top of page

ఉద్యమంలో మిగిలింది..ఆ నలుగురేనా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 24 hours ago
  • 3 min read
  • అంతం చూస్తున్న ఆపరేషన్‌ కగార్‌

  • ఎన్‌కౌంటర్లలో పలువురు అగ్రనేతలు హతం

  • పదుల సంఖ్యలో నేతలు, వందలాది క్యాడర్‌ లొంగు‘బాట’

  • నాయకత్వంపై క్యాడర్‌లో గూడుకట్టుకున్న అసంతప్తి

  • అవసాన దశకు చేరుకున్న మావోయిస్టు ఉద్యమం

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా పలువురు సెంట్రల్‌ కమిటీ, పోలిట్‌బ్యూరో సభ్యుల ఎన్‌కౌంటర్‌.. మరికొందరు అగ్రనేతల లొంగుబాటు.. వారి బాటలోనే దళాలకు దళాలే పోలీసులకు ఆత్మసమర్పణం, అస్త్ర సన్యాసం.. ఇలాంటి వరుస ఘటనలతో కుదేలైపోయిన మావోయిస్టు పార్టీలో ఇంక మిగిలిందెవరు? క్యాడర్‌ ఎంత ఉంది?? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్‌ కగార్‌ మవోయిస్టు ఉద్యమాన్ని అంతిమ దశకు తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పినట్లు వచ్చే ఏడాది మార్చి నాటికి ఉద్యమం పూర్తిగా ఉనికి కోల్పోతుందా లేక గతంలో మాదిరిగా గోడకు కొట్టిన బంతిలా.. కొత్తరూపం, కొత్త శక్తి సంతరించుకుంటుందా? అన్నదానికి సమాధానం ఆశించడం కొంత కష్టమే.. ఇప్పటికైతే మావోయిస్టు పార్టీ క్షీణదశలోనే ఉంది. పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్నతో పాటు వందల మంది దళ సభ్యులు అజ్ఞాతం వీడి జనారణ్యంలోకి రావడంతో ఉద్యమంపై కొత్త చర్చ జరుగుతోంది. ఆపరేషన్‌ కగార్‌ విప్లవోద్యమాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో అడవులను జల్లెడ పడుతున్న ప్రత్యేక భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేస్తున్నాయి. దీంతో మావోయిస్టులు ప్రాణభయంతో ఉద్యమాన్ని వీడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం గత 22 నెలల్లో సుమారు 2100 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమం లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టి పెద్దఎత్తున ఎన్‌కౌంటర్లకు ఆదేశాలిచ్చింది. ‘కగార్‌’ అంటే అంతం అని అర్థం. పేరుకు తగ్గట్టే ఆపరేషన్‌ కగార్‌ మావోయిస్టుల అంతం చూస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యం, అబూజ్‌మడ్‌ వంటి దుర్గమారణ్య ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన భద్రతా బలగాలు వారిని నిలువ నీడ లేకుండా చేయడంలో సక్సెస్‌ అయ్యాయి. ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ బేస్‌ క్యాంపులు ఏర్పాటుచేస్తూ మావోయిస్టులను మరింత లోతట్టు ప్రాంతాలకు తరుముతున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయలేక మావోయిస్టులు లొంగుబాట పట్టారని అంటున్నారు.

పలుచబడిన కేంద్ర కమిటీ

పీపుల్స్‌వార్‌, ఎంసీసీ(మావోయిస్ట్‌ కమ్యూనిస్ట్‌ సెంటర్‌) గ్రూపులు విలీనంతో 2004లో మావోయిస్టు పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో సుమారు 42 మందిని కేంద్ర కమిటీ సభ్యులుగా నియమించారు. అయితే అనంతర కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పలువురు నేతలు హతం కావడంతో కేంద్ర కమిటీ బాగా బక్కచిక్కిపోయింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది వరకు మావోయిస్టు అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు మరణించారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. వీరిలో పార్టీ ప్రధాన నంబాళ్ల కేశవరావుతో పాటు చలపతి, చంద్రన్న, సుధాకర్‌, గాజర్ల రవి, మోడం బాలక్రిష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కాదరి సత్యనారాయణ తదితర అగ్రనేతలు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత గత నెలలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోగా, తాజాగా మల్లోజుల వేణుగోపాల్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ సమక్షంలో, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. వరుస ఎదురుదెబ్బలతో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకున్నట్లేనని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పోలిట్‌ బ్యూరో వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలో నలుగురు మాత్రమే మిగిలి ఉన్నట్లు పోలీసు రికార్డుల ప్రకారం అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పార్టీ సిద్ధాంతకర్త ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, జార్ఖండ్‌కు చెందిన నేత మిసిర్‌ బేస్రా అలియాస్‌ భాస్కర్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మాడ్వి హిడ్మా అలియాస్‌ హిడ్మన్న మాత్రమే మిగిలారని అంటున్నారు. దాంతో భద్రతా దళాలు వారి ఆచూకీ కనుగొనడంపై దృష్టి సారించాయి.

