top of page

జిల్లాలో పొలిటికల్ క్రికెట్ లీగ్!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • May 22
  • 4 min read
  • జిల్లా సంఘం అక్రమాలపై ఏసీఏకు ఫిర్యాదులు

  • కింజరాపు కోటలోకి వెళ్తుందనే సంకేతాలు

  • పదవులకు ఎసరు రాకుండా కొందరి మంత్రాంగం

  • కూనను తెరపైకి తెచ్చి అధ్యక్షుడిగా నియామకం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ముల్లును ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇవి చిన్నప్పటి నుంచే మనకు తెలిసిన సత్యాలు. వీటిని ఎంతమంది నమ్ముతారో తెలియదుగానీ జిల్లా క్రికెట్ సంఘం మాత్రం నమ్మి ఆచరణలో పెట్టింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధంగా నడుస్తున్న జిల్లా క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ఎన్నుకోవడం ద్వారా ఈ నానుడిని నిజం చేశారు. ఇంతవరకు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న పుల్లెల శర్మను గౌరవాధ్యక్షుడిగా హÃదా పెంచుతూనే క్రియాశీలంగా ఉండే అధ్యక్ష పదవిని మాత్రం తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు కట్టబెట్టింది. ఇందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. రాజకీయ నాయకుల ప్రాపకం లేని ఏ సంస్థ అయినా మనుగడ సాగించలేక కాలగర్భంలో కలిసిపోతుందనేది సమకాలీన సత్యం. అందుకే ఒలింపిక్ అసోసియేషన్ దగ్గర్నుంచి ఎవరికీ పెద్దగా తెలియని సెపక్ తక్రా ఆటకు చెందిన అసోసియేషన్ వరకు రాజకీయ నాయకుడు లేని వ్యవస్థ లేదేమో. అందులోనూ క్రికెట్ అంటే మన దేశంలో ఒక మతం. అంతకు మించి మతాలకు అతీతంగా అభిమానించే ఒక ఆట. అసోసియేషన్‌కు కోట్లు కురిపించే కల్పవృక్షం. అటువంటి క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా పవర్‌ఫుల్ నాయకులే ఉంటారు. ఆ పదవుల కోసం పోటీ పడతారు. ఇందులో భాగంగానే కూన రవికుమార్‌ను జిల్లా క్రికెట్ సంఘం ఏరికోరి తెచ్చి ఆ సీటులో కూర్చోబెట్టింది. రవికి వాయిస్ ఉంది. తెలుగుదేశం పార్టీలో సీనియారిటీ ఉంది. అంతకు మించి రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నందునేమో జిల్లా క్రికెట్ సంఘం ఆయన్ను ముందుపెట్టి వెనుక యుద్ధానికి సిద్ధమైంది.

