top of page

అది జాబ్‌చార్ట్‌ కాదు.. దోపిడీ చార్ట్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 22
  • 2 min read
  • జీవో నెం.11పై సచివాలయ ఉద్యోగుల మండిపాటు

  • వలంటీర్ల పనులు అప్పగించడంపై అసంతృప్తి

  • వద్దని మొత్తుకున్నా బలవంతంగా రుద్దే యత్నం

  • మిగతా ప్రభుత్వ సిబ్బందిలాగే తమనూ చూడాలని విజ్ఞప్తి

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జీవో 11 రూపంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జాబ్‌చార్ట్‌ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అసహనానికి గురి చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సేవలు అందించాలని ఆ జాబ్‌చార్ట్‌లో నిర్దేశించడం వారిని ఆగ్రహానికి చేస్తోంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమను ఇంకా వలంటీర్లుగానే చూస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌చార్ట్‌ తమ పాలిట గుదిబండ లాంటిదని వారు విమర్శిస్తున్నారు. తమ హక్కుల కోసం 45 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వాటి అమలుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయడానికి సంకోచిస్తున్న ప్రభుత్వం రాత్రికి రాత్రి దొంగ జీవో విడుదల చేసిందని సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. డోర్‌ టు డోర్‌ సేవలందించలేమని ఈ నెల 16న రాష్ట్రస్థాయి అధికారులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశామని.. కానీ ఆ తర్వాత రోజే ఇంటింటి సేవలు చేయాలంటూ ప్రభుత్వం జీవో 11 జారీ చేయడం తమకు అన్యాయం చేయడమేనని విమర్శిస్తున్నారు.

ఆ జీవోలో ఏముందంటే..

ఒకే సమయంలో తమకు అనేక పనులు అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నుంచి కొంతకాలంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించి సమస్య లేకుండా చేయడానికి, ఉద్యోగులు చేయాల్సిన పనులను నిర్దేశించడానికి జాబ్‌చార్ట్‌ రూపొందించినట్లు జీవో నెం.11లో ప్రభుత్వం పేర్కొంది. ఏడు రకాల పనులను జాబ్‌చార్ట్‌లో చేర్చారు. వాటి ప్రకారం..

`సచివాలయ పరిధిలో అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా ఆయా పథకాల విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి.

`ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ సచివాలయ పరిధిలోని పౌరుల సమాచారాన్ని ఇంటింటికీ వెళ్లి సేకరించాల్సి ఉంటుంది.

`ప్రభుత్వం అమలు చేస్తున్న సేవలు, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే అందించాలి.

`విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

`ప్రభుత్వం సమయానుకూలంగా జారీ చేసే ఆదేశాల్లో పేర్కొనే అన్ని పనులను నిర్వర్తించాల్సి ఉంటుంది.

`ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు హాజరై అర్హత సాధించాల్సి ఉంటుంది.

`సచివాలయాల ద్వారా అందే ఫిర్యాదులపై చర్యలను నిరంతరం పర్యవేక్షించాలి.

`జాబ్‌చార్ట్‌ అమలు తీరును పర్యవేక్షిస్తూ అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

వలంటీర్లం కాదు

ఈ జాబ్‌చార్ట్‌ను ఉద్యోగ సంఘాలు తిరస్కరిస్తున్నాయి. గతంలో వలంటీర్లు చేసిన పనులను తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులను వదిలేసి సచివాలయ ఉద్యోగులపైనే అన్ని పనులు రుద్దడం సబబు కాదని వాదిస్తున్నారు. ఉద్యోగుల హక్కులను కాలరాసి పనిభారం పెంచాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరించింది. ఇంటింటి సర్వే బాధ్యతను క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఇతర శాఖల ఉద్యోగులకు అప్పగించాలని సూచిస్తున్నారు. ఉద్యోగానికి మించిన అర్హతలు కలిగి ఉన్న తమకు అందుకు తగ్గ పనులు అప్పగించాలని చర్చల సందర్భంగా ఉన్నతాధికారులకు విన్నవించినా వినిపించుకోలేదని వాపోతున్నారు. ఉద్యోగ విధులతో సంబంధం లేకుండా సర్వేలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు, వైన్‌షాపులకు జియో ట్యాగింగ్‌ చేయించడం లాంటి పనులు అప్పగించడాన్ని తప్పు పడుతున్నారు. వీటిని చేయలేమని చెప్పినందుకు.. జీవో తీసుకువచ్చి నిర్బంధంగా అమలు చేయించాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచీ వలంటీర్లతో కలిసి ప్రజలకు దాదాపు 162 సర్వీసులు అందజేయడం, కోవిడ్‌ మహమ్మారి సమయంలో కుటుంబ సభ్యులనే ముట్టుకోవడానికే భయపడిన పరిస్థితుల్లోనూ సచివాలయ ఉద్యోగులు దగ్గరుండి ప్రజలకు సేవలందించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్‌టీఆర్‌ భరోసా పింఛను పథకాన్ని లోపరహితంగా అమలు చేస్తున్న తమపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

మమ్మల్నీ ఉద్యోగులుగా గుర్తించాలి

సచివాలయ ఉద్యోగుల వల్ల ఆర్ధిక భారమేనన్న తప్పుడు భావనతో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక తొలగించి వారు చేసే పనులను సచివాలయ ఉద్యోగులకు అంటగట్టిందని అంటున్నారు. సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించడం లేదంటూ తాము ఏపీపీఎస్‌సీ పరీక్షలు రాసి మెరిట్‌ ఆధారంగా డీఎస్‌సీలో ఎంపికైన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శిస్తున్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు లభించే హక్కులన్నీ సచివాలయ ఉద్యోగులకు కూడా వర్తించాల్సిందేనని ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ బూరాడ మధుబాబు అంటున్నారు. జీవో 11ను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకుని సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page