మన వైద్యానికి డబ్బు జబ్బు!
- Prasad Satyam
- 2 days ago
- 3 min read
దాదాపు సగం టెస్టులు, ఆపరేషన్లు అవసరం లేనివే
ప్రైవేటు వైద్యరంగంలో విచ్చలవిడి దోపిడీ పర్వం
వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తే జరిగేది అదేనన్న మాజీమంత్రి ధర్మాన
ఆయన మాటలు యదార్థమని స్పష్టం చేస్తున్న నివేదికలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుపడుతూ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కొన్ని కీలకాంశాలు ప్రస్తావించారు. ఆ సమావేశంలో ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలను పక్కన పెడితే.. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగానికి మెడికల్ కళాశాలలను అప్పగిస్తే ఏం జరుగుతుందన్నది, పేద రోగులు ఎంతగా ప్రభావితమవుతారన్నది ఆయన విపులంగా చెప్పారు. ప్రభుత్వ రంగంలో వైద్యవిద్యతోపాటు వాటికి అనుబంధంగా ఉండే ఆస్పత్రుల ద్వారా వైద్యం కూడా పేదలకు అందుబాటులో ఉంటుంది. అదే ప్రైవేట్‌రంగంలోకి వెళ్లిపోతే పిండికొద్దీ రొట్టె అన్నట్లు చదువుకు, ప్రతి చికిత్సకు, టెస్టుకూ డబ్బులే ప్రాతిపదికగా నిలుస్తాయని, చాలా సందర్భాల్లో ఫీజులు గుంజేందుకు అవసరం లేని టెస్టులు, చికిత్సలు కూడా చేసేస్తుంటారని ధర్మాన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు. ఈ కోణంలో ఆయన వ్యాఖ్యలు, ఆందోళనలు వంద శాతం వాస్తవమని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అనేక రూపాల్లో మెడికల్ మాఫియా కోరలు చాచి రోగులు, వారి కుటుంబాలను కబళిస్తోంది. బీఎంజే గ్లోబల్ హెల్త్ సంస్థ కోసం డిసెంటింగ్ డయాగ్నస్టిక్స్‌కు చెందిన డాక్టర్ గద్రే, డాక్టర్ శుక్లాను రూపొందించిన నివేదికలతోపాటు జీన్యూస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలు నిర్వహించిన పరిశీలనల్లో సేవారంగంగా పరిగణించే వైద్యరంగం ఎంత వ్యాపారాత్మకంగా మారిపోయిందో.. ఎంతగా పతనమైపోతోందో వెల్లడైంది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ కూడా ఈ అభిప్రాయాలు, ఆందోళనలతో ఏకీభవించడం విశేషం.
ఉత్తుత్తి ఆపరేషన్లు
కొన్ని నివేదికల ప్రకారం.. మన దేశంలో జరుగుతున్న సర్జరీల్లో సుమారు 44 శాతం వరకు నకిలీ లేదా అవసరం లేనివిగానే తేలింది. అంటే అవన్నీ రోగులను లేదా ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడానికే చేస్తువన్నమాట! గుండె ఆపరేషన్లలో 55 శాతం, గర్భాశయ ఆపరేషన్లలో 48 శాతం, క్యాన్సర్ సర్జరీల్లో 47 శాతం, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీల్లో 48 శాతం, సిజేరియన్ ఆపరేషన్లలో 45 శాతం, భుజం, వెన్నెముక వంటి శస్త్రచికిత్సల్లో సగం వరకు అవసరం లేనివి లేదా నకిలీగా తేలింది. మహారాష్ట్రలోని ప్రముఖ ఆస్పత్రుల్లో జరిగిన ఒక సర్వేలో బడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో సీనియర్ వైద్యులకు నెలకు కోటి రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారట. ఎవరు ఎక్కువ టెస్టులు, చికిత్సలు, అడ్మిషన్లు, సర్జరీలు చేయిస్తారన్నదాన్నే ప్రామాణికంగా తీసుకుని అధిక జీతాలు, బోనస్ లు ఇస్తున్నారు. మరో నివేదిక ప్రకారం.. అదేదో సినిమాల్లో చూపించినట్లు మరణించిన రోగులను కూడా బతికి ఉన్నట్లుగా చూపించి చికిత్స చేసి ఫీజులు దండేసిన ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఒకానొక ఆస్పత్రి అప్పటికే చనిపోయిన 14 ఏళ్ల బాలుడిని ఇంకా జీవించి ఉన్నట్లు చూపించి నెలరోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఉదంతాన్ని ఆ నివేదికలో ప్రస్తావించారు. తర్వాత దీనిపై దర్యాప్తు జరిపి ఆస్పత్రినే దోషిగా నిర్థారించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇప్పించి చేతులు దులిపేసుకున్నారు. కానీ ఆ కుటుంబం ఎదుర్కొన్న మానసిక క్షోభకు ఎవరూ బాధ్యత వహించలేదు.
