top of page

వెండి.. ఎందుకంత ఉరవడి?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 hours ago
  • 3 min read
  • అమాంతం పెరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక వినియోగం

  • సోలార్‌ ప్యానల్స్‌, విద్యుత్‌ వాహనాలు, ఏఐ రంగాలే కారణం

  • వీటికి తోడు భారత్‌లో పెరిగిన ఆభరణాలు, వెండిపై పెట్టుబడులు

  • వాడకం పెరిగినా ఆ స్థాయిలో పెరగని ఉత్పత్తి

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

చాన్నాళ్లుగా బులియన్‌ మార్కెట్‌ అత్యంత బుల్లిష్‌గా ఉంటోంది. బులియన్‌ మార్కెట్‌ అంటే బంగారం, వెండి వంటి ప్రత్యేక లోహాల మార్కెటింగ్‌ లావాదేవీలు నిర్వహించేది. ఈ మార్కెట్‌ ఎంత బుల్లిష్‌గా ఉంటే కొనుగోలుదారుల గుండెలు అంత వేగంగా కొట్టుకుంటుంటాయి. ఎందుకంటే.. బంగారం, వెండ ధరలు గతంలో ఎన్నడూ లేనంత.. ఎవరూ ఊహించనంత వేగంగా పరుగులు తీస్తున్నాయి. బంగారం సంగతి సరే.. దానికి మించిన ఉరవడితో వెండి ధరలు దూసుకుపోతున్నాయి. శుక్రవారం విశాఖ, హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లలో వెండి కిలో ధర రూ.2,03,000గా ఉంది. అంటే ఒక గ్రాము ధర రూ.203 అన్నమాట. కేజీ ధర ప్రతిరోజూ రూ.వెయ్యి నుంచి రూ.మూడు వేల రేంజ్‌లో పెరుగుతూ వస్తోంది. గత ఏడాది కాలంలో వెండి ధర 72 శాతానికిపైగా ఎగబాకిదంటే దాని దూకుడు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణాలు చెప్పాలంటే .. అంతర్జాతీయ పరిణామాలతోపాటు భారత్‌లో దాని వినియోగం, ఇటీవలి కాలంలో పెట్టుబడి సాధనంగా దాన్ని పరిగణనలోకి తీసుకోవడం, పారిశ్రామిక వినియోగం పెరగడం.. పెరుగుతున్న ఈ అవసరాలకు తగినంత ఉత్పత్తి లేకపోవడం వంటివన్నీ వెండిని స్థిరంగా ఉండనివ్వకుండా పరుగులు తీయిస్తున్నాయి.

పెరిగిన బహుముఖ వినియోగం

అంతర్జాతీయంగా వెండి వినియోగం అపరిమితంగా పెరిగింది. బహుళ రంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. కానీ పెరిగిన వినియోగానికి తగినట్లు ఉత్పత్తి లేకపోవడం వల్లే ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఆధునిక కాలంలో ఎమర్జింగ్‌ రంగాలైన సోలార్‌ ప్యానల్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, 5జీ కమ్యూనికేషన్‌ వ్యవస్థల్లో వెండి వినియోగం విరివిగా ఉంది. భారత్‌తోపాటు అనేక దేశాల్లో సంప్రదాయ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్‌ విద్యుత్‌ వినియోగం బాగా పెరుగుతోంది. ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ప్యానల్స్‌దే కీలకపాత్ర. ఆ ప్యానల్స్‌ తయారీలో వెండిని వినియోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా వెండిని వినియోగించే చైనాలో సోలార్‌ ప్యానళ్ల తయారీ ఈ ఏడాది మొదటి ఆరునెలల్లోనే 70 శాతంపైగా పెరిగింది. దీనికి అనుగుణంగా వెండి వినియోగం కూడా పెరుగుతుంది. అదే రీతిలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఇటీవలి కాలంలో ఎన్నో రెట్లు పెరిగింది. ఈ వాహనాల్లో వాడే బ్యాటరీలు, ఇతర కనెక్షన్లలో కూడా వెండి వాడుతున్నారు. అందువల్ల వాహనాల కొనుగోళ్లు పెరిగితే.. ఆ మేరకు వెండి వాడకం కూడా పెరిగినట్లే. ఈ కారణాల వల్లే వెండికి డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది. ఇక భారత్‌ వంటి దేశాల్లో ఆభరణాలు, ఇంట్లో అలంకార, రోజువారీ వినియోగానికి వెండి వస్తువులనే వాడటం చాలామంది హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు.

