అందరూ సచ్ఛీలురే.. మరి దోషులెవరు?!
- DV RAMANA

- 1 day ago
- 3 min read
గత టెన్త్ పరీక్షల సీజనులో రాష్ట్రవ్యాప్త సంచలనం
కాపీయింగ్ ఆరోపణలతో 15 మంది మూకుమ్మడి సస్పెన్షన్
అప్పటి డీఈవో తిరుమలచైతన్య నిర్వాకంపై ఆరోపణలు
కానీ తాజాగా ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చేసిన ప్రభుత్వం
అంతకుముందే తొమ్మిదిమందిపై సస్పెన్షన్ ఎత్తివేత
ప్రభుత్వతీరుపై టీచర్ల అసంతప్తి.. సవాల్ చేస్తామని స్పష్టీకరణ

( డి.వి. రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి )
ఏదైనా ఒక తప్పు జరిగితే అందులో రెండువర్గాలు ఉండి.. పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించినప్పుడు.. విచారణ జరిపించి దొరలెవరు? దొంగలెవరు?? అన్నది తేల్చి.. తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఉన్నతాధికారవర్గానిదే. కానీ రెండు వర్గాలనూ నిర్దోషులుగా దాదాపు నిర్థారించేసి ఉత్తర్వులు ఇచ్చేస్తే ఇక దోషులెవరు? బాధితుల పరిస్థితి ఏమిటి?? జరిగిన తప్పునకు దండన ఎవరికి??? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారన్న ప్రశ్నలు వినిపించడం సహజం. ఇప్పుడు జిల్లా ఉపాధ్యాయవర్గాల్లో సరిగ్గా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం చెప్పాలంటే సరిగ్గా ఏడాది వెనక్కి వెళ్లాలి. ఇప్పటిలాగే గత ఏడాది టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయం. జిల్లా విద్యాశాఖ అధికారి(ఎఫఏసీ)గా ఉన్న సదాశివుని తిరుమలచైతన్య మందీమార్బలంతో కుప్పిలి పరీక్షా కేంద్రానికి వెళ్లి మాస్ కాపీయింగ్ జరుగుతున్నందంటూ ఏకంగా 14 మంది టీచర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై వేటు వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది. దీనిపై ఉపాధ్యాయులు రోడ్డెక్కగా అప్పట్లోనే తొమ్మిదిమంది టీచర్లపై సెస్పెన్షన్‌ను ఉపసంహరించారు. మరోవైపు ఈ రచ్చకు కారణమైన తిరుమల చైతన్యపై చర్యల ప్రక్రియను కూడా తాజాగా ప్రభుత్వం అటకెక్కించేసింది. ఆ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని టీచర్లు రగిలిపోతున్నారు. క్లీన్‌చిట్ ఇవ్వడం అన్యాయమని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్నతస్థాయిలో సవాల్ చేస్తామని బాధిత ఉపాధ్యాయులతోపాటు టీచర్ల సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఏడాదిక్రితం ఏం జరిగింది.. అందులో అప్పటి ఇన్‌ఛార్జీ డీఈవో తిరుమల చైతన్య బాధ్యత, ఆయనగారి అతి చేష్టలు ప్రస్తావనార్హం.
