సాకు పిడుగుపాటు..నిర్లక్ష్యంతోనే చేటు!
- BAGADI NARAYANARAO
- 2 days ago
- 2 min read
గ్రానైట్ క్వారీల్లో ఆరు నెలల్లో రెండు ప్రమాదాలు
రెండిరటికీ పిడుగులే కారణమని వాదన
బ్లాస్టింగుల్లో నిబంధనలు పాటించకపోవడమే కారణం
ఆరుగురు మృతి చెందినా కళ్లు తెరవని యాజమాన్యాలు, అధికారులు

(ఈ నెల7న మృతి చెందిన ముగ్గరు కార్మికులు (ఫైల్)
(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
ఆరు నెలల వ్యవధిలో ఒకే మండలంలోని రెండు క్వారీల్లో ప్రమాదాలు. ఈ రెండు దుర్ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కానీ పిడుగుపాటుతోనే ఈ రెండు ప్రమాదాలు జరిగాయని క్వారీ యాజమాన్యాలు, అధికారులు వాదిస్తుంటే.. బ్లాస్టింగ్ సందర్భంగా జరిగిన దుర్ఘటనలని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. షరా మామూలుగానే రాజీ మార్గంలో బాధిత కుటుంబాలను మెత్తబర్చి నామమాత్రపు పరిహారంతో నోళ్లు మూయించారు. ఈ ఏడాది మే 17న మెళియాపుట్టి మండలం దీనబంధుపురం పరిధిలోని దబ్బగూడ వీఆర్‌డీ క్వారీలో జరిగిన ప్రమాదంలో టెక్కలి మండలానికి చెందిన ముగ్గరు కూలీలు మృతి చెందారు. పిడుగు పడటం వల్ల మరణాలు సంభవించాయని క్వారీ యాజమాన్యం మొదట ప్రకటించింది. తద్వారా ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ మృతుల శరీరాలు ఛిద్రమైన స్థితిలో ఉండటంతో ప్రమాదానికి పిడుగుపాటు కారణం కాదని నిర్ధారణ అయ్యింది. దానికి తగినట్లే బ్లాస్టింగ్ లోపాల వల్ల ప్రమాదం జరిగిందని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు నిర్ధారించారు. దాంతో కార్మిక సంఘాలు యాజమాన్యంపై రాకీయంగా, సామాజికంగా ఒత్తిడి రావడం, బాధిత కుటుంబాలు ఆందోళనలకు దిగడంతో ఒక్కో కుటంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించారు. దాన్ని మర్చిపోకముందే ఇప్పడు రాజయోగి క్వారీ వంతు వచ్చింది. మెళియాపుట్టి మండలం గంగరాజుపురం పరిధిలోని జంగాలపాడు రాజయోగి క్వారీలో ఈనెల ఏడో తేదీన పిడుగుపడి ముగ్గురు కూలీలు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, పిడుగు పడటం వల్లే ప్రమాదం సంభవించిందని జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రమాదం జనరేటర్ వల్ల జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. జనరేటర్ ఆఫ్ చేయడానికి వెళ్లినప్పుడు విద్యుత్ షాక్ గురై మృతి చెందినట్టు కార్మికులు చెబుతున్నారు. జనరేటర్ వద్దకు వెళ్లే సమయంలోనే పిడుగు పడటం వల్ల ముగ్గరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారని అంటున్నారు. రాజయెగి యాజమాన్యానికి దేశ విదేశాల్లో మైనింగ్ నిర్వహించిన అనుభవం ఉండటం, కేంద్రంలో బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం ఉన్నందున దీన్ని కేవలం పిడుగు ప్రమాదంగా చూపించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
చేతులు కట్టేసిన రాజకీయ పరపతి
