రేషన్ బదులు నగదు బదిలీ!
- DV RAMANA

- 2 days ago
- 2 min read
ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులకు కేంద్రం సన్నాహాలు
సబ్సిడీ సరుకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట
ప్రతినెలా లబ్ధిదారుల మొబైల్స్‌కు డిజిటల్ ఓచర్లు
ఇష్టమైతే వస్తువులు తీసుకోవచ్చు.. లేకపోతే రిడీమ్ చేయవచ్చు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
పౌరసరఫరా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ పంపిణీ విధానంలో బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కానీ త్వరలోనే రేషన్‌కు కూడా నకిలీ నగదు బదిలీ విధానాన్ని అమలు చేయనున్నారు. కార్డుదారులకు నేరుగా ప్రయోజనం కలిగిలే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంటే రేషన్ కార్డులు ఉన్నవారు నచ్చితే బియ్యం లేదా నగదు తీసుకునే వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే రేషన్ కార్డుల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుని బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుండటం, నకిలీ రేషన్ కార్డులు, తదితర సమస్యలతో బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా కేంద్రం ప్రభుత్వ పథకాల లబ్ధిని నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తున్నట్లే రేషన్ కార్డుదారులకు సరుకులకు బదులు నగదును వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట. దీని వల్ల లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రస్తుతం రేషన్‌షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, చక్కెర వంటి సరుకులు సబ్సిడీ రేటుకు అందిస్తున్నారు. అదే నేరుగా డబ్బులు బదిలీ చేస్తే ప్రజలు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్
ప్రస్తుతం చండీఘడ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు దాద్రానగర్ హావేలిలో నగదు ట్రాన్స్‌ఫర్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం లబ్దిదారుల అభిప్రాయాలు, మార్కెట్ ధరల ప్రభావాన్ని ఆధ్యయనం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గింది. కేంద్రం దీన్ని అమలు చేస్తే రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లో నెలనెలా ప్రభుత్వం నుంచి డబ్బులు జమ అవుతాయి. ఈ విధానం వల్ల లబ్దిదారులు రేషన్ షాపుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుంది. చాలామంది లబ్ధిదారులు రేషన్ ద్వారా ఇస్తున్న సరుకులను తీసుకోవడం లేదు. ఇంకొందరు సరుకులు తీసుకున్నా వాటిని అక్రమ మార్గాల్లో దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నది. కొత్త విధానం ద్వారా నకిలీ రేషన్ కార్డులను కూడా తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది నకిలీ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. నగదు బదిలీ విధానం అమల్లోకి వస్తే దీనికి చెక్ పడుతుంది. అసలైన లబ్ధిదారులు నేరుగా లబ్ధి పొందగలుగుతారు.
డిజిటల్ ఓచర్ల రూపంలో నగదు
కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ-రూపీ అనే డిజిటల్ ఓచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రేషన్ లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ప్రతి నెలా ఈ ఓచర్ల రూపంలోనే నగదు జమ చేస్తారు. ఈ ఓచర్ చెల్లించి అవసరమైతే రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు కొనుగోలు చేయవచ్చు. అవి అవసరం లేదనుకుంటే ఆ ఓచర్లను బ్యాంకులో రిడీమ్ చేసుకుని తమ ఖాతాలో జమ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.










Comments