top of page

డీమ్డ్‌ ఫీట్లు.. కాలేజీల పాట్లు

  • Guest Writer
  • 1 day ago
  • 3 min read
  • అక్కడ రూ.లక్షలు చెల్లించి మరీ చేరిక

  • ఇక్కడ సీట్లే నిండక యాజమాన్యాలు విలవిల

  • క్యాంపస్‌ డ్రైవ్‌లు వాటి ప్రచార వ్యూహాల్లో భాగమే

  • ఈ మర్మం తెలుసుకోలేక.. వాటివైపే మొగ్గుతున్న తల్లిదండ్రులు

  • ఫలితంగా వేలసంఖ్యలో మిగిలిపోతున్న సీట్లు

ree

- సీహెచ్‌ దుర్గాప్రసాద్‌,

డైరెక్టర్‌, పద్మావతి కళాశాల

ree

రాష్ట్రంలో నాలుగోవంతు ఇంజినీరింగ్‌ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయనే వాదనలో పస లేదు. ఇప్పుడు డీమ్డ్‌ యూనివర్సిటీల మీదే తల్లిదండ్రులు మోజు చూపుతున్నారు. అంతంతమాత్రంగా సంపాదిస్తున్నవారు సైతం తమ పిల్లల్ని అటానమస్‌ లేదా డీమ్డ్‌ వర్సిటీల్లో చేర్చడానికే మొగ్గు చూపుతున్నారు. అందువల్లే ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు మిగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి కన్వీనర్‌ కోటాలో ఉన్న సీట్ల కంటే విద్యార్థులు తక్కువగా ఉండటం వల్ల రాష్ట్రంలో 34,298 సీట్లు మిగిలిపోయాయి. అలాగే విశ్వవిద్యాలయాల్లో 1361 సీట్లు ఖాళీగా ఉన్నాయి. యాజమాన్య కోటా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కన్వీనర్‌ కోటా సీట్లకు సాంకేతిక విద్యాశాఖ రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో ఏకంగా 31,811 సీట్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1126 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులకంటే సీట్లే ఎక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఇంజినీరింగ్‌ సెట్‌లో 1,84,248 మంది అర్హత సాధించగా వారిలో 1,29,012 మంది కన్వీనర్‌ కోటాలో చేరేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్‌ కోటా కింద 1,53,966 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత సాధించినవారందరికీ సీట్లు కేటాయించినా, ఇంకా 25 వేలకు పైగా సీట్లు మిగిలిపోతాయి. ఈ పరిస్థితి దాపురించడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో ప్రతి ఇంజినీరింగ్‌ కాలేజీకీ అడిగిందే తడవుగా సీట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఒకటి కాగా.. డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో వంద శాతం సీట్లను యాజమాన్యమే భర్తీ చేసుకోవడం మరో కారణం. ప్రతి డీమ్డ్‌ యూనివర్సిటీకి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించే ర్యాంకులను బట్టి ఫీజులు, మేనేజ్‌మెంట్‌ కోటాలతో భర్తీ చేసుకుంటున్నారు.

కొలువు ఖాయమన్న భ్రమలు

శ్రీకాకుళంలో ఒకప్పుడు జీఎంఆర్‌ ఐటీలో సీటొచ్చిందంటే అబ్బో.. అంటూ నోరెళ్లబెట్టే పరిస్థితి. దాని తర్వాత టెక్కలిలో ఐతమ్‌ కాలేజీ మీద అంతో ఇంతో మోజుండేది. కానీ ఇప్పుడు జిల్లాలో ఇటువంటి కాలేజీల వైపు ఓ మోస్తరు విద్యార్థులు కూడా చూడటంలేదు. మన రాష్ట్రంలో ఉన్న డీమ్డ్‌ వర్సిటీలే కాకుండా వెల్లూరు, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌తో పాటు పంజాబ్‌ లాంటి పలు రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్‌ వర్సిటీల వైపు చూస్తున్నారు. ఫీజ్‌ ఎంతైనా తగ్గడంలేదు. ఒక విద్యార్థి ఒక డీమ్డ్‌ యూనివర్సిటీలో చదవాలంటే ఫీజు రూపేణా తక్కువలో తక్కువ రూ.35 లక్షలు ఖర్చవుతుంది. దీనికి హాస్టల్‌, మిగతా ఫీజులు అదనం. అయినా కూడా అప్పోసప్పో చేసి డీమ్డ్‌ వైపే వెళుతున్నారు. ఒకప్పుడు జేఎన్టీయూ, ఆంధ్రా యూనివర్సిటీల్లో సీటు దొరికితే గొప్ప అనుకున్న పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అవే యూనివర్సిటీల్లో దాదాపు 1400 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో నిర్వహించిన ఇంజినీరింగ్‌ ప్రవేశ్‌ పరీక్షలో మొదటి 200 ర్యాంకులు పొందినవారిలో కేవలం ఇద్దరే కౌన్సెలింగ్‌లో పాల్గొంటే.. 500 లోపు ర్యాంక్‌ సాధించినవారు 12 మంది మాత్రమే పాల్గొన్నారు. అయితే వీరు రాష్ట్రంలో ఏదైనా కాలేజీలో జాయిన్‌ అయ్యారా అంటే అదీ సందేహమే. కారణం నాలుగువేల ర్యాంక్‌ లోపు వచ్చిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు బ్రాండ్‌ కోసం తమ పిల్లలను ఏదో ఒక ఐఐటీ లేదా ఎన్‌ఐటీలలో నాన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు అంటే హ్యుమానిటీస్‌ కోర్సుల్లో కూడా చేర్చుతున్నారు. వాస్తవానికి ఈ ఇన్‌స్టిట్యూట్స్‌ వాటి కోసం ఏర్పాటుచేసినవి కావు. కేవలం సాంకేతిక విద్యలో పరిశోధన కోసం నెలకొల్పబడినవి. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో విద్యార్థులు డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చేరారు. అనేక మంది ఆయా సంస్థలు నిర్వహించిన ఎంట్రన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించినవారు కాగా, వేల సంఖ్యలో విద్యార్థులు ఒక మోస్తరు ర్యాంక్‌ కూడా పొందనివారు ఉన్నారు. ఆ యూనివర్సిటీలు నిర్వహించే పరీక్ష ఆధారంగా కాకుండా స్లాబులుగా విభజించి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసి విద్యార్థులను జాయిన్‌ చేసుకుంటున్నాయి. ఇంజినీరింగ్‌ పూర్తయ్యే సరికి హాస్టల్‌తో కలుపుకుని రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసినా తల్లిదండ్రులకు వాటిపై వ్యామోహం తగ్గడం లేదు. అక్కడ చేరిస్తే కొలువు ఖాయమన్న నమ్మకంతో పిల్లలను జాయిన్‌ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ప్లేస్‌మెంట్స్‌ విషయంలో జరుగుతున్న అక్రమాల తంతు వీరికి తెలియడం లేదు.

