడానికి మొదట మున్సిపాలిటీ 1965 చట్టాన్ని ప్రస్తావించి నోటీసులు తయారుచేసిన కలెక్టరేట్ అధికారులు కలెక్టర్ సూచనలతో ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ రూల్స్‌ను అనుసరించి నోటీసులు తయారుచేసినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, కమిషనర్‌గా ప్రసాద్ రాజకీయంగా తీవ్ర ఒత్తిడితో ఉన్నారని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫైల్స్‌పై సంతకాలు చేయాలని ఒత్తిడి పెరగడమే తరచూ సెలవుపై వెళ్లిపోవడానికి కారణమని తెలుస్తుంది. కార్పొరేషన్ కార్యాలయంలో ఏం జరుగుతుందో, అంతకు క్రితం ఏం జరిగిందో కనీస సమాచారం ఆయన వద్ద లేకపోవడం వల్ల సమీక్షలకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంతకాలు చేయకుండా కొన్ని ఫైల్స్‌ను తన టేబుల్‌పైనే అంటిపెట్టుకొని ఉన్నారని విశ్వసనీయ సమాచారం. రోజుల తరబడి సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని సమాచారం. ఆ ఫైల్స్‌పై సంతకాలు చేయాలని రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, ఈ విషయం పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదని తెలిసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే తరచూ సెలవుపై వెళుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కమిషనర్‌గా విధుల్లో చేరిన రోజు నుంచే కూటమి పార్టీ నాయకుల నుంచి ఏదో ఒక విధంగా ఒత్తిడి వస్తునే ఉందని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. దీంతో కమిషనర్‌గా ప్రసాద్ శ్రీకాకుళంలో పని చేయడానికి నిరాశక్తత చూపిస్తున్నారని తెలిసింది. అందులో భాగంగానే కలెక్టర్ ఇచ్చిన నోటీసులతోనైనా విముక్తి కలుగుతుందన్న భావనతో కమిషనర్ ప్రసాద్ ఉన్నట్టు తెలిసింది. గతంలో ఇక్కడ అనేక అభివృద్ధి పనుల్లో, వాటి బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయి. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు పనిచేసిన కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు బదిలీపై వెళ్లిపోయారు. అసలు ఏ పని ఎంతవరకు జరిగింది? ఎంతమేరకు బిల్లుల చెల్లింపు జరిగిందన్న డేటా కార్పొరేషన్ కార్యాలయంలో లేదు. ఇటీవల జనరల్ ఫండ్స్‌తో, సుడా నిధులతో నగరంలో అనేక పనులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి సమీక్షలోనూ కలెక్టర్ ఒక ప్రశ్నావళి సిద్ధం చేసుకొని పనుల్లో ప్రగతిని విచారిస్తున్నారు. కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్ల వ్యవస్థ కూడా ఒక పద్ధతిలో లేదు. ఒకే వ్యక్తికి అనేక పనులు ఇవ్వడం, గతంలో బిల్లులు చెల్లింపులకు నోచుకోని వారికి ఇప్పటికీ మోక్షం కలగకపోవడం వంటివాటిపై గ్రీవెన్స్‌లో నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి తోడు టౌన్‌ప్లానింగ్ విభాగంలో అనధికారిక కట్టడాల మీద కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని దూరం పెట్టాలో తెలియక తన వద్దకు వచ్చిన ప్రతి ఫైల్ వైపు కమిషనర్ ప్రసాద్ అనుమానంగానే చూస్తున్నారు. చివరకు వేకెండ్ ల్యాండ్ టాక్స్ కడతాం మహాప్రభో, డిమాండ్ ఎంతో చెప్పండి అని దరఖాస్తు చేసుకున్నవారి అభ్యర్థనలు కూడా కమిషనర్ పట్టించుకోవడంలేదు. కారణం.. ల్యాండ్ లిటిగేషన్లు ఉన్నాయంటూ ఇప్పటికీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలో పనులు చేయించుకున్న పెద్దలు అన్నింటికీ అడ్డు తగులుతున్నారు. దీంతో మున్సిపల్ స్టాండిరగ్ కౌన్సిల్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్నా కూడా కమిషనర్ కొన్ని ఫైల్స్ వైపు కన్నెత్తి చూడటంలేదు. కలెక్టర్ గ్రీవెన్స్‌తో పాటు ఎమ్మెల్యే కూడా ప్రజాదర్బార్ నిర్వహిస్తుండటంతో కార్పొరేషన్‌కు చెందిన ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటి నడుమ చురుగ్గా పని చేయడం కుదరడంలేదనే భావన కమిషనర్‌కు ఉంది.
Comments