top of page

అలో లచ్చనా అని ఏడుస్తున్నారు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 7 hours ago
  • 3 min read
  • పీఆర్ అధికారులను బురిడీ కొట్టించిన దేశం నాయకుడు

  • కాంట్రాక్టర్ పేరిట చెక్కులు విత్‌డ్రా

  • జీఎస్టీ చెల్లించకుండా అండమాన్‌లో బస

  • టెక్కలిలో నమోదైన ఫిర్యాదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మేము అధికారంలో ఉన్నాం.. ప్రతిపక్షంలో కాదు మీకు చేతనైంది చేసుకొండి అంటూ ఒక కుల కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న టీడీపీకి మండల నాయకుడుగా వ్యవహరిస్తున్న ఒక నేత టెక్కలి డివిజనల్ పŸంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారికి ధమ్కీ ఇచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. పంచాయతీరాజ్ కార్యాలయం అధికారులను బురిడీ కొట్టించి, తాను కాంట్రాక్టర్‌నంటూ సుమారు రూ.13లక్షలు విలువైన మూడు చెక్కులను వేర్వేరు ఖాతాల్లో జమ చేసి విత్‌డ్రా చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సదరు నాయకుడికి నోటీసులు పంపించి ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో ఆ శాఖ ఈఈ టెక్కలి పోలీసులకు 2025 డిసెంబర్ 22న ఫిర్యాదు ఇచ్చారు. ఎవరా నాయకుడు.. ఏమా కథాకమామీషు?

అగ్రిమెంట్ చేసుకున్నారు

పలాస మండలం గురుదాసుపురం గ్రామంలో పవర్‌గ్రిడ్ సంస్థ ఇచ్చిన సీఎసఆర్ నిధులతో గ్రామంలో కమ్యూనిటీ హాల్‌తో పాటు రోడ్లు, ప్రహరీ నిర్మాణానికి టెక్కలి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఈఈ ద్వారా 2019`20లో ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్‌ను నర్సిపురం నారాయణరావు అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. రూ.10లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.5 లక్షలతో రోడ్డు, ప్రహారీ గోడ నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పనులను ప్రారంభించడానికి ముందు నారాయణరావును స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు సంప్రదించి తమ గ్రామానికి చెందిన పనులు కాబట్టి వాటిని తామే చేసుకుంటామన్నారు. అందుకు కాంట్రాక్టర్ నారాయణరావు అంగీకరించి పనులు చేసుకోవడానికి అభ్యంతరం లేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, టాక్స్‌ను చెల్లించుకోవాలని సూచించారు. దీనికి అంగీకరించిన సదరు టీడీపీ నాయకుడు పనులు ప్రారంభించారు.

మూడేళ్ల గడిచిన తర్వాత

మొదట విడతలో రూ.3లక్షల బిల్లుకు టెక్కలి పంచాయతీరాజ్ శాఖ అధికారులు నర్సిపురం నారాయణరావు పేరుతో ఒక చెక్కును ఇచ్చారు. దీన్ని అధికారుల నుంచి తీసుకున్న సదరు టీడీపీ మండల నాయకుడు కాంట్రాక్టర్ నర్సింగరావు వద్దకు వచ్చి సంతకం చేసి 12 శాతం జీఎస్టీ కింద చెల్లించాల్సిన రూ.35 వేలకు బదులు రూ.25 వేలు చేతిలో పెట్టి మిగతా మొత్తం తర్వాత ఇస్తానని చెప్పి వెళ్లిపోయారని కాంట్రాక్టర్ వాపోతున్నారు. ఆ తర్వాత 2019 మే 27న రూ.2.42 లక్షలు, 2021 జనవరి 27న రూ.8.89 లక్షలు చెక్కులను టీడీపీ నాయకుడు అధికారుల నుంచి నేరుగా తీసుకున్నాడు. ఈ రెండు చెక్కులను ఎన్.నారాయణరావు పేరుతో తీసుకొని ఆంధ్రాబ్యాంకులో నీలాపు నారాయణరావు, నక్క నారాయణరావు పేర్లతో ఉన్న ఖాతాల్లో జమ చేసి వాటిని విత్ డ్రా చేసుకున్నాడు. అధికారుల నుంచి చెక్కులు తీసుకున్నట్టు, వాటిని బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకున్నట్టు కాంట్రాక్టర్ నర్సిపురం నారాయణరావుకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆ సమయంలో కోవిడ్ రావడం, బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంతో కాంట్రాక్టర్ నారాయణరావు నిధులు రాలేదేమోనని వాకబు చేయడం మానేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. మూడేళ్ల గడిచిన తర్వాత సెంట్రల్ జీఎస్టీ కార్యాలయం నుంచి కాంట్రాక్టర్ నర్సిపురం నారాయణరావుకు జీఎస్టీ బకాయి, టాక్స్‌ను వడ్డీతో పాటు రూ. 3.1 లక్షలు చెల్లించాలని నోటీసులు అందుకున్నారు. బిల్లులు జమ చేయకుండా జీఎస్టీ చెల్లించడం ఏమిటని విశాఖలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంను కాంట్రాక్టర్ నర్సిపురం నర్సింగరావు సంప్రదించారు. దీంతో జీఎస్టీ అధికారులు బిల్లులు చెల్లింపులు జరిగిన తేదీలను కాంట్రాక్టర్‌కు చేతికి ఇచ్చారు. జీఎస్టీ రూ.1.70 లక్షలు, వడ్డీ రూ.1.30 లక్షలు , టాక్స్‌తో మొత్తం రూ.3.10 లక్షలుగా అధికారులు లెక్క చూపించారు.

