top of page

ఆయన ఓవర్‌ యాక్షన్‌ చెల్లలే!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Nov 6
  • 2 min read
  • కుప్పిలి మాస్‌కాపీయింగ్‌ ఘటనలో అప్పటి డీఈవో అతిచేష్టలు

  • 14 మంది టీచర్లను సస్పెండ్‌ చూస్తూ ఏకపక్షంగా ఉత్తర్వులు

  • బాధితుల అప్పీలుతో అవి చెల్లవని తేల్చేసిన ఆర్జేడీ

  • సస్పెన్షన్‌ కాలాన్ని ఎలా పరిగణించాలన్నది అస్పష్టం

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తనలాంటి సచ్ఛీలుడైన అధికారి రాష్ట్రంలోనే ఉండరని.. తమ్ముడు తనవాడైనా తప్పు చేస్తే శిక్షిస్తానని పెదరాయుడి ఫోజులిచ్చి జిల్లా విద్యాశాఖాధికారిగా ఉద్యోగ విరమణ చేసిన తిరుమల చైతన్య ఆమధ్య పదో తరగతి పరీక్షల్లో టీచర్లు, ఇన్విజిలేటర్లు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారంటూ తీసుకున్న శాఖాపరమైన చర్యలు చెల్లవని తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడానికి ఆదరాబాదరాగా 14 మంది టీచర్లను సస్పెండ్‌ చేయడం చెల్లదని, అందువల్ల ఆ సస్పెన్షన్లను లీవు పీరియడ్‌గా పరిగణించాలంటూ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరుమలచైతన్య పదో తరగతి పరీక్షల సందర్భంగా కుప్పిలి హైస్కూల్‌లో చేసిన హల్‌చల్‌ మొత్తం ఒక డ్రామా అని తేలిపోయింది. గతంలో ఈ ఎపిసోడ్‌ను ఫాలో కానివారి కోసం సూక్ష్మంగా ఒక్కసారి గతంలోకి వెళ్దాం.

సెలవుగా పరిగణిస్తూ ఉత్తర్వులు

ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఎచ్చెర్ల మండలం కుప్పిలి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, అక్కడి మోడల్‌ పాఠశాల పరీక్షా కేంద్రాలకు కొంతమంది విద్యాశాఖాధికారులతో కలిసి తనిఖీకి వెళ్లిన తిరుమల చైతన్య ఐదుగురు విద్యార్థులు కాపీ కొడుతూ దొరికారని ప్రకటించారు. దీనికి బాధ్యత వహించాలంటూ 14 మంది టీచర్లను సస్పెండ్‌ చేసి, వారిలో ఆరుగురిపై క్రిమినల్‌ కేసులు కూడా పెట్టారు. దీనికి సంబంధించి విచారణ తతంగాలన్నీ పూర్తయిన తర్వాత మూడు రోజుల క్రితం తిరుమల చైతన్య చేసిన సస్పెన్షన్ల కాలాన్ని ఉపాధ్యాయులకు సెలవుకాలంగా నమోదు చేయాలని ఆర్‌జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వీరి మీద తీసుకున్న ఈ చర్యల నుంచి ఆటోమాటిక్‌గా డ్రాప్‌ అయినట్టే. వాస్తవానికి తిరుమల చైతన్య చేసిన సస్పెన్షన్‌ వారం రోజులపాటే అమలైంది. ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పత్రికల ద్వారా ఈ డ్రామా నాటకం బట్టబయలు కావడంతో ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ను వారం తర్వాత ఎత్తివేశారు. అయితే సర్వీస్‌ రిజిస్టర్‌లో సస్పెన్షన్‌ అనే మరక ఉండిపోతుంది కాబట్టి వారంతా ఆర్‌జేడీకి అప్పీల్‌ చేసుకున్నారు. దీంతో సస్పెన్షన్‌ చెల్లదని, సస్పెన్షన్‌లో ఉన్న కాలాన్ని సెలవుగా పరిగణించాలని ఆర్‌జేడీ కార్యాలయం ఆదేశించింది. అయితే అది ఎన్‌క్యాష్‌మెంట్‌ సెలవా? లేక ఎలిజిబులిటీ లీవా అనేది ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనలేదు.

‘సత్యం’ అప్పుడే చెప్పింది

కాగా ఈ సస్పెన్షన్లు చెల్లవని ఈ ఏడాది మార్చి 25నే సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ వెల్లడిరచింది. ‘ఆ సస్పెన్షన్లు చెల్లవు’, ‘ఉత్తర్వుల్లో పేర్కొన్న సెక్షన్లు వర్తించవు’ అంటూ ఒక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆర్‌జేడీ కార్యాలయం కూడా అదే చెప్పింది. మాల్‌ప్రాక్టీస్‌కు ప్రోత్సహించారన్న ఆరోపణలపై ఏపీసీఎస్‌ (సీసీఏ)`1991 చట్టంలోని రూల్‌8(2)(ఎ) కింద వీరిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు నాటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి రూల్‌ 8(1)(2) ప్రకారం ప్రధానోపాధ్యాయులపై గానీ, ఉపాధ్యాయులపై గానీ సస్పెన్షన్‌ వంటి చర్యలు తీసుకోవాలంటే అదే రూల్‌ 8(2)లోని సబ్‌రూల్స్‌ ప్రకారం చూస్తే ఏదైనా క్రిమినల్‌ ఆరోపణలతో అరెస్టయి కనీసం 48 గంటల పాటు రిమాండ్‌లో ఉండటం లేదా శిక్ష పడినవారిపైనే సస్పెన్షన్‌ లేదా సర్వీస్‌ నుంచి తొలగించడం వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. తిరుమలచైతన్య దెబ్బకు సస్పెండైనవారెవరూ అసలు రిమాండ్‌లోనే లేరన్న విషయం అందరికీ తెలుసు. 1991 సీసీఏ నిబంధనల ప్రకారం వీరిని సస్పెండ్‌ చేయాలంటే 1964 ఏపీసీఎస్‌ కాండక్ట్‌ రూల్స్‌ ప్రకారం సీసీఏ రూల్స్‌ వర్తింపజేస్తూ నోటీసులు ఇవ్వాలి. ఇవేవీ చేయకుండా తెలుగు సినిమా క్లైమాక్స్‌లో పోలీసులు వచ్చి ‘యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌ ’ అన్నట్టు తిరుమలచైతన్య ‘యూ ఆర్‌ ఆల్‌ సస్పెండెడ్‌’ అంటూ ఆర్డరేసేశారు. అయితే ఇప్పుడివేవీ చెల్లవని ఆర్‌జేడీ ఉత్తర్వులతో తేలిపోయింది. అయితే ఇక్కడ తిరుమలచైతన్య చేసినట్టే ఆర్‌జేడీ కార్యాలయం కూడా ఈ వారం రోజుల సస్పెన్షన్‌ను ఎటువంటి లీవుగా వర్తింపజేయాలన్నది స్పష్టంగా చెప్పలేదు. ఏది ఏమైనా ఉపాధ్యాయ సంఘాలు ఈ కేసులో విజయాన్ని సాధించాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page