పెరుగుతున్న కొరత

ఈ డిమాండ్‌కు తగినట్లు వెండి సరఫరా లేదు. అంతర్జాతీయ సిల్వర్‌ మార్కెట్‌ లెక్కల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్‌ టెక్నాలజీ, సోలార్‌ ప్యానల్స్‌, ఎలక్ట్రిక్‌ వాహన రంగాల కారణంగా ఒక్క పారిశ్రామిక రంగంలోనే వెండి వినియోగం 680.50 మిలియన్‌ ఔన్సు(ఒక ఔన్సు అంటే దేశాన్ని బట్టి 28 నుంచి 31 గ్రాములు)లకు చేరింది. అయితే ఆ స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ఆ ఆర్థిక సంవత్సరంలో 148.9 మిలియన్‌ ఔన్సుల లోటు కనిపించింది. 2025లో ఆ లోటు 117.7 ఔన్సుల వరకు ఉండవచ్చని అంచనా. ఇక భారతదేశం పరిస్థితి చూస్తే వెండి వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలోనే మనదేశం రెండోస్థానంలో ఉంది. దేశంలో 2024లో వెండి పారిశ్రామిక వినియోగం నాలుగు శాతం, వెండి కాయిన్లు, బార్లు వంటి పెట్టుబడి సాధనాల వినియోగం ఏకంగా 21 శాతం పెరిగింది. ఇక ఆభరణాల వినియోగం మూడు శాతం పెరుగుదల నమోదు చేసింది. అయితే వెండి ఉత్పత్తి పెద్దగా లేకపోవడంతో మనదేశంలో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఒక్క 2022 ఆర్థిక సంవత్సరంలోనే తొమ్మిది వేల టన్నులు దిగుమతి చేసుకున్నట్ల గణాంకాలు చెబుతున్నాయి.

అంతే వేగంగా పడిపోనూ వచ్చు

వెండి ధర వేగంగా పెరుగుతున్నందున పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయన్న ఆశతో వేలం వెర్రిగా కొనుగోలు చేయడం కూడా అనర్థమేనని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎంత వేగంగా పెరుగుతుందో.. ఏ క్షణంలోనైనా అంతే వేగంతో ధర పడిపోయే ప్రమాదముందని అంటూ.. గత అనుభవాన్ని, దానికి కారణాలను ప్రస్తావిస్తున్నారు. 1979లో అమెరికాలో ఔన్స్‌ వెండి 6.5 డాలర్లు ఉండేది. ఇప్పట్లాగే చాలామంది కొనుగోలుకు ఎగబడ్డారు. ఆ సమయంలో హంట్‌ సోదరులు ప్రపంచ మార్కెట్‌లో ఉన్న మొత్తం వెండిని కొనేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. వారి చర్యల ఫలితంగా 1980 నాటికి ఔన్స్‌ వెండి 49.50 డాలర్లకు ఎగబాకింది. కానీ ఏడాదిన్నర వ్యవధిలోనే మార్కెట్‌ ఒకేసారి పతనమవ్వడం ప్రారంభించింది. చివరికి ఔన్స్‌ ధర 90 శాతం పతనమై 4.5 డాలర్ల కు దిగిపోయింది. 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. బంగారం ధర పతనమైతే దాన్ని స్థిరీకరించడానికి దేశ విదేశాల ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగుతాయి. కానీ వెండి విషయంలో ఆ రక్షణ లేదు. బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్స్ఛేంజ్‌ కరెన్సీగా పరిగణిస్తారు. కానీ వెండికి ఆ హోదా లేదు. బంగారం ధరలు వేగంగా పడిపోవడం ప్రారంభిస్తే మన రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాతోపాటు చైనా, రష్యా, అమెరికా సెంట్రల్‌ బ్యాంకు వంటి విదేశీ సంస్థలు రంగంలోకి దిగి కొనుగోళ్లు ప్రారంభించి ధర మరింత పడిపోకుండా అడ్డుచక్రం వేస్తాయి. కానీ వెండి ధర పడిపోతున్నా అడ్డుకునేందుకు ఈ సంస్థలేవీ పూనుకోవు. ఒకసారి పతనం ప్రారంభమైతే ధర పాతాళానికి వెళ్లిపోవాల్సిందే. అందువల్ల వెండి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page