కస్టమర్ ఓడీ తినేశారు..!
- Prasad Satyam
- Oct 22, 2025
- 2 min read
కస్టమర్ ఓడీ తినేశారు..!
కప్పిపుచ్చలేక తలపట్టుకుంటున్న బీఎం
ఎస్‌బీఐ మరో బ్రాంచిలో వెలుగుచూసిన కొత్త అక్రమం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం జిల్లాలో ఏ బ్రాంచిలో ఏదో ఒక కంపు గుప్పుమంటోంది. దీనికి కారణం బ్రాంచి మేనేజర్లకు విచక్షణాధికారాలు ఉండటం, ఆపైన రీజనల్ మేనేజర్‌గా పని చేసిన పాత అధికారులు సహకరించడం వల్ల అప్పట్లో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గార బ్రాంచిలో బంగారం నగలు ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టిన కేసు పునర్విచారణ ఇంకా ఒక కొలిక్కి రాకముందే, నరసన్నపేట బజారుబ్రాంచిలో రికార్డులను సీఐడీ పరిశీలిస్తున్న సమయంలోనే తాజాగా నగరానికి ఆనుకొని ఉన్న ఒప్పంగి బ్రాంచిలో ఒక కస్టమర్ పేరిట ఓవర్ డ్రాఫ్ట్ మంజూరుచేసి, ఆ సొమ్మును గతంలో ఇక్కడ పని చేసిన కొందరు అధికారులు మింగేశారని తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఆడిట్‌లు నిర్వహిస్తున్నా అంతా సవ్యంగానే ఉందంటూ రిపోర్టులిస్తున్న ఆడిటర్లతో సైతం ఎస్‌బీఐలో బ్రాంచి మేనేజర్లందర్నీ విచారిస్తే గానీ ఎక్కడెక్కడ ఎంతెంత సొమ్ము తినేశారో లెక్కతేలదు. తీగ లాగితే డొంక కదిలినట్టు ‘సత్యం’ పత్రికలో ఒక్కొక్క బ్రాంచి అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో కొత్తగా స్కామ్‌లు కూడా బయటపడుతున్నాయి. ఒప్పంగి బ్రాంచిలో ఖాతా ఉన్న ఓ మెడికల్ షాపు యజమాని ఓవర్ డ్రాఫ్ట్ వాడుకున్నారని, అందుకు సంబంధించి సక్రమంగా చెల్లింపులు లేవంటూ ఆమధ్య పైనుంచి తాఖీదులు వచ్చాయి. తాను ఎంత వాడుకున్నానో అంత మేరకు చెల్లించిన తర్వాత తనకు నోటీసులు రావడమేమిటని సంబంధిత మెడికల్ షాపు యజమాని ఆరా తీస్తే, తన పేరుతో ఓవర్‌డ్రాఫ్ట్‌ను బ్యాంకు సిబ్బందే వాడేసినట్లు తేలింది.
ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఏమిటి?
బ్యాంకులో ఎక్కువ లావాదేవీలు జరిపి టర్నోవర్ ఎక్కువగా ఉన్నప్పుడు కొలట్రాల్, నాన్ కొలట్రాల్ కింద ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా బ్యాంకు చేబతులు రూపంలో ఓవర్‌డ్రాఫ్ట్ కింద నిధులు ఇస్తుంది. ఇందులో కొలట్రాల్ అంటే సంబంధిత ఖాతాదారుడికి చెందిన ఏదైనా ఆస్తిపత్రాలు బ్యాంకులో ఉంచి, దాని విలువ మీద 30 శాతం నిధులు వాడుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. నాన్‌కొలట్రాల్‌లో అయితే సంస్థ రెపిటేషన్, టర్నోవర్ ఆధారంగా ఎటువంటి ఆస్తిపత్రాలూ బ్యాంకు వద్ద ఉంచకుండానే ఓవర్ డ్రాఫ్ట్ వాడుకునే వెసులుబాటును కల్పిస్తాయి. ఈ అధికారం పూర్తిగా బ్రాంచి మేనేజర్‌కు ఉంటుంది.
స్కామ్ ఎలా జరిగింది?
సాధారణంగా ఒక ఖాతా పేరు మీద అకౌంట్ హోల్డర్‌కు తెలియకుండా ఓవర్‌డ్రాఫ్ట్ జమ చేయడం కుదరదు. కానీ బ్రాంచి మేనేజర్ చేతిలోనే కీ ఉండటం వల్ల ఆయన అకౌంట్‌లో సంబంధిత ఖాతాదారుడు ఓడీ వాడుకున్నట్టు చూపిస్తారు. ఖాతాదారుడి పాస్‌పుస్తకంలో మాత్రం అది ఉండదు. బ్యాంకు కంప్యూటర్‌లో మాత్రం కనిపిస్తుంది. ఇలా ఓడీగా తీసిన డబ్బులు అప్పటికే బినామీ పేర్లతో ఉన్న అకౌంట్లలోకి వేసి విత్‌డ్రా చేస్తారు. సాధారణంగా ఇవన్నీ ఎంఎస్‌ఈ రుణాల స్కీమ్‌లోనే జరుగుతుంటాయి. ఖాతాదారుడు మాత్రం తాను తక్కువ ఓడీ వాడానని భావిస్తుండగా, బ్యాంకు లెక్కల్లో మాత్రం అది ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాంకు మేనేజర్ తలచుకుంటే 30 శాతం ఇవ్వాల్సిన ఓడీ 60 శాతం కూడా ఇవ్వొచ్చు. సరిగ్గా ఈ వెసులుబాటును వాడుకొని గతంలో ఒప్పంగిలో పని చేసిన ఇద్దరు బ్రాంచి మేనేజర్లు కొందరి పేర్ల మీద ఓడీని తమ ఖాతాలోకి మళ్లించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వీరిద్దరూ ఆ స్థానంలో లేరు. కొత్తగా వచ్చిన అధికారులు బకాయిదారు అంటూ నోటీసు పంపడంతో అసలు విషయం బయటపడినట్టు తెలుస్తుంది. స్టేట్‌బ్యాంకు మెయిన్‌బ్రాంచిలో కూడా ఇటువంటిదే ఆమధ్య జరిగింది. నగరంలో అందరికీ చింతపండు వ్యాపారిగా పరిచయమున్న ఒక వ్యక్తికి సంబంధించిన ఓడీని ఇలాగే దారిమళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బాధితుడ్ని ‘సత్యం’ వివరణ అడగ్గా, బ్యాంకు అధికారులే దీన్ని సరిచేస్తున్నారని, అంతకు మించి తననేమీ మాట్లాడొద్దన్నారంటూ సమాధానమిచ్చారు. నరసన్నపేట బజారుబ్రాంచిలో కూడా రుణాల కుంభకోణం ఇటువంటిదే. కొత్తగా వచ్చిన ఒప్పంగి బ్రాంచి మేనేజర్ ఈ చిక్కుముడిని ఎలా విప్పాలో తెలియక తలబాదుకుంటున్నట్టు తెలుస్తుంది.










Comments