సమగ్రశిక్ష నుంచి ‘కంత్రీత్రయం’ అవుట్!
- Prasad Satyam
- May 22
- 2 min read
ముగ్గురు ఫీల్డ్ ఇంజనీర్ల సేవలు తక్షణమే నిలిపివేత!
సివిల్ పనుల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం
రికార్డులు దాచిపెట్టి, విచారణకు సహకరించని వైనం
ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో చేపట్టిన సివిల్ పనుల్లో తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఫీల్డ్ ఇంజనీర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. శాఖాపరమైన నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారిక రికార్డులను మాయం చేసిన ముగ్గురు ఇంజనీర్ల సేవలను తక్షణమే నిలిపివేస్తూ (తొలగిస్తూ) సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
తొలగింపునకు గురైన వారిలో ఫీల్డ్ ఇంజనీర్లు ఎన్.పట్టాభి రామారావు, బి.చంద్రమౌళి, పెద్దింటి రామానందం ఉన్నారు. వీరు గతంలో శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు. ఇక్కడ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో చంద్రమౌళిని పార్వతీపురం మన్యం జిల్లాకు, మిగిలిన ఇద్దరినీ అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారు.
నిధుల గోల్‌మాల్.. రికార్డుల మాయం!
సమగ్ర శిక్ష కింద పాఠశాలల్లో చేపట్టిన వివిధ సివిల్ పనుల పర్యవేక్షణలో ఈ ముగ్గురు అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఆర్థిక వ్యత్యాసాలకు పాల్పడటమే కాకుండా, ఉన్నతాధికారుల కళ్ళు కప్పేందుకు ప్రయత్నించారు. పనులకు సంబంధించిన అత్యంత కీలకమైన ఎమ్-బుక్స్, అంచనాలు, బిల్లులు, కొలతల వివరాలు, వోచర్లు, ఫొటోలను ఉద్దేశపూర్వకంగానే ఉన్నతాధికారులకు అప్పగించకుండా దాచిపెట్టారు.
ఉన్నతాధికారుల నుండి అనేక నోటీసులు, రిమైండర్లు అందినప్పటికీ వీరు బేఖాతరు చేశారు. రికార్డులను నిలిపివేయడం వల్ల కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు, వ్యయాల సమీక్ష, ప్రభుత్వ ఆడిటింగ్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, ఇది శాఖకు పెద్ద ఎత్తున ఆర్థిక నష్టాన్ని చేకూర్చిందని తొలగింపు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గుట్టురట్టు చేసిన విచారణ కమిటీ..
ఈ వ్యవహారంపై శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)లతో కూడిన కమిటీ సమగ్ర విచారణ జరిపింది. ఈ కమిటీ సమర్పించిన నాలుగు వేర్వేరు విచారణ నివేదికలలో ఫీల్డ్ ఇంజనీర్ల అవినీతి బాగోతం, విధి నిర్వహణలో ఘోర నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా ఆధారాలతో సహా నిరూపితమైంది.
వీరి అవినీతి భాగోతాన్ని ‘సమగ్రశిక్షలో కంత్రీత్రయం’ పేరుతో ‘సత్యం’ ఈ నెల 11న ఓ కథనాన్ని ప్రచురించింది. రామానంద్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అప్పటి మంత్రుల పేషీలతో అంటకాగుతూ ఏపీసీలను గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాలు చేసేవారు. ఆయన గతంలో కూడా సర్పంచ్‌గా పనిచేసి వచ్చారు. దీంతో ఈయన పలుకుబడి మాయలో పడి మిగిలిన సైట్ ఇంజినీర్లు ఆయన భక్తులుగా మారిపోయారు. అప్పట్నుంచి రామానంద్ చెప్పినట్టల్లా ఆడటం ప్రారంభించారు. దాని పర్యవసానమే ఏడుగురు సైట్ ఇంజినీర్లను శ్రీకాకుళం నుంచి పక్క జిల్లాలకు బదిలీ చేశారు. కంత్రీ త్రయంపై విచారణ ముగిసిన తర్వాత ఆయన శిష్యులే ఇద్దరు బలైపోవడం గమనార్హం.






Comments