మున్సిపల్ టీచర్ల బెట్టు.. నిబంధనలు తీసికట్టు!
- NVS PRASAD
- Jun 13
- 3 min read
డీఈవో ఆదేశాలు తమకు వర్తించవని వాదన
ఇతర యాజమాన్య పాఠశాలలకు వెళ్లేందుకు ససేమిరా
వారి నిర్వాకంతో చాలా ఖాళీగా టీచర్ పోస్టులు
ఇచ్ఛాపురం నుంచి మూకుమ్మడిగా ఆమదాలవలసకు బదిలీలు
ఆ నియోజకవర్గంలో పాఠాలు చెప్పేవారు కరువు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు లేరు (సబ్జెక్ట్ ఉపాధ్యాయులతో సహా) అనే మాట రాకూడదు. పాఠశాల నుంచి ఎంతమంది బదిలీపై వెళ్తున్నారు.. వారి స్థానంలో ఎంతమంది కొత్తగా జాయినవ్వాలన్న విషయాన్ని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈరోజే అంచనా చేసుకోవాలి. రేపటికి ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు లేరు అనే మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. నూతన పాఠశాలల్లో జాయిన్ కావాల్సిన వారు తమ స్థానంలో రిలీవర్ వచ్చేవరకు పని చేయాలన్న దానిపై కొన్ని సూచనలు పంపుతున్నాం.’
..ఇదీ పాఠశాలల పునఃప్రారంభానికి ముందురోజు జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య అన్ని మండలాల ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పంపిన వాట్సాప్ సందేశం. అయితే గురువారం పాఠశాలలు పునఃప్రారంభమైనా అనేక చోట్ల ఉపాధ్యాయులు లేకుండానే తరగతులు జరిగాయి. కారణం.. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో బదిలీలకు అర్హతలున్నవారందరూ దూరప్రాంతాల నుంచి దగ్గరి ప్రాంతాలకు ఆప్షన్ ఇచ్చి వెళ్లిపోవడంతో మారుమూల ప్రాంతాల్లోని అనేక పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకుండాపోయారు. అసలు ఈ బదిలీల ఉద్దేశమే ఉపాధ్యాయుడు లేని పాఠశాల ఉండకూడదని, ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 50 శాతం మంది ఉపాధ్యాయులు ఉండాలని, ఎక్కడైనా ఒక పాఠశాలలో మొత్తం ఉపాధ్యాయులు బదిలీ అయితే వారిలో 50 శాతం నిష్పత్తి మేరకు జూనియర్లు మళ్లీ అదే పాఠశాలలో రిపోర్ట్ చేయాలన్న నిబంధన ఉంది. అలాగే హైస్కూళ్లలో సబ్జెక్ట్‌కు ఒక ఉపాధ్యాయుడు కచ్చితంగా ఉండాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. దీన్ని జిల్లాపరిషత్ యాజమాన్యంలోని పాఠశాలల్లో పాటించినా మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు మాత్రం పెడచెవిన పెట్టారు. ఫలితంగా ప్రస్తుతం జిల్లాపరిషత్, మున్సిపల్ పాఠశాలల యాజమాన్యాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది.
డీఈవో పరిధిలోనే అన్ని పాఠశాలలు
సాధారణంగా మూడు రకాల పాఠశాలలు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్, రెండు జిల్లాపరిషత్, మూడు మున్సిపాలిటీ ఆధీనంలో నడిచే పాఠశాలలు. కొన్నేళ్ల క్రితం వరకు మున్సిపల్ పాఠశాలలకు సంబంధిత మున్సిపల్ కమిషనరే బాస్‌గా ఉండేవారు. కానీ తర్వాత ప్రభుత్వం పాఠశాలలన్నీ ఒకే గొడుగు కింద పని చేయాలన్న ఉద్దేశంతో డీఈవోల పరిధిలోకి తీసుకొచ్చింది. ఫలితంగా బదిలీలకు ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలు, నిబంధనలు అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తాయి. ఆమధ్య విద్యార్థులున్నచోట ఉపాధ్యాయులు లేరని తేలడంతో మేనేజ్‌మెంట్‌తో సంబంధం లేకుండా జిల్లాపరిషత్ పరిధిలో ఉన్న టీచర్లను మున్సిపల్ పాఠశాలలకు పంపి పని చేయించారు. కానీ ఇప్పుడు బదిలీల వద్దకు వచ్చేసరికి ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకే ఆప్షన్ ఇచ్చి బదిలీ అయిన టీచర్లు కొన్ని స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు లేకుండాపోయారని తెలిసినా వెనక్కు రావడానికి ఇష్టపడటంలేదు. ఇదేమని ప్రశ్నిస్తే తాము మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్నందున డీఈవో ఆదేశాలు చెల్లవంటున్నారు. వాస్తవానికి వీరంతా విద్యాశాఖ ఆర్‌జేడీ పరిధిలోనే ఉన్నారు. సర్దుబాటులో భాగంగా జిల్లాపరిషత్ టీచర్లు మున్సిపాలిటీలో కొన్నాళ్లు పని చేసినప్పుడు వర్తించిన నిబంధనలు ఇప్పుడు వర్తించవనడం ఏమేరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది.