కొందరి సొంత అజెండా

జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా రవికుమార్‌ను నియమిస్తూ గురువారం సాయంత్రం అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీర్మానం చేశారు. ఇదేదో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. సుదీర్ఘ కాలంగా పదవుల సవారీ చేస్తున్న కొందరు తమ పట్టు కోల్పోకుండా అధికార పార్టీకి చెందిన నేతకు పగ్గాలు అప్పగించారు. తద్వారా దాసుడి తప్ప్పులు దండంతో సరి అనే సూక్తిని అమలులోకి తెచ్చారు. జిల్లా క్రికెట్ సంఘం అనుకున్నట్టుగా అన్నీ జరిగి ఉంటే పుల్లెల శర్మ లేదా క్రికెట్‌తో సంబంధం ఉన్న మరో వ్యక్తి జిల్లా అధ్యక్షుడు అయ్యుండేవారు. అయితే శర్మ విశాఖలో ఉంటూ కార్యక్రమాలకు అందుబాటులో ఉండటంలేదన్న కారణాలతో ఆయనకు ప్రమోషన్ ఇచ్చామని చెబుతున్న సంఘం ప్రతినిధులు అసలు విషయాన్ని మరుగున పరిచేశారు. బహుశా రవికుమార్‌కు కూడా ఈ విషయం చెప్పి ఉండరు. జిల్లా క్రికెట్ సంఘంపై 2023`26 టెన్యూన్‌కు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. అసోసియేషన్‌ను ఎవరు నడిపినా ఇలాంటి ఆరోపణలు సాధారణం. అయితే ఈసారి ఎందుకిది ప్రత్యేకమో.. కూన రవికుమార్‌ను ఎందుకు అధ్యక్షుడిగా నియమించారో తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్న కింతలి గ్రామానికి చెందిన బొడ్డేపల్లి వర్ధన్ అనే ఓ మాజీ క్రికెటర్ కొద్ది రోజుల క్రితం ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్‌లకు ఓ సుదీర్ఘ లేఖ రాశారు. 1994 నుంచి 2007 వరకు ఏసీఏ తరఫున ఆడిన తాను ఎక్కడా ఇటువంటి అరాచకాలు చూడలేదని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఆధారాలు కూడా సమర్పించారు. ఇందులో ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్లేయర్స్‌కు టీఏ, డీఏలు ఇవ్వకుండా సొంత ఖర్చులతోనే తిరగమని చెప్పడం, తమ మనుషులను ఆడించడం కోసం ఆధార్ కార్డుల్లో పేర్లు మార్చడం, ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇతర జిల్లావారిని పిలిపించి ఆడించడం, దానికోసం సొమ్ము వసూలుచేయడం వంటివి ఇందులో ప్రధాన ఆరోపణలు.

వారి ఎంట్రీని అడ్డుకునేందుకే

లేఖలో పేర్కొన్న ఒక ఉదాహరణ ప్రకారం.. ఈ టెన్యూర్‌లో రూ.90 లక్షల నిధులు వస్తే, వాటితో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో బాలుర కోసం ఒక నెట్, ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్‌లో బాలికల కోసం మరో నెట్ మాత్రమే ఏర్పాటు చేశారని, మిగతా నిధులు ఏమయ్యాయని ఆ ఫిర్యాదులో ప్రశ్నించారు. ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులకు ఫిర్యాదు వెళ్లిన వెంటనే జిల్లాకు చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులకు కూడా సమాంతరంగా ఈ సమాచారం చేరింది. ఎందుకంటే.. ఇందులో కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కాగా, సానా సతీష్ రాజ్యసభ సభ్యుడు. సహజంగానే ఎవరి స్థాయిలో వారు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్‌నాయుడులకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. దీనిపై మంత్రులు ఆరా తీసి జిల్లా క్రికెట్ సంఘంలో ఏం జరుగుతుందో తెలుసుకొని నట్లు బిగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే జరిగితే అసోసియేషన్‌లో తమ స్థానంలో కొత్తవారు వచ్చి కూర్చుంటారని భావించిన కొందరు ఉన్నఫళంగా కూన రవిని ఒప్పించి, మెప్పించి జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్రమంత్రులిద్దర్నీ కట్టడి చేసినట్టు అవుతుందని భావిస్తున్నారు. కూన రవే అధ్యక్షుడు కావడం వల్ల తమ పార్టీ చేతిలోనే సంఘం ఉందని కేంద్రమంత్రి భావిస్తారని, కాగా మంత్రి పదవి లేదన్న కారణంతో కూన రవి స్వపక్షంలో విపక్షంలా మారకుండా ఉండాలంటే ఈ అసోసియేషన్ వ్యవహారాలు పట్టించుకోకూడదని అచ్చెన్నాయుడు భావిస్తారని ఈ ఎత్తుగడ. దీని వెనుక ఇంత రాజకీయం ఉందని కూన రవికి తెలుసో లేదో గానీ క్రికెట్ అసోసియేషన్‌ను బయటి నుంచి చూస్తున్నవారు చెప్పలేకపోతున్నారు.

