top of page

శిక్షణ వారికి.. శిక్ష మాకా?!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 9
  • 2 min read
  • రెగ్యులర్ టీచర్లు చేయాల్సిన పని పార్ట్‌టైమర్లకు

  • టెన్త్ స్పాట్ డ్యూటీల్లో అనుచిత సర్దుబాట్లు

  • అవగాహన లేకుండా చేస్తే తప్పులు దొర్లే ప్రమాదం

  • అదే జరిగితే బలి పశువులయ్యేది విద్యార్థులే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) మూడు రోజులుగా జరుగుతున్నది. జిల్లాలో ఈ కార్యక్రమానికి సంబంధించి మూడు రోజులుగా వివాదం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అనుభవం, అవగాహన లేనివారిని అప్పటికప్పుడు స్పాట్‌కు నియమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లనే నియమించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దానికి విరుద్ధంగా ఎటువంటి శిక్షణ లేని పార్ట్ టైమ్ టీచర్లను బలవంతంగా పంపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా పార్ట్ టైమ్ టీచర్ల యూనియన్ ప్రతినిధులు బుధవారం సమగ్రశిక్ష కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)ను కూడా కలిశారు. అయితే అవసరాన్ని బట్టి సర్దుకుపోవాలని అధికారులు చెబుతున్నారని పార్ట్ టైమ్ టీచర్లు ఆరోపిస్తున్నారు. దీనివల్ల మ్యూల్యాంకనంలో తప్పులు దొర్లితే విద్యార్థులు బాధితులయ్యే ప్రమాదముందుని, అలాగే తమను కూడా బాధ్యులను చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలామందికి అనుచిత మినహాయింపులు

జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలతోపాటు శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ మార్కుల నమోదు విధానాన్ని విద్యాశాఖ చేపట్టింది. ఆ మేరకు అన్ని జిల్లాల్లోనూ ముందుగానే ఏర్పాట్లు చేసింది. పరీక్ష పేపర్లు దిద్దిన తర్వాత మార్కులను డిజిటల్‌గా నమోదు చేసేందుకు ట్యాబ్‌లు సరఫరా చేసింది. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై 15 రోజుల ముందే రెండు విడతలుగా శిక్షణ కూడా ఇచ్చింది. స్పాట్ వాల్యుయేషన్‌కు టీచర్ల నియామకాలను కూడా జిల్లాస్థాయిలో పూర్తి చేశారు. కానీ స్పాట్ ప్రారంభమయ్యే సమయానికి ఆ విధుల్లో పాల్గొనాల్సిన టీచర్లు, ఆన్‌లైన్ ప్రక్రియ నిర్వహించాల్సిన స్పెషల్ అసిస్టెంట్ల(వీరూ టీచర్లే)లో చాలామంది రకరకాల కారణాలతో విధులను ఎగ్జంప్షన్ పొందారని తెలిసింది. ఫలితంగా స్పాట్‌కు సిబ్బంది కొరత ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేసేందుకు సమగ్రశిక్ష, విద్యాశాఖ అధికారులు పార్ట్‌టైమ్ టీచర్లను అప్పటికప్పుడు నియమించారని తెలిసింది.

సర్దుకుపోండి..!

రెగ్యులర్ టీచర్లు చేయాల్సిన పనిని తాత్కాలిక టీచర్లకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తున్నది. సుమారు 27 మంది పార్ట్‌టైమ్ టీచర్లను ఈ విధంగా నియమించారని, శిక్షణ పొందింది వారైతే.. అనవసర భారం తాము మోయాలా అని పార్ట్‌టైమ్ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై అధికారులను ప్రశ్నిస్తే సమస్య ఏర్పడినప్పుడు సర్దుకుపోవాలి కదా.. అని చెబుతున్నారని, పైగా ఈ ఒక్కరోజుకే చేయాలని నచ్చజెప్పారని అంటున్నారు. అయితే ఒక్కరోజే అంటూ ఏరోజుకారోజు స్పాట్ విధుల్లో చేరాలని ఎసఎంఎస్‌ల ద్వారా ఆదేశిస్తున్నారని వాపోతున్నారు. పోనీ అని స్పాట్ విధుల్లోకి వెళితే ఏమాత్రం అవగాహన, శిక్షణ లేని స్పెషల్ అసిస్టెంట్లు చేయాల్సిన ఆన్‌లైన్ మార్కుల నమోదు ప్రక్రియను తమకు అప్పగించారని అంటున్నారు. పేపర్లు దిద్దే ప్రతి ముగ్గురు టీచర్లకు ఒక స్పెషల్ అసిస్టెంట్‌ను నియమించారు. ఒక టీచరు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఆ లెక్కన ముగ్గుర టీచర్లు రోజంతా దిద్దే 120 పేపర్ల మార్కులను ఒక స్పెషల్ అసిస్టెంట్ ట్యాబ్‌లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ. దీనికితోడు ట్యాబ్‌లు సరిగ్గా పనిచేయకపోవడం, అవి పని చేస్తే నెట్ పనిచేయకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దాంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది దాటే వరకు వాటితో కుస్తీ పట్టాల్సి వస్తున్నదని పార్ట్ టైమ్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లు చేయాల్సిన పనిని ఎటువంటి శిక్షణ లేని తమ నెత్తిన రుద్దడం అన్యాయమని అంటున్నారు. పేపర్లు దిద్దడం, మార్కులు నమోదు చేయడం చాలా ఏకాగ్రతతో, అవగాహనతో చేయాల్సిన ప్రక్రియ. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కార్యక్రమం. ఎక్కడ.. ఏ చిన్న తప్పు జరిగినా విద్యార్థులు నష్టపోవడమే కాకుండా మానసికంగా కుంగిపోవడం, అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ దష్టిలో ఉంచుకుని అవగాహన ఉన్న రెగ్యులర్ టీచర్లనే స్పాట్ వాల్యుయేషన్‌కు నియుక్తం చేయాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page