ప్రచారం కోసం ఉత్తుత్తి క్యాంపస్‌ డ్రైవ్‌లు

సాధారణంగా ప్రతి ఏడాది ఇలాంటి యూనివర్సిటీలు ప్రాంగణ నియామకాలు (క్యాంపస్‌ డ్రైవ్స్‌) చేపట్టి విద్యార్థులను ఎంపిక చేసి ఆఫర్‌ లెటర్స్‌ ఇస్తుంటాయి. వీరిలో కొంతమందికి మాత్రమే సంబంధిత కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఇక్కడ ఒక విషయం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు న్యాక్‌, ఎన్బీయే, అటానమస్‌ హోదాలను పొందడానికి లేదా కాపాడుకోవడానికే ఇలాంటి ప్రాంగణ నియామకాలు చేపడుతుంటాయి. పెద్దసంఖ్యలో తమ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పించుకోవడం, ఆ మేరకు రికార్డుల్లో నమోదు చేయడమే వాటికి ముఖ్యం. ఇక కొన్ని కంపెనీలు విదేశాల నుంచి ప్రాజెక్టులు పొందడానికి ఘోష్ట్‌ నియామకాలు చేపడుతుంటాయి. తమ వద్ద పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారని తెలపడం కోసం ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు నిర్వహించి విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు అందజేసి అటు తర్వాత మొహం చాటేస్తాయి. విద్యార్థులు ఈ నియామకాలు నిజమని నమ్మి కొంతకాలం వేచి చూసిన తర్వాత ఉసూరుమంటూ ఏదో ఒక కంపెనీలో ఎంతో కొంత జీతానికి చేరిపోతారు. అందువల్ల లక్షలకు లక్షలు ఖర్చు చేసి ఇలాంటి యూనివర్సిటీల్లో చదివించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. అనేక మంది విద్యార్థులు అక్కడ పెట్టే భోజనం చేయలేక బయట క్యాంటీన్లలో తింటూ అనారోగ్యం పాలైన సందర్భాలు ఉన్నాయి. చెడు స్నేహాల బారిన పడి డ్రగ్స్‌, గంజాయి లాంటి వ్యసనాలకు బానిసైన పరిస్థితులు ఉంటున్నాయి. తమ సర్కిల్స్‌లో ఉన్న పిల్లలను అక్కడ జాయిన్‌ చేశారన్న ధీమాతో అలాంటి నిర్ణయం తీసుకోవడం అనాలోచితం. ఇక మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సగానికిపైగా అటానమస్‌ హోదా ఉన్నవే. ప్రముఖ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో నడుస్తున్నవే. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకు క్యాంపస్‌ డ్రైవ్‌లు నిర్వహించి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆ కంపెనీలు చిన్నవన్న తప్పుడు భావనతో వాటిలో చేరడం చిన్నతనంగా భావిస్తున్నారు. నైపుణ్యం ఉన్న విద్యార్థి ఎక్కడైనా రాణించగలడని విశ్వసించాలి. నేటి సాంకేతిక యుగంలో అనేక కోర్సులు ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. స్కిల్‌ పెంపొందించుకోవచ్చు. మన ప్రాంతంలో చదువుకుని కూడా మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అని తెలుసుకోవాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page