బుధవారం గెజిట్ నోటిఫికేషన్
శ్రీశయన రిజర్వేషన్‌పై రాని క్లారిటీ
సిండికేట్ అయ్యేందుకు రంగం సిద్ధం
లిక్కర్ మాల్స్‌పైనే ఆశలు
రేట్లు తగ్గుతాయని అర్రులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వచ్చే నెల 3 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. వెంటనే షాపులు దొరకవు కాబట్టి నవరాత్రులు ప్రారంభమైన 3వ తేదీ నుంచి ప్రైవేటు వ్యాపారస్తులు మద్యం విక్రయాలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మరోవైపు ఈసారి లిక్కర్ రేట్లు తగ్గుతాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో అటు లిక్కర్ వ్యాపారులకు, ఇటు మద్యం ప్రియులకు కొత్త సరదాను తెస్తుందనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించిన గెజిట్ బుధవారం విడుదల కానుంది. ఇందులో జిల్లాలో శ్రీశయనులకు, సొండి కులస్తులకు 10 శాతం షాపులు కేటాయిస్తామన్న అంశం ప్రస్తావించారా, లేదా అన్నది తేలాల్సి ఉంది. గెజిట్‌లో వీటిని రిజర్వ్‌గా చూపించి, ఆ తర్వాత 10 శాతం షాపుల కోసం అప్లికేషన్లు తీసుకుంటారని ప్రాథమికంగా తెలుస్తుంది. 2017లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గెజిట్‌లో పేర్కొన్న షాపుల సంఖ్యకు ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జిల్లా విభజన కావడంతో 180 షాపులకు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇందులో 17 శ్రీశయనులకు, రెండు సొండి కులస్తులకు రిజర్వ్ చేయాలి. మిగిలిన 161 జనరల్ కేటగిరీలో దరఖాస్తులు తీసుకుంటారు. ఇందుకోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా తెలంగాణ ఎక్సైజ్ పాలసీని మక్కీకి మక్కీ కాపీ కొట్టేశారు. అక్కడి మాదిరిగానే 10వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏడాదికి ఒక షాపునకు రూ.50 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. 10వేలు దాటి 50వేలు లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 50వేలు దాటి 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.65 లక్షలుగా నిర్ణయించారు. అంటే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏడాదికి రూ.65 లక్షలు లైసెన్స్ ఫీజును చెల్లించాలి. పాలసీ రెండేళ్ల కాలపరిమితికి తెస్తున్నారు కాబట్టి రెండో ఏడాది 10 శాతం పెంచి ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే, శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌లో మొదటి ఏడాది రూ.65 లక్షలు, రెండో ఏడాది రూ.72.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 20 శాతం కమీషన్ ఇస్తామని గెజిట్‌లో పేర్కొనబోతున్నారు. ఇది ఇన్‌కమ్ టాక్స్ మినహాయించా? కలుపుకొనా అనేది గెజిట్ వస్తేగానీ తెలియదు. దీంతో పాటు ఏయే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ షాపులకు దరఖాస్తు చేసుకోవాలో కూడా గెజిట్‌లో పేర్కోనున్నారు. గెజిట్ వచ్చిన వారం లోపే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 29న దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీగా నిర్ణయించి 31వ తేదీలోపు డ్రా నిర్వహించి షాపులు కేటాయించేస్తారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గార, ఆమదాలవలస నియోజకవర్గంలో కొల్లివలస, నరసన్నపేట నియోజకవర్గంలో పిన్నింటిపేట, టెక్కలి నియోజకవర్గంలో సంతబొమ్మాళి వంటి రూరల్ ప్రాంతాల్లో షాపులపైనే వ్యాపారస్తులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలాస వంటి ఆర్థిక లావాదేవీలు ఎక్కువ జరిగే ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ సేల్ ఉండటంతో వాటికే ఎక్కువ దరఖాస్తులు వేయడానికి వ్యాపారస్తులు సిద్ధపడుతున్నారు. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుతో కలుపుకొని లైసెన్స్ ఫీజును లెక్కించి వడ్డీ లెక్కలు చూస్తే వ్యాపారంలో పెద్దగా కిట్టుబాటు ఉండదు. అయితే చేయడానికి మరో వ్యాపారం సానుకూలంగా కనిపించకపోవడంతో ఈసారి అనేకమంది మద్యం షాపులకు దరఖాస్తులు వేస్తున్నారు. లక్కీడ్రాలో షాపులు కేటాయింపు విధానం ఉంది కాబట్టి ఎన్ని అప్లికేషన్లు వేస్తే షాపు దక్కుతుందో తెలియక ఒక్కో వ్యాపారస్తుడు తనకు కావాల్సిన ప్రాంతంలో షాపు కోసం కనీసం 50 దాటి అప్లికేషన్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో మద్యం గవర్నమెంటే నిర్వహించడంతో తెలంగాణ, ఒడిశా వెళ్లిపోయిన జిల్లా వ్యాపారులు అక్కడ కూడా ప్రస్తుతం అమలుకాబోతున్న పాలసీయే ఉన్నందున 75 అప్లికేషన్లు వేస్తే ఒక్క షాపు దక్కడం గగనమైపోయింది. అయితే హైదరాబాద్ సిటీ కాబట్టి ఒక్క షాపు వచ్చినా ఎక్కువ సేల్ ఉండటంతో నష్టపోకుండా బతికిపోయారు. అక్కడితో పోల్చి చూస్తే ఇక్కడ ఆ స్థాయిలో వ్యాపారం జరగదు. షాపునకు లైసెన్స్ అంటూ వస్తే పక్కనే మాల్ పెట్టుకోడానికి కూడా ఈసారి ప్రభుత్వం అవకాశమిస్తుంది. రూ.5 లక్షలు అదనంగా చెల్లిస్తే కాస్ట్‌లీ బ్రాండ్ మద్యం అమ్ముకోడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే ఇది కేవలం పార్శిల్ మాత్రమే. దీని మీద సొమ్ములు చేసుకోవచ్చన్న భావనతో వ్యాపారులు ఉన్నారు.
2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ.1027 కోట్లు, 2020-21లో రూ.1,080 కోట్లు, 2021-22లో రూ.1345 కోట్లు, 2022-23లో రూ.1421కోట్లులో 2023-24 రూ.1510 కోట్లు ఆదాయం సమకూరింది.
2014`19 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని మించి గడిచిన ఐదేళ్లలో ఆదాయం వచ్చింది. పెద్ద మొత్తంలో ధరలను పెంచడం వల్ల మద్యం తాగేవారి సంఖ్య తగ్గినా గణనీయమైన ఆదాయం గత ప్రభుత్వానికి సమకూరింది.
Comments