కొందరి ఇష్టారాజ్యం

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో క్రికెట్ సంఘాల పరిస్థితిని కూడా బొడ్డేపల్లి వర్ధన్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. జిల్లా క్రికెట్ సంఘంలో 2024 వరకు అంతా సవ్యంగానే ఉందని, ఎప్ప్పుడైతే ప్రభుత్వం మారి కొత్త యాజమాన్యం చేతికి వచ్చిందో అవినీతి కార్యకలాపాలకు అంతు లేకుండాపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటగాళ్లకు మెంటార్‌గా ఉన్న ఒక వ్యక్తి క్రూరంగా వ్యవహరిస్తున్నారని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా తన ఉద్యోగ ీVAదాను దుర్వినియోగం చేసి తన మేనల్లుడిని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శిగా నియమించి ఇక్కడి అసోసియేషన్ మీద పట్టు కొనసాగిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుత ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి, వారి అభిప్రాయాలు తీసుకొని జిల్లా క్రికెట్ సంఘాన్ని కాపాడాలని ఆ ఫిర్యాదులో కోరారు. జిల్లా నుంచి 20 మందికి పైగా రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఉన్నారని, వీరంతా ఇప్ప్పుడు రిటైరైనా కేవలం ఒకరిద్దర్ని మాత్రమే అన్ని గ్రూపుల సెలక్షన్లకు సెలక్టర్లుగా వాడుకుంటున్నారని, వారి పనితీరుపై కూడా సందేహాలు ఉన్నాయని వర్ధన్ పేర్కొన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ద్రోహిగా చూసి బయటకు గెంటేస్తున్నారని పేర్కొంటూనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) క్రీడాకారుల వేలం దగ్గర్నుంచి అనేక అంశాలను ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. జిల్లాలో ఎన్ని క్రీడాసంఘాలు ఉన్నా క్రికెట్ అసోసియేషన్‌కు ఉన్న ఛరిష్మా మరో సంఘానికి లేదు. అందుకే దీనికి అధ్యక్షుడు కావాలని సాధారణంగా అందరికీ ఉంటుంది. అయితే జిల్లా క్రికెట్ సంఘం మాత్రం కూన రవికుమార్‌ను అధ్యక్షుడిగా నియమించడం వెనుక పొలిటికల్ అజెండా లేదని, ఇంతవరకు జిల్లా క్రికెట్ సంఘానికి గ్రౌండ్ లేకపోవడం వల్ల దాన్ని సాధించుకోవడానికి అధికార పార్టీ నాయకుల మద్దతు ఉండాలన్న కోణంలోనే ఆయన్ను రిక్వెస్ట్ చేశామని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ను క్రికెట్ కోసం తీసుకున్నా కొన్ని నిర్దిష్ట సమయాల్లో గ్రౌండ్‌లో ఆడటానికి లేదని హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం తమకు గ్రౌండ్ లేకుండాపోయిందని, పాత్రునివలస దగ్గర గ్రౌండ్ ఇస్తామని చెప్పినా ఎలాట్ కాకపోవడం, అంపోలు జైలురోడ్డు వద్ద క్రికెట్ పిచ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించిన తర్వాత కూడా అందివ్వకపోవడం వంటి కారణాల వల్ల క్రీడాకారులకు శిక్షణ ఇవ్వలేకపోతున్నామని, వీటన్నింటినీ రవికుమార్ నెరవేరుస్తారనే భావనతోనే ఎన్నుకున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం చెబుతుంది. సంఘం కింజరాపు కుటుంబం చేతిలోకి వెళితే తమను వైకాపా టీమ్‌గా పరిగణిస్తారన్న ఆందోళన అసోసియేషన్ నాయకుల్లో ఉంది. ఎందుకంటే గత టెన్యూర్‌లో వీరే ప్రధాన పదవుల్లో ఉన్నారు. అందుకే ఈసారి కూన రవిని ముందు పెట్టి సూత్రధారులు కొనసాగుతున్నారు. కనీసం రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనైనా క్రికెట్ క్రీడాకారులకు ఓ గ్రౌండ్, ప్లేయర్స్ ఎంపికలో పారదర్శకత, వారి తల్లిదండ్రులకు గౌరవం దక్కుతుందని భావిద్దాం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page