‘కల్తీ’ తాకని.. అచంచల భక్తి
- DV RAMANA

- 10 hours ago
- 3 min read
లడ్డూ వివాదాన్ని పట్టించుకోని వెంకన్న భక్తులు
పైగా సగటున పది శాతం పెరుగుదల నమోదు
2024లో 12.15 కోట్లు.. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు
తమ భక్తి స్వచ్ఛమైనదని నిరూపిస్తున్న భక్తజనం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
తిరుపతి యాత్రకు వెళ్లినవారు కలిస్తే..‘కాస్త లడ్డూ ప్రసాదం పెడతారేమోనని’ ఆశగా ఎదురుచూస్తాం. లేదా..
తిరుపతి యాత్రకు వెళ్తున్నామని ఎవరైనా చెబితే.. ‘మా తరఫున స్వామికి ముడుపు వెయ్యంది.. అని తోచినంత ఇస్తాం. దాంతోపాటే అదనంగా మరికొంద డబ్బులు ఇచ్చి లడ్డూ ప్రసాదం తెచ్చిపెట్టండి’ అని విన్నవించుకుంటాం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న విశిష్టత, ఆదరణకు ఇవి ఉదాహరణలు మాత్రమే. శ్రీవారి లడ్డూలో రెండు పలుకులు లభించినా చాలు.. అనుకుని వాటినే భక్తితో కళ్లకద్దుకుని నోట్లో వేసుకుని తన్మయత్వంతో మురిసిపోతాం. ప్రపంచంలో ఇంకే దేవుడి ప్రసాదానికి ఇంత ఆదరణ, డిమాండ్ ఉండదేమో! అటువంటి శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేశారన్న ఆరోపణలు దాదాపు ఏడాదిన్నర నుంచి రాష్ట్రంలో రాజకీయ దుమారం సష్టిస్తున్నాయి. చివరికి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకున్న సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్)తో విచారణ జరిపించింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటులోని వివరాలు కూడా వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. దీన్ని ఎవరికి అనుకూలంగా వారు వాడుకోవడానికి ప్రయత్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడానికి ప్రయత్నించారు. ఇన్ని వివాదాలు, కేసులు, ఆరోపణలు చుట్టిముట్టిన నేపథ్యంలో వెంకన్న భక్తుల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయా? పవిత్రత కోల్పోయిందని రాజకీయులు చెబుతున్న లడ్డూ విక్రయాలపై ఆ ప్రభావం పడిందా?? అంటే ఏమాత్రం లేదని ఏడుకొండల వెంకన్న సాక్షిగా తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో రాజకీయమే మురికిగా మారింది తప్ప.. వెంకన్న లడ్డూ విక్రయాల్లోనూ, భక్తుల మనోభావాల్లోనూ ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టమైంది. వివాదం మొదలైన తర్వాత సుమారు ఏడాదిన్నర కాలంలో తిరుమలలో లడ్డూ విక్రయాల తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. లడ్డూ నాణ్యత, పవిత్రత వివాదాల్లో చిక్కుకున్న తర్వాత కూడా విక్రయాలు ఏమాత్రం తగ్గకపోగా సగటున పది శాతం పెరుగుదల నమోదు చేయడంతో వెంకన్న భక్తులు మాత్రం కల్తీ కాలేదని స్పష్టమవుతోంది.
వివాదాల మలుపులు
ఈ వివాదానికి ఆద్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబునే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత 2024 సెప్టెంబర్ 18న జరిగిన తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను మంటగలిపేందుకు యత్నించిందని ఆరోపిస్తూ.. భక్తులు అత్యంత ప్రతీపాత్రంగా, భక్తితో స్వీకరించి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వు, చేప నూనె వంటి వాటితో తయారు చేసిన కల్తీ నెయ్యిని వినియోగించారంటూ బాంబు పేల్చారు. అక్కడ మొదలైన వివాదం రకరకాల రంగులు పులుముకుంది, వివాదాల మలుపులు తిరిగింది. మీ హయాంలో జరిగిందంటే.. కాదు మీ హయాంలోనే ప్రారంభమైందంటూ అధికార ప్రతిపక్షాలు నానాయాగీ చేశాయి. తిరుమల పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించారు. చివరికి దీనికి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో వివాదం కోర్టుకెక్కింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా సీరియస్ అయ్యింది. తగిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడమేమిటని నిలదీసింది. పూర్తిస్థాయి విచారణకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీఐ ద్వారా సిట్‌ను నియమించింది. ఈ బందం విచారణ జరిపి ఇటీవలే సమర్పించిన ఛార్జిషీటులో లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిన ఆనవాళ్లు లేవు గానీ.. రసాయనాలు వినియోగించారని పేర్కొంది. దీన్ని కూడా వక్రీకరించి అధికార, ప్రతిపక్షాలు తమ వాదనలకు అనువుగా మలచుకుని ఆరోపణల యుద్ధానికి దిగాయి.