బీమా పరిహారం స్వాహా
కార్పొరేట్ పోటీ పుణ్యాన మెడికల్ బీమాపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. దానికితోడు ప్రైవేట్ వైద్యం చాలా ఖరీదైపోవడంతో ప్రజలు అనివార్యంగా మెడికల్ బీమా పాలసీలు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీనివల్ల క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందుతుందని పాలసీదారులు ఆశ. కానీ ప్రైవేటు ఆస్పత్రులు దీన్నే తమ దోపిడీకి సాధనంగా వినియోగించుకుంటున్నాయి. అవసరం ఉన్నా, లేకపోయినా రకరకాల టెస్టులు చేయించడం, చికిత్సలు, సర్జరీలంటూ ఎక్కువ మొత్తాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు మూడువేల ప్రసిద్ధ ఆస్పత్రులను నకిలీ క్లెయిములు చేసినందుకుగాను ఆయా బీమా సంస్థలు బ్లాక్‌లిస్టులో పెట్టాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ సమయంలో అనేక ఆస్పత్రులు నకిలీ కోవిడ్ కేసులు చూపించి బీమా కంపెనీలను మోసం చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ చాలా క్లెయిములు తిరస్కరణకు గురవుతుంటాయి లేదా తక్కువ మొత్తాలు మంజూరవుతుంటాయి. అటువంటి కేసుల్లో బాధిత కుటుంబాలే మిగతా బిల్లుల భారాన్ని భరించాల్సి వస్తోంది.
రిఫరల్ మోసాలు
కొంతమంది వైద్యులు రోగులను భయపెట్టి ఉన్నత వైద్యం పేరుతో పెద్ద ఆస్పత్రులకు పంపిస్తుంటారు. అందుకు తగినట్లే కార్పొరేట్ ఆస్పత్రులు ప్రత్యేకంగా రిఫరల్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాయి. రోగి పరిస్థితి ఎలా ఉన్నా పంపించిన డాక్టర్ బ్యాంకు ఖాతాలో రిఫరల్ ఫీజు నేరుగా జమ అవుతుంది. ఇదే తరహాలో డయాగ్నస్టిక్ అంటే మెడికల్ టెస్టుల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. డాక్టర్లు అవసరం లేని టెస్టులు రాసి ప్రత్యేకంగా కొన్ని ల్యాబ్‌లకే రోగులను పంపడం ద్వారా 40 శాతం నుంచి 50 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. దేశంలో రెండు లక్షలకుపైగా ల్యాబ్‌లు ఉన్నా.. వాటిలో వెయ్యి మాత్రమే అనుమతులు ఉన్న అధీకృత సంస్థలు. ఇక ఔషధ తయారీ కంపెనీలు ప్రతి ఏటా డాక్టర్లపైనే సుమారు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తుంటాయి. తాము ఉత్పత్తి చేసిన మందులను రోగులకు ప్రిస్క్రైబ్ చేసేందుకు డాక్టర్లకు నగదు, విదేశీ పర్యటనలు, ఫైవ్‌స్టార్ హోటల్ వసతి వంటి ఆఫర్లు ఇస్తుంటారు. దాంతో డాక్టర్లు ఆ కంపెనీల మందులనే తమకు అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న ఫార్మసీల్లో అమ్ముతూ.. అక్కడే మందులు కొనమని రోగులను ఒత్తిడి చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు శస్త్రచికిత్స పరికరాలు, మందులు తక్కువ ధరకు ఆస్పత్రులకు సరఫరా చేస్తుంటాయి. కానీ రోగుల నుంచి వాటికి కొన్ని రెట్లు ఎక్కువ వసూలు చేస్తుంటారు. ఇండియా టుడే పరిశీలన ప్రకారం.. క్యాన్సర్ ఔషధం టెమిక్యూర్ ఆస్పత్రులకు రూ.1,950కే సరఫరా చేస్తుంటారు. కానీ రోగుల నుంచి రూ.18,645 వసూలు చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వడంలో శ్రద్ధ చూపుతున్నా.. డాక్టర్లు, ఆస్పత్రులపై నియంత్రణ కోల్పోవడంతో వైద్యం పతనమవుతోంది.
Comments