హిడ్మాయే కీలకం

ఈ నలుగురిని అంతం చేయకపోతే ఆపరేషన్‌ కగార్‌ అసంపూర్తిగానే మిగిలిపోతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అందులోనూ మాడ్వి హిడ్మా, ప్రస్తుత సెంట్రల్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి అత్యంత కీలకమని అంటున్నారు. ఎందుకుంటే గణపతి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. మిసిర్‌ బేస్రాకు పార్టీని నడిపే సత్తా లేదు. వీరందరిలోనూ హిడ్మాను పట్టుకోగలిగితే ఉద్యమాన్ని అణిచివేసినట్లేనని అంటున్నారు. జీవించి ఉన్న వారందరూ హిడ్మా సంరక్షణలోనే ఉన్నారన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హిడ్మా ఎక్కడ ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అతన్ని పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టు కాదని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అంటున్నారు. అప్పటి వరకూ ఆపరేషన్‌ కగార్‌ ఆగబోదని స్పష్టం చేస్తున్నారు. 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి కారణమైన చింతల్‌నార్‌ దాడి మొదలు మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను, పెద్ద సంఖ్యలో పోలీసులను పొట్టన పెట్టుకున్న జీరంఘాటీ ఆంబుష్‌ వంటి పలు భారీ దాడులకు నేతృత్వం వహించింది హిడ్మాయేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో హిడ్మాను కాపాడుకోగలిగితే పార్టీ ఎప్పటికైనా పునరుజ్జీవనం పొందుతుందని ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టు క్యాడర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఇంత కీలకమైన హిడ్మా అనుపానులపై బస్తర్‌ పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్మూ నుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఏప్రిల్‌లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్‌ నుంచి త్రుటిలో తప్పించుకుని పారిపోయిన హిడ్మా, ఆయన బెటాలియన్‌.. భారీ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో తిరిగి కర్రెగుట్టలపైకి వెళ్లారని చెబుతున్నారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతలు, గెరిల్లా బెటాలియన్‌తో కలిసి తెలంగాణ సరిహద్దుల్లోకి వెళ్లారని, ప్రస్తుత తెలంగాణ క్యాడర్‌ రక్షణలోనే ఉన్నాడని లక్మూ చెప్పినట్టు తెలిసింది. ఇదే నిజమైతే త్వరలోనే మరోసారి ‘ఆపరేషన్‌ కర్రెగుట్టలు’ను కేంద్ర బలగాలు చేపట్టే అవకాశముందని బస్తర్‌ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు క్యాడర్‌లో గూడుకట్టుకున్న అసంతృప్తి కూడా లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే తాము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని ఘరియాబాద్‌ జిల్లా ఉదంతి ఏరియా కమిటీ ఇన్‌ఛార్జి సునీల్‌ పేరుతో విడుదలైన లేఖ అగ్రనేతలపై మావోయిస్టు క్యాడర్‌లో ఉన్న అసంతృప్తికి దర్పణం పట్టింది. తమ కమిటీ మొత్తం సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ లేఖ ద్వారా ప్రకటించారు. ప్రభుత్వానికి లొంగిపోవాలని తామంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. గోబ్రా, సినాపాలి, ఎన్‌టీకే ప్రాంతాల్లోని దళాలు కూడా తమ నిర్ణయాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర నాయకత్వంపై అసంతృప్తి, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచన.. ఈ రెండూ కలిసివచ్చి, ఉద్యమాన్ని మరింతగా నీరుగార్చుతున్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page