సంచలనాలే లక్ష్యం
శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖతో పరిచయం ఉన్నవారందరికీ సదాశివుని తిరుమల చైతన్య పేరు సుపరిచితం. విధి నిర్వహణ కంటే అతి చేష్టలతోనే ఈయనగారు అందరి నోట్లో పడేవారు. నీతి నిజాయితీలే తన ఉచ్చ్వాస నిశ్వాసాలని చెప్పుకునేంత కీర్తికండూతి మెండుగా ఉన్న ఈయన తన చర్యలు సంచలనంగా ఉండాలని, తద్వారా తాను మీడియాలో నిత్యం నానుతూ ప్రచారంలో ఉండాలనుకునే రకం. గత ఏడాది టెన్త్ పరీక్షల సమయంలో చేసిన అలాంటి ఒక ప్రయత్నమే వికటించి ఉపాధ్యాయవర్గాల్లో కలకలం రేపింది. విద్యాశాఖ చరిత్రలో మాయన మచ్చగా మిగిలిపోయింది. వాస్తవానికి తిరుమల చైతన్య జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో ఉపన్యాసకుడిగా పనిచేసేవారు. కానీ పలు సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిప్యూటేషన్‌పై కొంత కాలం పాటు వివిధ రకాల బాధ్యతలు నిర్వహించారు. దాంతో రెగ్యులర్ పోస్టు అయిన ఉపన్యాసకుని విధుల్లో కంటే జిల్లా విద్యాశాఖలో పనిచేస్తే జిల్లా వ్యాప్తంగా అధికారం చెలాయించవచ్చు.. ఆదాయం కూడా బాగా ఉంటుందని స్వానుభవంతో తెలుసుకుని అవకాశం ఉన్న ప్రతిసారీ పైస్థాయిలో ప్రయత్నాలు చేసుకుని విద్యాశాఖలోకి వచ్చేసేవారు. డైట్ సీనియర్ ఉపన్యాసకుడిగా పనిచేస్తూ.. పలు దఫాలు అదే సంస్థకు ప్రిన్సిపాల్(అర్హత లేకపోయినా)గా, శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖాధికారిగా, చివరకు తనకు ప్రీతిపాత్రమైన జిల్లా విద్యాశాఖాధికారి పోస్టును కూడా ఏకకాలంలో నిర్వహించిన ఘనుడీయన. అదే సమయంలో జిల్లా విద్యాశాఖ దురదృష్టమేమో కానీ గత కొన్నేళ్లుగా రెగ్యులర్ జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో)ని నియమించటంలో ప్రభుత్వ ఉదాసీన కూడా ఆయనకు కలిసివచ్చింది. అలా అవకాశాలను అందిపుచ్చుకుని ఆయన తన కీర్తి కుతిని చల్లార్చుకునేవారు.
జరిగింది ఇదీ..
అందులో భాగంగానే గత ఏడాది పదో తరగతి పరీక్షలు జరుగుతున్నప్పుడు డీఈవో(ఎఫఏసీ) ీVAదాలో తిరుమల చైతన్య తన మందీమార్బలాన్ని వెంటేసుకుని టెన్త్ పరీక్షలు జరుగుతున్న ఎచ్చెర్ల మండలం కుప్పిలి, కొయ్యాం జెడ్పీ ఉన్నత పాఠశాలలపై దాడి చేసి పిల్లలకు సమాధానాలు చెరవేస్తున్నారు, సరైన పర్యవేక్షణ లేదనే ఆరోపణలతో 14 మంది టీచర్లను, ఒక జూనియర్ అసిస్టెంట్‌ను తన కలంపోటుతో సస్పెండ్ చేసి, చేయించేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపారు. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్న చందంగా ఈ విషయంలో ప్రభుత్వోద్యోగుల ప్రవర్తనా నియమావళి (ఏపీసీఎస్`కాండక్ట్ రూల్స్, 1964) ని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తడం, ఆ అంశాలతో ‘సత్యం’లో నియమావళిలోని పలు సెక్షన్లను ప్రస్తావిస్తూ వరుస కథనాలు రావడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా జిల్లా విద్యాశాఖ ప్రతిష్ట మసకబారి రాష్ట్రస్థాయిలో పతాక శీర్షికలకెక్కింది. తిరుమల చైతన్య తీరుపై జిల్లా ఉపాధ్యాయ సంఘాలు విరుచుకుపడ్డాయి. టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ తిరుమల చైతన్య అవినీతి భాగోతాలపై ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు పంపాయి. దాంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
క్లీన్‌చిట్ ఇవ్వడంపై అనుమానాలు
