బొగ్గు నుంచి గ్యాస్!
- DV RAMANA

- 2 hours ago
- 3 min read
గల్ఫ్ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకున్న కేంద్రం
వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి
రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు
ఎరువుల అవసరాలను కూడా తీర్చనున్న ప్రణాళిక

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పుడు ప్రపంచమంతా చిప్స్ తయారీ నిలిచిపోయింది. దాంతో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీల స్థాపనపై దృష్టి సారించాల్సి వచ్చింది. అదే కోవలో ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు గ్యాస్ సరఫరా వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని కార్యోన్ముఖం చేశాయి. ప్రతి సంక్షోభం, ప్రతి యుద్ధం ఒక గుణపాఠంగా మారుతుందనడానికి ఇవే నిఖార్సైన నిదర్శనాలు. అయితే మనపై మరో అపవాదు కూడా ఉంది. పీకల మీదికి వస్తేగానీ దేనిపైనా శ్రద్ధ తీసుకోము, భవిష్యత్తు గురించి ఆలోచించబోమన్నది ఆ అపవాదు. వంట గ్యాస్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఇలాగే ఉన్నప్పటికీ.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇంతకూ విషయమేమిటంటే.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, దాడులు ప్రతిదాడులు, హర్మూజ్ జలసంధి మÖసివేత వంటి కారణాలతో సరఫరా చెయిన్ తెగిపోయి గల్ఫ్ ప్రాంతం నుంచి ముడిచమురు, గ్యాస్ రవాణా చాలావరకు స్తంభించిపోయింది. దీనివల్ల వ్యవస్థలు స్తంభించిపోయే ముప్పు తలెత్తడంతో చాలా దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. గల్ఫ్‌కు ఆఫ్రికా దేశాలు, అమెరికా వంటి మరికొన్ని దేశాలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇదే క్రమంలో భారత ప్రభుత్వం ఇటువంటి అనేక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు గ్యాస్ ఉత్పత్తిలో సాధ్యమైనంతవరకు స్వావలంబన సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ దిశగా ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఆమోదించింది. ఇందుకోసం రూ.37,500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటి? దాని వల్ల మన దేశీయ గ్యాస్ అవసరాలు ఏ మేరకు తీరుతాయన్న చర్చ జరుగుతున్నది.
ఏమిటీ కోల్ గ్యాసిఫికేషన్
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, లాభనష్టాల గురించి చర్చించే ముందు కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే బొగ్గును ప్రాసెస్ చేసి ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సహజ వాయువు(నేచురల్ గ్యాస్)కు ప్రత్యామ్నాయంగా సింథటిక్ గ్యాస్ తయారుచేసి వినియోగించడం. ఈ ప్రక్రియలో బొగ్గును నేరుగా కాల్చకుండా అధిక ఉష్ణోగ్రతలు, పీడనం(ప్రెజర్) వద్ద ఆక్సిజన్, ఆవిరి తో శాస్త్రీయ ప్రక్రియల ద్వారా సింథటిక్ గ్యాస్‌గా మారుస్తారు. ఇందులో హైడ్రోజన్, కార్బన్ మొనాక్సైడ్ ప్రధాన మÖలకాలుగా ఉంటాయి. సింథటిక్ గ్యాస్ నుంచి ఎల్పీజీ, మిథనాల్, యÖరియా, అమ్మోనియా, డీఎంఈ తదితర ఎరువులు ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల మన ప్రయోజనాలు కొంతవరకు నెరవేరే అవకాశం ఉన్నా.. సింథటిక్ గ్యాస్ ఉత్పత్తి అవసరమైనంతగా బొగ్గు నిక్షేపాలు దేశంలో ఉన్నాయా అన్న సందేహం కలగవచ్చు. దేశంలో 401 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. రాబోయే 200 సంవత్సరాల వరకు మన అవసరాలకు ఇది సరిపోతాయని అంచనా. భవిష్యత్తు సంగతెలా ఉన్నా ప్రస్తుత మన అవసరాలకు తగినట్లు వీటిలో కొన్ని నిక్షేపాలను వాడుకోవాలన్న ప్రాప్తకాలజ్ఞనత ప్రభుత్వానికి ఇన్నాళ్లూ లేకుండా పోవడం వల్ల గ్యాస్ కోసం దిగుమతులపై ఆధారపడటం, దానికోసం భారీగా విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ మన పొరుగునే ఉన్న చైనా ఈ విషయంలో తక్షణావసరాలకే అధిక ప్రాధన్యతనిస్తూ ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ దర్జా ఒలకబోస్తున్నది. ఆ దేశంలో ఇప్పటికే 93 వరకు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి గ్యాస్ సంక్షోభ సమయంలోనూ ధైర్యంగా మనగలుగుతున్నారు.
మన అవసరాలను తీర్చగలదా?
కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మన దేశీయ అవసరాలు పూర్తిస్థాయిలో తీరకపోయిగా కొంతవరకు అక్కరకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రాజెక్టుతో 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే 2030 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు లేదా లిగ్నైట్‌ను గ్యాసిఫికేషన్ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు పెరుగుతాయి. లక్షల కోట్ల మేరకు ఉన్న దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గుతుంది. అయితే ఇప్పటికిప్పుడు మన దేశ అవసరాలను ఇది పూర్తిస్థాయిలో తీర్చలేకపోవచ్చు. 2025 లెక్కల ప్రకారం దేశంలో గృహ, పరిశ్రమలు, వాహన రకాలు కలిపి ఆ ఏడాది 65 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును వినియోగించారు. ఇందులో 55 శాతం వరకు దిగుమతి చేసుకున్నదే. ప్రస్తుత అంచనాల ప్రకారం 2030 నాటికి దేశీయ వినియోగం 100`120 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు దిగుమతులు కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. కానీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 2030 నాటికి మొత్తం గ్యాస్ డిమాండులో 35 నుంచి 45 శాతం వరకు దేశీయ సింథటిక్ నేచరల్ గ్యాస్‌తో భర్తీ చేయనున్నారు. అంటే దిగుమతుల భారం పెరగకుండా ఇప్పటిస్థాయిలో ఉండేలా మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని అర్థమవుతుంది. అయితే భవిష్యత్తులో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను విస్తరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
దిగుమతుల భారం తగ్గుతుంది
కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ గ్యాస్ అవసరాలకు ఆదరువుగా నిలవడమే కాకుండా ఎరువుల లభ్యత పెంచుతుంది. వ్యవసాయ ఖర్చు తగ్గిస్తుంది. పశ్చిమాసియాలో, గల్ఫ్‌లో భవిష్యత్తులో యుద్ధాలు చెలరేగినా ఇప్పటిమాదిరిగా మన మార్కెట్లు వణికిపోవాల్సిన అవసరం ఉండదు. దేశీయ కరెన్సీ రూపాయి మీద ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. మన దేశంలో లభించే బొగ్గు నిక్షేపాలు అంత నాణ్యమైనవి కావు. వాటిలో బూడిద శాతం ఎక్కువ. ఈ లోపాన్ని ఎదుర్కొనేందుకు కూడా మనదేశం కొత్త వ్యవస్థను రూపొందించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్ రాష్ట్రాల్లో అధికంగా కేంద్రీకృతమై ఉన్న బొగ్గుక్షేత్రాల్లో గ్యాసిఫికేషన్ కేంద్రాలు, గ్యాసÊ పైపులైన్లు నిర్మిచాలని ప్రణాళికలు వేస్తున్నారు. దీనికి ముందుకొచ్చే ప్రైవేట్ కంపెనీలకు 30 ఏళ్ల వరకు బొగ్గు సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నారు.






Comments