హెచ్చరించినా లెక్క చెయ్యలేదు

కాంట్రాక్టర్ నర్సిపురం నారాయణరావు టెక్కలి పంచాయతీరాజ్ ఈఈని సంప్రదించగా, బిల్లులు చెల్లింపులు పూర్తయినట్టు సమాచారం ఇచ్చారు. కాంట్రాక్టర్ పేరుతో ఇవ్వాల్సిన చెక్కులు వేరొక వ్యక్తికి, వేరే పేరుతో ఎలా ఇస్తారని, జీఎస్టీ అధికారులకు సమాధానం ఎవరు చెబుతారని అధికారులను నారాయణరావు నిలదీశారు. నర్సిపురం నారాయణరావు పేరుతో ఇవ్వాల్సిన చెక్కులను ఎన్.నారాయణరావు పేరుతో ఇచ్చినట్టు గుర్తించారు. ఈ చెక్కులను పొరపాటున కార్యాలయం ఉద్యోగులు ఇచ్చినట్టు శాఖ అధికారి కాంట్రాక్టర్ నర్సింగరావుకు వివరించారు. దీంతో చెక్కులను వేరొకరి పేరుతో తీసుకువెళ్లిన టీడీపీ నాయకుడిని కాంట్రాక్టర్ సంప్రదించి జీఎస్టీని చెల్లించి దీనికి ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. అందుకు టీడీపీ నాయకుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పి తప్పించుకు తిరగడం ప్రారంభించారని సదరు కాంట్రాక్టర్ ‘సత్యం’కు చెప్ప్పుకొచ్చారు. ఆతర్వాత తాను ఫోన్‌లో టీడీపీ నాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందించలేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా టీడీపీ నాయకుడు లెక్క చెయ్యలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. మరోవైపు టెక్కలి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల వద్ద కాంట్రాక్టర్ నారాయణరావు పంచాయితీ పెట్టారు. కాంట్రాక్టర్ పేరుతో కాకుండా వేరొకరి పేరుతో చెక్కులు తీసుకున్నందున ఆ శాఖ అధికారులు పలాస టీడీపీ మండల నాయకుడిని ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినా, ఆయన స్పందించలేదు. దీంతో ఆ శాఖ ఈఈ సదరు నాయకుడికి నోటీసులు పంపించారు. నోటీసులను తీసుకోకుండా వాటిని టీడీపీ నాయకుడు తిరస్కరించారు. గత్యంతరం లేక కాంట్రాక్టర్ నారాయణరావు డివిజనల్ పంచాయతీరాజ్ ఈఈపై టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్రాక్ చేస్తే అండమాన్‌లో..

పంచాయతీరాజ్ అధికారులు సదరు పలాస టీడీపీ మండల నాయకుడిని సంప్రదిస్తే ఘాటుగా స్పందించడంతో అధికారులను చీటింగ్ చేసి చెక్కులను తీసుకొని బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రా చేసినట్టు ఆధారాలతో పంచాయతీరాజ్ ఈఈ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పలాస టీడీపీ మండల నాయకుడిని ఫోన్‌లో సంప్రదించారు. అయినా సదరు నాయకుడు స్పందించలేదు. దీంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చి వారితో కలిసి టెక్కలి పోలీసు సదరు మండల టీడీపీ నాయకుడు ఇంటికి వెళ్లారు. ఇంట్లో కుటుంబ సభ్యులను విచారించగా ఎక్కడ ఉన్నాడో తెలియదని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. పోలీసులు ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి అండమాన్‌లో ఉన్నట్టు గుర్తించారు. అండమాన్‌లో ఉన్న టీడీపీ నాయకుడుని పోలీసులు ఫోన్‌లో సంప్రదించగా పలాస వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పినట్టు తెలిసింది. అయితే మండల టీడీపీ నాయకుడుగా ఉంటున్న వ్యక్తి కాంట్రాక్టర్‌ను, అధికారులను చీటింగ్ చేసినట్టు స్థానిక టీడీపీ నాయకులందరికీ తెలుసు. మండల నాయకుడు తప్ప్పు చేయడం వల్ల అందరినీ దోషులుగా చూస్తున్నారని, ఆయన్ని వెంటపెట్టుకొని తిరగడం వల్ల మాటలు పడుతున్నామని పలాస నియోజకవర్గ నాయకుల్లో చర్చ సాగుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page