రాజకీయ దుమారం సంగతి ఎలా ఉన్నా.. లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న వివాదం నేపథ్యంలో వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, లడ్డూ విక్రయాలు తగ్గిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ శ్రీవారి భక్తులు వాటన్నింటినీ పటాపంచలు చేశారు. రాజకీయాల్లో తప్ప వెంకన్నపై తమ భక్తిలో ఈషాణ్మాత్రమైన కల్తీ లేదని.. వెంకన్నపై తమ విశ్వాసం, భక్తి అంచలమైనవని, సాక్షాత్తు ఏడకొండలంత సమున్నతమైనవని చాటి చెప్పారు. దానికి సాధికారిక నిదర్శనమే.. తిరుమలకు పోటెత్తుతున్న భక్తజనం.. నానాటికీ పెరుగుతున్న లడ్డూ విక్రయాలు. ఆరోపణలు మొదలైన తర్వాత సుమారు ఏడాదిన్నర కాలంలో ప్రతి నెలా సగటున పది శాతం చొప్పున లడ్డూ అమ్మకాలు పెరగడం చూస్తే.. కల్తీ ఆరోపణలు ఏమాత్రం ప్రభావం చూపలేదని అర్థమవుతుంది.
అమ్మకాల తీరు ఇలా..
వెంకన్న లడ్డూ నాణ్యతపై ఆరోపణలకు 2024 సెప్టెంబర్ 18న బీజం పడింది. ఆ మరుసటి రోజు నుంచి ఆ నెల 30 వరకు 21.3 లక్షల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు 3.5 లక్షల నుంచి నాలుగు లక్షల లడ్డూలు సగటున కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 20`23 మధ్య 13.10 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఆ నెల 25న 3.2 లక్షలు, 26న 3.5 లక్షలు, 27న 3.4 లక్షలు, 28న 3.8 లక్షలు, 29న 4.1 లక్షలు, 30న 3.3 లక్షల లడ్డూలు విక్రయించారు. ఇక తర్వాత ఏడాది 2025లో మొత్తం విక్రయాలు 12.15 కోట్లకు పెరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అంతవరకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య సగటున రోజుకు 3.5 లక్షలుగా ఉంటే గత ఏడాది అది నాలుగు లక్షలకు పెరిగింది. దాంతోపాటు లడ్డూ విక్రయాలు పెరిగి 2025 ఏడాది మొత్తం మీద 13.52 కోట్లకు చేరుకున్నాయి. 2024తో పోలిస్తే 1.37 లక్షల లడ్డూలు అదనంగా విక్రయమయ్యాయి. స్వయంగా టీటీడీ లెక్కల ప్రకారం ఇది సగటున పది శాతం వద్ధి. కాగా 2025 డిసెంబర్ 27న అయితే ఒకేరోజు తిరుమల చరిత్రలో నభూతో.. అన్నట్లు 5.13 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. అలాగే ఇతర పర్వదినాలు, ముఖ్యమైన రోజుల్లో భక్తుల రద్దీతోపాటు లడ్డూల విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ లెక్కలన్నీ తిరుమలేశుడి పట్ల భక్తుల నికార్సైన భక్తికి దర్పణం పడుతున్నాయి. ఈ భక్తి కల్తీ మాటలకు తరిగిపోనిదని స్పష్టం చేస్తున్నాయి.










Comments