రాత్రి వేసిన రోడ్డు తెల్లారికి తేలిపోయింది
నాణ్యత లేని ప్యాచ్ వర్క్‌లు
గతంలో గోతుల్లో బళ్లు గంతులేస్తే.. ఇప్పుడు స్కిడ్ అవుతున్నాయి
ఇలాంటి పనులకు బిల్లులు ఎలా మంజూరుచేస్తారో?!
అధికారులు కళ్లు మూసుకున్నారు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నగరంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్ వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుకు జరుగుతున్న మరమ్మతులు ఒక్కసారి గమనించండి. తారు లేకుండా కూడా బీటీ రోడ్డు వేయొచ్చన్న కొత్త సాంకేతిక అందుబాటులోకి వచ్చిందేమోనన్న అనుమానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా చిన్నమండలవీధి జంక్షన్ ఉమెన్స్‌కాలేజీ రోడ్డు వద్ద పదేసి మీటర్ల చొప్పున చేసిన ప్యాచ్‌వర్క్‌ను చూస్తే తారురోడ్ల టెక్నాలజీ మారిందనిపించకమానదు. హాట్‌మిక్సర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చిప్స్, తారును కలిపేసి దాన్ని రోడ్డు మీద పోసి రోలర్‌తో మట్టించడం, వెంటనే దాని మీద రాకపోకలు సాగించడం మొదలైంది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద రాళ్లు గోతుల్లో వేసి, రోడ్డు పక్కన తారు డబ్బాలను మంటల మీద పెట్టి అడపాదడపా ప్యాచ్ వర్క్‌లు చేశారు. అటు హాట్‌మిక్సర్‌కు, ఇటు జగన్మోహన్‌రెడ్డి అనుసరించిన బండరాళ్ల విధానానికి పూర్తి భిన్నంగా నగరంలో సంబంధిత కాంట్రాక్టర్ ప్రవేశపెట్టారు. గతంలో గుంతలున్నచోట బళ్లు గంతులేసేవి. ఇప్పుడు గుంతలు కప్పినచోట బళ్లు స్కిడ్ అవుతున్నాయి. అంతే తేడా. ఇంకా చెప్పాలంటే గంతులు కంటే స్కిడ్ ప్రమాదకరం. కథనం పూర్తి వివరాల్లోకి వెళితే.. జగన్మోహన్‌రెడ్డి పాలనలో రోడ్లను ఏమాత్రం పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెపండుగ పేరుతో ప్రతీ పంచాయతీకి రోడ్ల మరమ్మతు కోసం రూ.10 లక్షలు కేటాయించారు. అందులో భాగంగానే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా రూ10 లక్షలు వచ్చాయి. అయితే పైన చెప్పుకున్న రహదారి రోడ్లు, భవనాల శాఖ పరిధిలోనిది. అంటే ఈ రూ.10లక్షలు ఖర్చు చేసి ఆర్ అండ్ బీ యే టెండర్లు పిలిచి గోతులు కప్పాలి. అయితే కార్పొరేషన్ అంటూ ఒకటుంది కాబట్టి.. ఆర్ అండ్ బి చేతిలో అనేక రోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ రూ.10 లక్షలు ఖర్చుపెట్టి మున్సిపల్ యంత్రాంగమే టెండర్లు పిలిచి నగరంలో బీటీ రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ భావించారు. దీంతో కార్పొరేషనే రూ.10 లక్షల పనిని విజయనగరానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఇంతవరకు ఒక లెక్క. ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్యాచ్ వర్క్‌లకు సంబంధిత కాంట్రాక్టర్ కనీసం తారును వాడటంలేదు. హాట్‌మిక్సర్‌లో తారు, చిప్స్ కలిపి గుంతలు పూడ్చాల్సి ఉండగా, అందులో తారుశాతం పూర్తిగా తక్కువ ఉండటం వల్ల చిప్స్ తేలిపోతున్నాయి. ఎంతలా అంటే.. కనీసం తారు ఎక్కడుందో కనపడనంత. సాధారణంగా హాట్‌మిక్సర్ టెక్నాలజీలో రోడ్డు వేస్తే రోడ్డు ఒకవైపు పూర్తవుతుండగానే మరోవైపు ప్రయాణాలు సాగించవచ్చు. ఇక్కడ మాత్రం రాత్రిపూట రోడ్డు వేసినా ఉదయం చిప్స్ మీద వాహనాలు పోవడం ఇబ్బందికరంగా మారింది. నగరంలో ఈ రోడ్డు పనులను పలువురు విమర్శిస్తుండటంతో స్థానిక చిన్నమండలవీధి జంక్షన్ వద్ద పైకి తేలిపోయిన చిప్స్‌ను గురువారం ఏరుతున్నారు. ఉమెన్స్ కాలేజీ ఎదురుగా మాత్రం పైకి తేలిన చిప్స్‌ను ఏరితే పాత రోడ్డే దర్శనమిచ్చే అవకాశముంది. బీటీ ప్యాచ్‌వర్క్‌లను 25 ఎంఎం మందంలో వేయాల్సి ఉంది. కానీ అనేక చోట్ల 20 ఎంఎంలో మాత్రమే గోతులు పూడుస్తున్నారు. ఇక సూర్యమహల్ టూ పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్ వరకు ఉన్న రోడ్డు ప్యాచ్‌వర్క్‌లలో 25 ఎంఎం మందం కనిపిస్తున్నా కనీసం తారు కనిపించకపోవడం విడ్డూరం. ప్రస్తుతం అక్కడక్కడ తారు, చిప్స్ మిక్సయినట్టు కనిపిస్తున్నా ఒక్క వర్షం పడితే ఈ బంధం బీటలు వారే ప్రమాదం ఉంది. ఇందుకు తారు తక్కువగా ఉండటమే. వాస్తవానికి వేడిగా మరుగుతున్న తారును ఇందుకు వాడాల్సి ఉంది. కానీ ప్లాంట్‌లో చల్లారిపోయిన తారును తీసుకువచ్చి అందులో చిప్స్ వేయడం వల్ల రెండూ అతుక్కోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇదే వర్క్ కింద స్థానిక పాలకొండ రోడ్డులో కొంత భాగంలో ప్యాచ్‌వర్క్‌లు చేసి, మరికొంత భాగాన్ని వదిలేశారు. ఆర్ అండ్ బి రోడ్డయినా మున్సిపాలిటీయే మరమ్మతు పనులు చేస్తుంది కాబట్టి దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులదే.

ఈ రోడ్డులో స్కూల్స్, కాలేజీలు ఉండటం వల్ల విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను వారి వాహనాలపై దిగబెడుతుంటారు. రోడ్డు పనుల నాణ్యతలోపం పుణ్యమాని నడిపించి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిరది. ఈ పనులకు ముందు రోడ్లను శుభ్రం చేసే మిషిన్ రోజూ ఈ రోడ్డును ఊడ్చేది. అయితే ఇప్పుడు మిషన్ కాదు కదా మనుషులు ఊడ్చడానికి కూడా పనికిరాకుండాపోయింది. ఈ రోడ్డు పూర్తిగా రాళ్లు తేలిపోయింది. ఏ కాంట్రాక్టర్ ఈ పనులు చేపడుతున్నారో, అధికారులకు ఎంత ముట్టిందో తెలియదుగాని ప్యాచ్‌వర్క్ పూర్తిగా ఫెయిలైంది. పనులు చూసి బిల్లు మంజూరు చేస్తారో, ఇప్పటికే మంజూరు చేసేశారో, లేక ఆమ్యామ్యాలు తీసుకుని కళ్లు మూసుకుని బిల్లు ఇచ్చేస్తారో. ఊర్లోకొచ్చిన ప్రతీసారి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించడం, నేను ఖాళీ, మా ఆఫీసుకు వచ్చేవారు రండి అని చెప్పడమే తప్ప.. ఇటువంటి పనులపై దృష్టి సారిస్తున్నారో లేదో. అయినా ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు అధికారులు, నాయకులకు నల్ల అద్దాల కారులో వెళ్తే ఏం కనిపిస్తాయిలెండి.

Commentaires