నష్టపోతున్న ఇచ్ఛాపురం నియోజకవర్గం
ముఖ్యంగా ఇచ్ఛాపురంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు నిన్నటి బదిలీల్లో ఆమదాలవలసకు క్యూ కట్టారు. జిల్లాకు, రాష్ట్రానికి శివారున ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి చాలామంది టీచర్లు ఏదో ఒక కారణంతో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం సమీపానికి వచ్చేశారు. దీంతో ఈ నియోజకవర్గంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండాపోయారు. ఐదు పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు, ఎనిమిది సబ్జెక్టులకు టీచర్లు లేకుండానే గురువారం పాఠశాలలు రీ ఓపెన్ అయ్యాయి. పొలోమంటూ ఇచ్ఛాపురం నుంచి ఆమదాలవలసకు వచ్చేసిన వారిలో కొంతమంది మళ్లీ ఇచ్ఛాపురానికి రీబ్యాక్ అవ్వాలి. అలాగే ఆమదాలవలస నుంచి పదోన్నతిపై ఇచ్ఛాపురం వెళ్లాల్సినవారు కూడా వెళ్లలేకపోతున్నారు. ఇచ్ఛాపురం జీహెచ్‌ఎస్‌లో తెలుగు స్కూల్ అసిస్టెంట్లు ఐదుగురు ఉండాలి. ప్రస్తుతం ఈ ఐదూ ఖాళీగానే కనిపించాయి. అలాగే ఇంగ్లీష్‌కు ఐదుగురు ఉండాల్సి ఉండగా ఇద్దరే ఉన్నారు. మ్యాథ్స్‌లో ఐదుగురికి గాను ముగ్గురే ఉన్నారు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. స్వయంగా ఉపాధ్యాయ సంఘాల వాట్సప్ గ్రూపుల్లో సంఘ నేతలే ఈ పద్ధతి సరికాదంటూ పెడుతున్న సమాచారం. ఇచ్ఛాపురం పక్కనున్న రత్తకన్నలో తెలుగు బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు ఆమదాలవలస వెళ్లిపోయారు. వీరిలో ఒక జూనియర్ వెనక్కు రావాలి. కానీ అలా జరగలేదు. ఇచ్ఛాపురం మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ నుంచి వెళ్లిపోయిన తెలుగు టీచర్ ఒకరు వెనక్కు రావాలి. అదీ జరగలేదు. పురుషోత్తపురం మున్సిపల్ స్కూల్ నుంచి పక్కనే ఉన్న మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్‌కు ఒక ఉపాధ్యాయుడికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో పదోన్నతిపై వేరే చోటకు వెళ్లాల్సినవారు కదల్లేకపోతున్నారు. కేవలం ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లో ఉన్న పాఠశాలలు, జెడ్పీ పరిధిలో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులకే నిబంధనలు వర్తిస్తాయా? మున్సిపల్ ఉపాధ్యాయులకు వర్తించవా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ప్రధానోపాధ్యాయులకు డీఈవో పంపించిన వాట్సప్ సందేశం ప్రకారం ప్రతి పాఠశాలలోనూ ఒక సబ్జెక్ట్‌ను ప్రాతిపదికగా తీసుకొని వెనక్కు రావాల్సిన ఉపాధ్యాయులను లెక్కించాలి. ఒక సబ్జెక్టులో కనీసం ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉండాలి. ఒక పాఠశాలలో ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లిన పరిస్థితుల్లో వారిలో జూనియరైన సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు వెనక్కు రావాలి (ఆ ఉపాధ్యాయుడు కంపల్సరీ, రీఅపోర్షన్, సర్‌ప్లస్ ఏదైనా కావచ్చు). ఆ మేరకు ఒక జాబితా తయారుచేయాలని ఎంఈవోలను డీఈవో కోరారు. అయితే మున్సిపాలిటీ పరిధిలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పుడు వెనక్కు రావడానికి ససేమిరా అనడంతో పాటు రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో వీరు విజయం సాధిస్తే అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండాపోతారు.
Comments