వీఆర్‌డీ ప్రమాద సమయంలో చేసినట్లు రాజయోగి క్వారీ యాజమాన్యంపై ఒత్తిడి తేవడానికి ఎవరూ మందుకు రాలేదు. వీఆర్‌డీ యజమానులు రాజమండ్రికి చెందిన వారే కావడం వల్ల ఒత్తిడి తెచ్చి సాధించగలిగారు. అదే సమయంలో ముంబైకి చెందిన రాజయోగి యాజమాన్యానికి రాజకీయ సంబంధాలు ఉండటం వల్ల అలా చేయడానికి ఎవరూ సాహసించలేదు. రాజయోగి క్వారీలో ముగ్గరు మృతి చెందినా కూలీలకు పరిహారం చెల్లించాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. సీఐటీయూ అధ్వర్యంలో గ్రానైట్ కార్మిక సంఘాలు ఆందోళన చేసి పోస్టుమార్టంకు నిరాకరించారు. దాంతో యాజమాన్యం దిగి వచ్చి మృతులకు రూ.8 లక్షలు చొప్పున చెల్లించడానికి అంగీకరించింది. విపత్తు కారణంగా మృతి చెందినట్టు కేసు నమోదు కావడంతో ప్రభుత్వం నుంచి రూ.4 లక్షలు చొప్పున బాధిత కుటుంబాలకు అందించనున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం పీఎఫ్ అకౌంట్ తెరిపించి ఉంటే ఈడీఎల్‌ఐ బీమా వర్తించి ఉండేది. అలాగే ఈఎస్‌ఐ జమ చేసి ఉంటే వయస్సును బట్టి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఈపీఎఫ్ పెన్షన్ లభించేది. కానీ ఈ సంస్థతో సహా జిల్లాలోని 70 క్వారీల్లో పనిచేసే కార్మికలకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు అమలు చేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. క్వారీల్లో బ్లాస్టింగ్‌కు పేలుడు పదార్ధ్ధాలు అమర్చేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి లైసెన్స్ పొందిన కార్మికులనే వినియోగించాలి. కానీ మెజారిటీ క్వారీల్లో అలాంటివారు కనిపించరు. కాస్త అనుభవం ఉన్న కూలీలకే అధిక వేతనం ఇచ్చి బ్లాస్టింగ్ పనులకు వాడుకుంటున్నారు. వీఆర్‌డీ క్వారీలో మృతి చెందిన ముగ్గురు ఆ తరహా కార్మికులే. రాజయోగి యాజమాన్యం మరో అడుగు ముందుకేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ క్వారీల నుంచి కార్మికులను తీసుకువచ్చారు.
డొల్లతనం బట్టబయలు
ఆ ప్రమాదం తర్వాత జిల్లాలో రెండు నెలల పాటు మైనింగ్ నిలిపేశారు. తర్వాత మళ్లీ అన్ని రకాల మైనింగ్‌కు, అన్ని క్వారీలకూ అనుమతులు ఇచ్చేశారు. రాజయోగి క్వారీలో జరిగిన ప్రమాదంతో మైనింగ్, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన క్లియరెన్స్ ల్లోని డొల్లతనం బయట పడిరది. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా ఎలా అనుమతలు ఇచ్చేశారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఉపేక్షిస్తుండటంతో క్వారీ ప్రమాదాలకు పిడుగుపాటు రంగు పూసి యాజమాన్యాలు తమ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు త్రుణమో. ఫణమో చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం తప్ప తర్వాత క్వారీల్లో భద్రతా ప్రమాణాల గురించి పట్టించుకోవడంలేదు. వాతావరణ ఆనుకూలంగా లేనప్పుడు బ్లాస్టింగ్ చేయరాదని, కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారీల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు తప్పనసరి చేయాలని కలెక్టర్ మంగళవారం ఆదేశించారు. అయితే ఇవేవీ కొత్త నిబంధనలు కావు. వీటి అమలు విషయంలో అధికారులు ముందునుంచే కచ్చితంగా వ్యవహారిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండేది కాదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
Comments