‘మిషన్ మార్చ్’.. ఒత్తిడి అదనం
- Prasad Satyam
- 4 hours ago
- 2 min read
టెన్త్ క్లాస్ స్టడీ అవర్ల ముందస్తు షురూ
పదోతరగతి అదనపు క్లాసులపై క్షేత్రస్థాయి ఆందోళనలు
గ్రామీణ ప్రాంతాల్లో ‘చీకటి’ భయాలు.. హాజరు శాతంపై ప్రభావం
విద్యార్థులపై ఒత్తిడి పెంపా? ఫలితాల వేటలా?
స్థానిక అవసరాలను విస్మరించిన విద్యాశాఖ ప్రణాళిక
నైపుణ్యాల సాధన వదిలేసి మార్కుల వేట సరికాదంటున్న నిపుణులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
“పదో తరగతి ఫలితాలే పరమావధిగా విద్యాశాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా, నవంబర్ తర్వాత ప్రారంభమవ్వాల్సిన టెన్త్ క్లాస్ ప్రత్యేక తరగతులను (స్టడీ అవర్లను) జులై నెల నుంచే ఉరుకులు పరుగులుగా ప్రారంభించేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ‘మిషన్ మార్చ’ పేరుతో రోజుకు ఒక గంట అదనంగా పాఠాలు చెప్తుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, మార్కుల వేటలో విద్యాశాఖ తీసుకున్న ఈ ముందస్తు నిర్ణయం క్షేత్రస్థాయిలో అటు ఉపాధ్యాయులను, ఇటు గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులనూ, విద్యార్థులనూ తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.”
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతీ ఏడాది నవంబరు తర్వాత నిర్వహించే అదనపు స్టడీ అవర్లను ప్రభుత్వం ఈ ఏడాది ఈ నెల 14 నుంచే ప్రారంభించేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు పాఠశాల విద్యాశాఖ చరిత్రలో మొదటిసారి ఇంత ముందుగా అదనపు తరగతులు నిర్వహించడం ఇప్ప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, భవిష్యత్తులో ఈ ప్రత్యేక తరగతుల సమయం మరింత పెరుగుతుందని పాఠశాల విద్యాశాఖ చెప్పకనే చెప్పింది. దీంతో అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఇన్ని పని ఒత్తిడిల మధ్య అదనపు తరగతులు ఇప్పటి నుంచే నిర్వహించలేమని చెబితే, ఉపాధ్యాయులపై ఇప్పటికే సమాజంలో ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడిపోయినందున వీరు నోరు విప్పడంలేదు. నాలుగు గంటలకు ముగియాల్సిన క్లాసులు మరో గంట పొడిగించడం వల్ల తమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పేరెంట్స్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మార్చిలో జరిగే పదో తరగతి బూచి చూపిస్తారు. పట్టణ ప్రాంతాల వరకు అదనంగా ఒక గంట పాఠాలు చెప్పడం వల్ల పెద్దగా పేరెంట్స్‌కు కలిగే ఇబ్బంది ఏమీ లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పాఠశాలలను విద్యార్థుల సంఖ్యను బట్టి రేషనలైజ్ చేసిన తర్వాత కొన్ని గ్రామాల్లో పదో తరగతి చదవాలంటే పొలం గట్ల వెంబడి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రాబోయేది వర్షాకాలం, ఆ తర్వాత శీతాకాలం వస్తుండటంతో చీకటి పడిన తర్వాత పొలం గట్లు పట్టుకొని ఇంటికి చేరడం కాస్త కష్టమైన పనే. అసలు కొన్ని పాఠశాలలకు విద్యార్థులే రెగ్యులర్ పాఠాలు వినడానికి రావడంలేదు. అటువంటి చోట అదనపు తరగతులంటే మరింత కష్టం. ప్రస్తుతం వర్షాభావం వల్ల పంటలు లేవుగాని, లేదంటే ఈ సమయానికి దుక్కులు మొదలవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల రోజుల్లో పాఠశాలలో హాజరు శాతం ప్రతీ ఏడాది తక్కువగా ఉండటానికి కారణం ఇదే. ప్రస్తుతం మిషన్ మార్చ్ ఎసఎస్‌సీ`2027 పేరుతో ఒక గంట అదనంగా నడుస్తున్న స్టడీ అవర్‌లో అరగంట పాటు చదవడం, మిగిలిన అర్థగంట దాని మీద పరీక్షలు నిర్వహించడానికి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతీరోజు పదో తరగతి పిల్లలను అర్ధగంట చదివించడం మాట దేవుడెరుగు. మిగిలిన అర్థగంటలో రాసిన పరీక్షా పత్రాలు దిద్దడానికే టీచర్లకు సమయం సరిపోతుంది. అసలు ఈ పరీక్షలో ఏ ప్రశ్నలు ఉండాలనేది విద్యాశాఖ కమిషనరేటే పేపర్లు సెట్ చేస్తుంది. ఏ విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు? ఆ మేరకు ఎలా పికప్ చేయాలి? అనేది స్థానిక ఉపాధ్యాయులకు వదిలేయకుండా ఏ రోజు ఏ పాఠం చెప్పాలి? ఏ సిలబస్ వల్లెవేయించాలి? వంటివి పాఠశాల విద్యాశాఖే నిర్ణయించేసింది. తెలుగులో టాప్‌లో ఉన్న విద్యార్థి హిందీలో వీక్‌గా ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్‌ట్రా అవర్‌లో ఆ విద్యార్థిని హిందీపై సిద్ధం చేయాలి. అలా కాకుండా అందరితో పాటు అన్ని సబ్జెక్టుల్లో కూర్చోబెడితే ఒరిగే ప్రయోజనం ఉండదు. పాఠశాల విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే, స్థానిక డీఈవో కార్యాలయాలు రాష్ట్రంలో తమ జిల్లా ముందుండాలన్న ఆత్రంతో దీనికి అదనంగా మరికొన్ని చేరుస్తున్నాయి. ఇప్పటికే టీచర్లకు పాఠాలు చెప్పనివ్వడంలేదని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రస్తుతం సాయంత్రం 4 నుంచి 5 వరకు సాగుతున్న అదనపు తరగతులు భవిష్యత్తులో ఉదయం 8 నుంచి 9 వరకు కూడా అమలు చేస్తారని తెలుస్తుంది. ఇవన్నీ కేవలం ఉత్తమ ఫలితాలకేనా? అన్న ప్రశ్న వస్తే.. మార్కులు మాత్రమే విద్యార్థి సబ్జెక్టును పట్టి చూపుతాయా? అన్న ప్రశ్న కూడా తలెత్తక మానదు. 600కు 600 మార్కులే రావాలంటే కుదిరే పని కాదు. ఇప్ప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత పుస్తకాలతో పని లేకుండా పోయింది. ఏది కావాలన్నా చిటికెలో డేటా అందుబాటులోకి వచ్చేస్తుంది. అటువంటప్ప్పుడు విద్యార్థిలో ప్రోది చేయాల్సింది నైపుణ్యమా? లేదూ బట్టీ పట్టిన సబ్జెక్టా? అనేది ఇప్పటికీ ప్రభుత్వాలు తేల్చుకోలేకపోవడం శోచనీయం.
` ఫొటో






Comments