top of page

ప్రభుత్వంలో రూ.3వేలు.. ప్రైవేట్‌లో రూ.25వేలు ఇదీ స్కూల్ ఫీజుల సగటు

  • Guest Writer
  • May 29
  • 2 min read
  • మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం

  • ఫీజులు పెంచేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు

  • ప్రైవేట్ విద్య ఖర్చు ప్రభుత్వ పాఠశాలల కంటే తొమ్మిది రెట్లు అధికమని చెబుతున్న సర్వేలు

  • అధిక ఫీజులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటున్న 93 శాతం మంది తల్లిదండ్రులు

‘NSS సమగ్ర మాడ్యులర్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్-2025’ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై అయ్యే సగటు వార్షిక ఖర్చు రూ.2,863 కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది రూ.25,002కు చేరింది. అంటే ప్రైవేట్ విద్య ఖర్చు ప్రభుత్వ పాఠశాలల కంటే దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా ఉందని సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఒక్కో విద్యార్థిపై కేవలం కోర్సు ఫీజులకే సంవత్సరానికి సగటున రూ.15,143 ఖర్చవుతుండగా, పుస్తకాలు, స్టేషనరీ కోసం మరో రూ.2,002 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. వీటికి తోడు బస్సు ఫీజులు, ప్రత్యేక తరగతులు, డిజిటల్ ఫీజులు, యాక్టివిటీ ఛార్జీలు పేరుతో మరింత భారం మోపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం దేశవ్యాప్తంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి ఏడాది పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు, రవాణా, ఇతర అదనపు ఛార్జీలతో తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. విద్య పిల్లల భవిష్యత్తుకు అవసరమనే భావనను ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారంగా మలుస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి.

లోకల్ సర్కిల్స్ నిర్వహించిన జాతీయ సర్వేలో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో 81 శాతం మంది ఒకే ఏడాదిలో 10 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంపును ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. 2022 నుంచి 2025 మధ్య 44 శాతం కుటుంబాలు 50 నుంచి 80 శాతం వరకు ఫీజులు పెరిగినట్లు పేర్కొన్నాయి. అధిక ఫీజులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని 93 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకున్న ఘటన ఈ సమస్య తీవ్రతను మరోసారి బయటపెట్టింది. పాఠశాల వసూలు చేస్తున్న అదనపు ఫీజుపై ప్రశ్నించిన ఒక తల్లిని ప్రిన్సిపాల్ అవమానిస్తూ, బెదిరించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఫీజులపై ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యాహక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. అలాగే అనేక ప్రైవేట్ పాఠశాలలు నిర్దిష్ట దుకాణాల నుంచే పుస్తకాలు, యూనిఫారాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు సామగ్రి కొనాల్సి రావడంతో కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఫీజుల నియంత్రణపై వివాదం కోర్టుల వరకు వెళ్లింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజులు పెంచేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచింది. మరోవైపు ఫీజుల నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని 800కు పైగా ప్రైవేట్ పాఠశాలలు సవాలు చేయడం గమనార్హం. ప్రస్తుతం ‘పిల్లల చదువు కోసం ఎంతైనా భరిద్దాం’ అనే పరిస్థితిని ప్రైవేట్ విద్యాసంస్థలు అవకాశంగా మలుచుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఫీజుల భారం కారణంగా అనేక కుటుంబాలు అప్పులు చేయడం, ఆభరణాలు అమ్ముకోవడం, లేదా పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్చే పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.

- యస్వీర్ సింగ్, ది హిందూ కోసం..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page