గాలి పనులతో.. సూర్య‘దీపం’ ధగ దగా!
- Prasad Satyam
- 2 days ago
- 3 min read
కార్పొరేషన్ పన్ను ఆదాయానికి లక్షల్లో ఎసరు
గుమస్తాగా చేరి దోపిడీ మరిగిన ఘనుడు
కంటికి కనిపించని పనులకే అతగాడు కాంట్రాక్టర్
అధికారులు చెప్పినట్లు బిల్లు పెట్టుడు.. వాటాలు పంచుడు
ఒక్క ఏడాదిలోనే రూ.34 లక్షల చెల్లింపులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అన్నీ సవ్యంగా జరిగినోడిని చూసి ‘వాడిదేదో దీపమై కాలుతుంది’ అనడం ఆనవాయితీ. అదే సమయంలో ‘వడ్డించేవాడు మనవాడైతే విస్తరిలో అన్నీ పడతాయని’ నానుడి. మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకూ ఇవే నానుడులు వర్తిస్తాయేమో. ఎందుకంటే.. వారికి డబ్బులు అవసరమైన ప్రతిసారీ ఏదో ఒక పేరు పెట్టి, ఎవరో ఒక కాంట్రాక్టర్‌ను ముందు పెట్టి లక్షలకు లక్షలు దోచేస్తున్న వ్యవహారం ఇప్ప్పుడిప్ప్పుడే బయటపడుతోంది. ఈ తరం పిల్లలకు పళ్లూడిన దగ్గర్నుంచి మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేకాధికారులుగా వ్యవహరించే కలెక్టర్లు కిందిస్థాయిలో జరుగుతున్న అవినీతిపై దృష్టి సారించలేకపోవడం వంటి కారణాల వల్ల మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రజలు కడుతున్న పన్నుల సొమ్ముతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న భ్రమల్లో మనల్ని ఉంచి లక్షలాది రూపాయలు మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి దోచేస్తున్న కథ ఇది.
భౌతికంగా కనిపించని పనులు
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో అడ్డగోలుగా బిల్లులు పెట్టేసి సొమ్ము చేసుకునే ఓ కాంట్రాక్టర్ వద్ద గుమస్తాగా చేరి, ఆ తర్వాత పనులు చేయకపోయినా అధికారులను మేపితే సొమ్ములు ఎలా వచ్చిపడతాయో తెలుసుకున్న ఒక వ్యక్తి.. ఆ తర్వాత ఇదే మున్సిపల్ ఆఫీసులో అధికారులు పర్యటనలకు అద్దెకార్లు పెట్టడం ప్రారంభించాడు. డ్రైవర్ స్థానంలో తనే వెళ్లి ఎంఈలు, డీఈలను మచ్చిక చేసుకుని ‘నీకిది.. నాకది..’ (క్విడ్ ప్రోకో) తరహాలో ఒప్పందం కుదుర్చుకుని లక్షల సొమ్ము సర్దేశాడు. 2024`25 ఆర్థిక సంవత్సరంలో ఆయన చేపట్టిన పనుల జాబితా చూస్తే నోరెళ్లబెట్టకమానరు. ఎందుకంటే వాటిలో ఒక్క పని కూడా భూమి మీద కనిపించేది కాదు. 2024 ఏప్రిల్ ఒకటి నుంచి 2025 మార్చి 21 వరకు మున్సిపాలిటీ ఈయనకు చెక్కుల రూపంలో సమర్పించిన మొత్తం రూ.34,26,857. అయితే ఈ చెల్లింపులు రోడ్లో, కాలువలో నిర్మించినందుకు కాదు. ఆ మాటకొస్తే అటువంటి ఖర్చయ్యే పనులు ఆయన ఏమాత్రం చేయడు. కేవలం అక్కడి సరుకులు ఇక్కడకు తేవడం, మన మున్సిపల్ అధికారులకు అవసరమైనట్టు బిల్లులు పెట్టడం తప్ప మనోడు చేసిన పనులంటూ కనపడవు. ఇలా కనిపించని పనులను చక్కబెట్టే ఆ కాంట్రాక్టరే ఆర్.సూర్యదీప్. కనిపించని పనులు చేసి వాటికి డ్రా చేసిన బిల్లులు చూస్తే ఎంత ఘరానా దోపిడీ జరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది.
78వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మున్సిపల్ ఆఫీసు దగ్గర, ఆర్ట్స్ కాలేజీ దగ్గర సీరియల్ లైటింగ్ సెట్లు కట్టినందుకు రూ.84,128 చెల్లించారు. అసలు ఈ సొమ్ముతో పూర్తిస్థాయిలో మున్సిపాలిటీ సీరియల్ సెట్లే కొనుక్కోవచ్చు. ఎప్ప్పుడు కావాలంటే అప్ప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు.
900 చీపుళ్లు కొన్నామంటూ రూ.22,915 బిల్లు తీసుకున్నారు. ఇందులో ఎన్ని చీపుళ్లు ఇచ్చారు? వాటి క్వాలిటీ ఏమిటి? అని పరిశీలించేవారి నుంచి చెక్ పాస్ చేసిన అధికారి వరకు అందరికీ వాటాలే. అసలు 900 చీపుళ్ల ఖరీదు ఎంతని పరిశీలించేవాడు కూడా అంత రేటు ఎందుకని అడగకుండా ఉండాలంటే 40 శాతం పంచాల్సిందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంతవరకు మున్సిపల్ ఆఫీసులో పని చేసిన అధికారులకు డబ్బులు అవసరమైన ప్రతిసారీ సూర్యదీప్‌ను ఏదో ఒక బిల్లు తీసుకురమ్మనడం, అందులో 40 శాతం తమకు, 60 సూర్యదీప్‌కు వెళ్లేటట్టు చూసుకోవడం మున్సిపాలిటీలో ఎప్పట్నుంచో సాగుతున్నది.
