ప్రస్తుతానికి ఏఐ.. గాలి బుడగే!
- DV RAMANA
- 17 hours ago
- 2 min read
ఇప్పటికిప్పుడు దానిపై పెట్టుబడులు నష్టదాయకం
ఇంటర్నెట్ వచ్చిన తొలి దశలోనూ అదే అనుభవం
కుదురుకున్నాక మాత్రం తిరుగు ఉండదు
ఓపెన్ ఏఐ వ్యవస్థాపక సీఈవో హెచ్చరిక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఐటీ రంగమే కాదు.. ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జపం చేస్తోంది. ఏఐ ఆధారిత కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. అందులో ప్రవేశం ఉన్నవారికే ఉద్యోగావకాశాలని స్పష్టం చేస్తున్నాయి. కృత్రిమ మేథ అనే ఏఐ వల్ల అనేక రంగాల్లో వందలాది ఉద్యోగాలు ఎగిరిపోతాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు పోయాయని అంటున్నారు. కానీ ఇది పాక్షిక వాస్తవం మాత్రమేనని, కృత్రిమ మేథ ప్రస్తుతానికి గాలి బుడగ మాత్రమేనని సాక్షాత్తు ఓపెన్ ఏఐ వ్యవస్థాపక సీఈవో సామ్ ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు. ఆయనొక్కడే కాదు.. పలువురి నిపుణులది ఇదేమాట. కార్పొరేట్ కంపెనీలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బంగారు బాతుగుడ్డు అన్న భ్రమల్లో ఉన్నారని, కానీ వాస్తవాన్ని పరిశీలిస్తే 95 శాతం ఏఐ ఆధారిత సంస్థలు విఫలమై నష్టాలు మిగిల్చాయని చెప్పుకొచ్చారు. కేవలం ఐదు శాతం ప్రాజెక్టులు మాత్రమే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాస్తవాల చుట్టూ అల్లుకున్న గాలి బుడగ మాత్రమేనని, అది రోజురోజుకూ పెద్దదవుతోందని, అది ఏ క్షణమైనా పేలిపోవచ్చని ఆల్ట్‌మన్ హెచ్చరించారు. ఇంటర్నెట్ వచ్చిన తొలినాళ్లలో.. 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ ఆధారంగా అత్యుత్సాహంతో ఏర్పాటైన కంపెనీలు కొద్దికాలానికే అడ్రస్ లేకుండాపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. పెట్ డాట్ కామ్, వెబ్‌వాన్ లాంటి సంస్థలు సరైన ప్రణాళిక లేకుండా, పరిపక్వత లేని ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చి స్వల్పకాలంలోనే దెబ్బతిన్నాయని వివరించారు. వీటి ప్రభావంతోనే 2000 నుంచి 2002 మధ్య కాలంలో అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్‌డాక్ కుప్పకూలి 80 శాతం మేరకు నష్టపోయింది. అదే రీతిలో ప్రస్తుతం కృత్రిమ మేధను నమ్ముకుని సరైన ప్రణాళిక లేకుండా ఏర్పడుతున్న కంపెనీలు కూడా ఇలాగే కనుమరుగైపోవచ్చు. అయితే తర్వాత కాలంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని నడిపించే స్థితికి ఎదిగినట్లే.. ఏఐ కూడా భవిష్యత్తులో ఎంతో ముందంజ వేయవచ్చు. మానవ జీవితాలను సమూలంగా మార్చేసే అవకాశం కూడా ఉందని ఆల్ట్‌మన్ చెప్పారు. కానీ ఏఐ తొలి దశలోనే దానిపై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న కంపెనీలు మాత్రం గొప్ప ఫలితాలు సాధించకపోవచ్చన్నది ఆయన విశ్లేషణ. ఏఐ మీద పెట్టుబడి పెట్టిన కంపెనీలు ప్రస్తుతం నష్టాల పాలవుతుండటం కూడా వాస్తవం. ఒక ఏఐ వెర్షన్‌తో పని ప్రారంభిస్తే.. ఆ వెంటనే మరో కొత్త వెర్షన్ వస్తుంది. దీనివల్ల కృత్రిమ మేధ వాడుతున్న కంపెనీలు సందిగ్ధంలో పడుతున్నాయి. పాత వెర్షన్‌తో సగం పని చేసిన తర్వాత కొత్త వెర్షన్‌కు మారడం కష్టమవుతుంది. అంతవరకు చేసిన పని, పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే ప్రమాదముంది. అందువల్ల పరిస్థితి కుదురుకునే వరకు ఏఐ ఎప్పుడైనా పేలిపోయే బుడగ మాత్రమేనని ఆల్ట్‌మన్ వంటి టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comentarios