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు ఈ మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డిని విచారణాధికారిగా నియమించింది. అలాగే తిరుమల చైతన్య వేటు వేసిన 15 మందిలో తొమ్మిది మంది టీచర్లకు దీంతో సంబంధం లేదంటూ వారిపై సస్పెన్షన్లను ఎత్తివేసింది. మిగిలిన ఆరుగురిపై పెట్టినవి క్రిమినల్ కేసులు కావడంతో అవి మాత్రం పెండింగులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచినా అవి ఇంకా ప్రాథమిక విచారణ దశలోనే ఉన్నాయి. కాగా విచారణాధికారిగా నియమితులైన ఏడీ శ్రీనివాసులురెడ్డి తిరుమల చైతన్య రిటైర్‌మెంటుకు మూడురోజుల ముందు అంటే గత ఏడాది ఆగస్టు 28న శ్రీకాకుళం వచ్చి సమగ్రశిక్ష ఏపీసీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆ విచారణకు హాజరైన బాధిత టీచర్లు, టీచర్ల సంఘాల ప్రతినిధులు హాజరై తిరుమల చైతన్య నిర్వాకాలపై రికార్డెడ్ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. ఆ సందర్భంలోనూ తిరుమల చైతన్యను సస్పెండ్ చేయాలని లేదా అతని రిటైర్‌మెంట్‌కు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలను విచారణ ముగిసి బాధ్యులు తేలేవరకు పెండింగులో పెట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఆ వివరాలతో శ్రీనివాసులురెడ్డి ఉన్నతాధికారులకు అప్పట్లోనే నివేదిక సమర్పించారు. కానీ ప్రభుత్వస్థాయిలో ఏం జరిగిందో గానీ ప్రభుత్వం ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చేసింది. ఆ మేరకు ఆయనపై తదుపరి చర్చలన్నింటిని నిలిపివేయాలని ఆదేశిస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేరుతో జీవో ఆర్టీ నెం.35 జారీ చేసింది. దాంతో ఇప్పటికే రిటైర్ అయిన తిరుమలచైతన్య ఆరోపణల నుంచి కూడా విముక్తి పొందేలా సచ్ఛీలుడని కాలర్ ఎగరేసే పరిస్థితి తీసుకొచ్చింది.
రగిలిపోతున్న ఉపాధ్యాయులు
తనకు అర్హత లేని విద్యాశాఖాధికారి పదవిని పొందడానికి చక్రం తిప్పగలిగిన చైతన్యకు శాఖపరమైన విచారణ పెద్ద సమస్య కాకపోగా.. డీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా విద్యాశాఖకు చెందిన ఫైళ్లను ఇంటికి తెప్పించుకొని పాత తేదీలతో సంతకాలు చేసి, విద్యాశాఖను శాసించిన వైనాలను ‘సత్యం’ వెలుగులోకి తేవడంతో ఆ పద్ధతిని నిలిపివేయించారు. అయితే ఏడీ ఇచ్చిన నివేదికపైగానీ.. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల విషయంలో గానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా నాటి ఘటనలకు కారకులెవరన్నది తేల్చలేదు. తిరుమల చైతన్యపై ఉపాధ్యాయ సంఘాలు చేసిన ఆరోపణలు నిజమా కాదా..? నిజమైతే ప్రభుత్వం తదుపరి చర్యలు ఎందుకు నిలిపివేసింది.? అసలు విచారణ జరపడానికి ముందు, తర్వాత అనధికారికంగా ఏం జరిగింది? ఆరోపణలు నిజం కాకపోతే ఉపాధ్యాయ సంఘాలు తమ ఉనికిని కాపాడుకోవటానికి మాత్రమే అప్పట్లో గళం విప్పాయా..? అటు టీచర్లు, ఇటు తిరుమలచైతన్యలకు క్లీన్‌చిట్ ఇస్తే మరి ఆనాటి ఘటనకు బాధ్యులెవరు? పరీక్షలు రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థులకు వాటిల్లిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యులను తేల్చకుండా, తిరుమల చైతన్య విషయంలో తమ డిమాండ్లను తీర్చకుండా ఆయనకు ఏకపక్షంగా క్లీన్‌చిట్ ఇచ్చేయడాన్ని బాధితవర్గాలు తప్పుపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని కచ్చితంగా ఉన్నతస్థాయిలో సవాల్ చేస్తామని, పోరాటం కొనసాగిస్తామని బాధితులు, టీచర్ల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.






Comments