top of page

రూ.50 వేలు ఇస్తేనే TC ఇస్తామంటున్నారు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 hours ago
  • 1 min read
కలెక్టర్‌కు పదో తరగతి విద్యార్థి ఫిర్యాదు

(సత్యం న్యూస్, శ్రీకాకుళం)

టీసీ కావాలంటే రూ.50వేలు చెల్లించాల్సిందేనని ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వేధిస్తోందంటూ ఓ పదో తరగతి విద్యార్థి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామానికి చెందిన విద్యార్థి దశముఖ పవన్ కుమార్, తన తండ్రి రమేష్‌తో కలిసి సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా గ్రీవెన్స’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశాడు.

ఉపాధ్యాయులు లేక పాఠశాల మూసివేత

అరసవల్లి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న ప్రశాంతి స్కూల్‌లో పవన్ కుమార్ చదువుకునేవాడు. అయితే ఉపాధ్యాయులు లేకపోవడంతో యాజమాన్యం ఆ పాఠశాలను మూసివేసింది. దీంతో విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండేందుకు పవన్ కుమార్ సానివాడలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో చేరాడు. పదో తరగతి ప్రవేశం కోసం ప్రశాంతి స్కూల్ నుంచి టీసీ తీసుకోవడానికి దరఖాస్తు చేయగా, యాజమాన్యం రూ.50వేలు చెల్లించాలని డిమాండ్ చేసిందని విద్యార్థి తండ్రి రమేష్ తెలిపారు.

యాజమాన్యానికే ఎంఈఓ వత్తాసు

ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పాఠశాల యాజమాన్యానికే వత్తాసు పలికారని బాధితుడు ఆరోపించారు. యాజమాన్యం డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఎంఈఓ తమకు సూచించినట్లు వివరించారు. తాను టైలరింగ్ వృత్తి చేసుకుంటూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నానని, అంత పెద్ద మొత్తం చెల్లించే స్థోమత లేదని వేడుకున్నా పాఠశాల యాజమాన్యం టీసీ ఇవ్వడానికి నిరాకరించిందని వాపోయారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించి, ప్రశాంతి స్కూల్ యాజమాన్యం నుంచి టీసీ ఇప్పించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను విద్యార్థి పవన్ కుమార్ కోరారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page