2024 సార్వత్రిక ఎన్నికలప్ప్పుడు టీషర్టులు సప్లై చేశారంటూ రూ.28,615 చెల్లించేశారు.
అలాగే కారు అద్దె, ఆయిల్, డ్రైవర్ బేటాల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.72,765 ఇచ్చారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 200 రెయిన్‌కోట్లు పంపినట్లు చూపించి సూర్యదీప్‌కు 2,70,126 రూపాయల చెక్కు రాసి ఇచ్చేశారు.
అలాగే 1500 కాటన్ గ్లౌజులు సరఫరా చేశారంటూ సూర్యదీప్ 1,37,352 రూపాయలు ముట్టజెప్పారు.
ఇక బాపూజీ కళామందిర్‌లో ఏసీ రిపేర్‌కు రూ.43వేల పైచిలుకు, లేజర్ ప్రింటర్, ల్యాప్‌టాప్ సరఫరా పేరుతో రూ.1.44 లక్షల పైచిలుకు, సచివాలయాల్లో కంప్యూటర్ల మెయింటినెన్స్‌కు రూ.1.12 లక్షల పైచిలుకు, జేసీబీకి అవసరమైన బేరింగ్‌లు తెప్పించారంటూ లక్ష పైచిలుకు.. ఇలా లెక్కాపత్రం లేకుండా ఈ ఒక్క ఏడాదిలోనే సూర్యదీప్‌కు రూ.34 లక్షలకు మున్సిపల్ అధికారులు చెల్లించారు.
ప్రొసీజర్‌ను పక్కదారి పట్టించి..
వాస్తవానికి రోడ్లు, కాలువలు, పార్క్‌ల నిర్మాణం, మరమ్మతులు వంటి సివిల్ పనులు చేసేవారికి చెల్లింపుల కోసం ప్రభుత్వం విడుదల చేసే బడ్జెట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ సూర్యదీప్ లాంటి మరో ముగ్గురు గాలిలోనే పనులు చూపించి పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే సొమ్మును ఇంతవరకు ఉన్న కమిషనర్ల ద్వారా చెక్కులు రాయించుకుని లక్షల్లో మింగేస్తున్నారు. వాస్తవానికి ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పని చేపట్టాలంటే అందుకు తగిన బడ్జెట్ ఉందా? లేదా? అని చూసే చెక్కర్ దగ్గర్నుంచి కమిషనర్ వరకు అందరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ ఉందని చెక్కర్ మొదట చెబితే.. ఆ తర్వాత ఆ పని జరిగిందా? లేదా? అని ఏఈ పరిశీలించాలి. అనంతరం డీఈ, ఆ తర్వాత ఎంఈ, చివరిగా కమిషనర్.. ఇంతమంది దాన్ని చూసి, అప్ప్పుడు బిల్లు చెల్లించాలి. కానీ ఇక్కడ అటువంటివేవీ ఉండవు. పనులు జరిగినప్ప్పుడు బిల్లులు పెట్టాలని చెప్పిందే అధికారులు కాబట్టి ఏదో ఒక పేరు మీద సూర్యదీప్ బిల్లులు తయారుచేసి ఇస్తే ముందూవెనుకా చూడకుండా మనోళ్లు చెక్ పేమెంట్ చేసేశారు. ఇందులో చెక్కర్ (ఎగ్జామినర్) కారుకు ఒక్క ఏడాదిలోనే రూ.95వేల పైచిలుకు బిల్లు పెట్టారు. ఆమేరకు చెక్కు ఇచ్చేశారు కూడా. ఈ ఎగ్జామినర్ తనకు సొమ్ములందనంత వరకు ఆ ఫైల్ మీద నాట్ (చీశీt) అప్రూవ్డ్ అని రాస్తారు. సొమ్ము ముట్టిన తర్వాత దాన్నే నోట్ (చీశీtవ) అప్రూవ్డ్‌గా మార్చేస్తారు. ఒక్క అక్షరం మార్పుతో ఆయన ఎంచక్కా శ్రీకాకుళం, విజయవాడ మధ్య ఆస్తులు పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రథసప్తమి నాడే మొబైల్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేసినందుకు గాను సూర్యదీప్‌కు 2025 మార్చిలో రూ.2.92 లక్షలకుపైగా బిల్లు ఇచ్చారు. వీటన్నింటికీ లెక్కాపత్రాలు ఉండవు. పర్యవేక్షించేవారుండరు. దీంతో ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు, అధికారులకు ధారాదత్తం అయిపోతుంది. ఇది కేవలం ఒక్క సూర్యదీప్‌కు సంబధించిన కథే. ఇలాంటివారు ఇంకా చాలామంది ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో మాట్లాడుకుందాం. ప్రజల సొమ్ము దిగమింగిన తర్వాత కూడా అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తారా? అంటే అదీ లేదు. శ్రీకాకుళంలో పని చేయలేం, ఇక్కడ రాజకీయ జోక్యం ఎక్కువ, ప్రజలు సహకరించరు అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. తెర వెనుక మాత్రం నిశ్శబ్దంగా సొమ్ములు మింగేసి, అవి బయటపడేలోపు బదిలీ చేసుకుని వెళ్లిపోతుంటారు.






Comments