ఆలోచన సూపర్.. ఆచరణలో ఫెయిల్!
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 2 min read
టెన్త్ తప్పినవారికి ప్రత్యేక తరగతులకు ఆదేశాలు
సబ్జెక్ట్ టీచర్లందరూ తప్పనిసరిగా ఉండాలని స్పష్టీకరణ
కానీ మెజారిటీ స్కూళ్లలో ఒకరిద్దరికి మించి లేని విద్యార్థులు
కొన్ని స్కూళ్లను కలిపి పెడితే బాగుండేదన్న అభిప్రాయాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పదో తరగతిలో ఫెయిల్ అయిన వారిని సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించాలన్న ప్రభుత్వ సంకల్ప మంచిదే.. ఆహ్వానించదగ్గదే. కానీ దాన్ని ఆచరణలో పెట్టిన తీరు ఆ సంకల్పాన్ని నీరుగార్చేలా ఉంది. టీచర్లను అనవసరం కష్టపెట్టేలా ఉంది. కారణం.. మంచి ఉత్తీర్ణత సాధించిన.. సాధించని పాఠశాలలను ఒకేగాట కట్టేసి విద్యార్థులు ఉన్నా లేకపోయినా సబ్జెక్టు టీచర్లందరూ నిర్ణీత సమయాల్లో పాఠశాలలో ఉండాల్సిందేనని హుకుం జారీచేయడమే. ఫలితంగా వేసవి సెలవుల్లో చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేకపోయినా టీచర్లు మాత్రం పడిగాపులు పడాల్సి వస్తున్నది. అయితే దీనికి సంబంధించి మౌఖిక ఆదేశాలు తప్ప ఎటువంటి లిఖితపూర్వకం ఉత్తర్వులు జారీకాకపోవడం కూడా ప్రభుత్వ నిర్ణయం విమర్శల పాలవుతున్నది. ఈ ఏడాది పది పరీక్షలు తప్పిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేసే క్రమంలో వారికి ఈ నెల నాలుగో తేదీ నుంచి 20 రోజుల పాటు ఆయా పాఠశాలల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఆ మేరకు సబ్జెక్టు టీచర్లు తాము పని చేస్తున్న పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాలని ఆదేశించింది. ఆ మేరకు టైం టేబుల్‌ను రూపొందించి రాష్ట్రంలోని అని హైస్కూళ్లకు పంపించారు. దాని ప్రకారం ఉదయం 7.45 నుంచి 8.30 వరకు ఒక సబ్జెక్ట్ బోధించి 8.30 నుంచి 9 వరకు స్లిప్ టెస్ట్ పెట్టాలి. రెండో సెషన్‌లో ఉదయం 9.10 నుంచి 9.55 వరకు మరో సబ్జెక్ట్ బోధించి 9.55 నుంచి 10.25 వరకు స్లిప్ టెస్ట్ నిర్వహించాలి. మÖడో సెషన్‌లో 10.35 నుంచి 11.20 వరకు ఇంకో సబ్జెక్‌ను బోధించి 11.20 నుంచి 11.50 వరకు స్లిప్ టెస్ట్ జరపాలి. ఇలా ఈ నెల 23 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి.. 25 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాల్సి ఉంటుంది.
విద్యార్థులు లేకున్నా..
ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు విషయం ఏమిటంటే.. మెజారిటీ ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ తప్పిన విద్యార్ధులు ఒకరిద్దరికి మంచి లేరు. కానీ వారికి పాఠాలు చెప్పడానికి సబ్జెక్టు టీచర్లందరూ విధిగా పాఠశాలకు వెళ్లాల్సిందే. విద్యార్ధులు ఉన్నా లేకపోయినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీచర్లు హాజరు కావాల్సిందేనని డీఈవో, డిప్యూటీ డీఈవోలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 90.6 శాతం మంది పాస్ అయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 28,523 మంది పరీక్షలు రాయగా వీరిలో 25,841 మంది పాస్ అయ్యారు. ఫెయిలైన వారి సంఖ్య 2682. సబ్జెక్టుల వారీగా చూస్తే.. తెలుగులో 930 మంది, హిందీలో 105, ఇంగ్లీష్‌లో 329, గణితంలో 1068, సైన్స్‌లో 1293, సోషల్‌లో 1317 మంది ఫెయిలయ్యారు. వీరిలో ఒకటి, రెండు సబ్జెక్టులు తప్పినవారితో పాటు మÖడు నుంచి ఆరు సబ్జెక్ట్స్ ఫెయిలైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఎక్కడికక్కడ బోధించాలనడమే సరైన నిర్ణయంగా కనిపించడంలేదు. అలాకాకుండా కొన్ని పాఠశాలలను కలిపి ఒక కేంద్రం ఏర్పాటు చేసి, అక్కడికి అవసరమైన టీచర్లను కేటాయించి ఉంటే బాగుండేది.
ఎర్న్‌డ్ లీవ్‌గా పరిగణించాలి
కాగా సాధారణంగా వేసవి కాలంలో పాఠశాలలు పనిచేయవు. ఈ సమయంలో ఏదైనా కారణంతో టీచర్లతో పని చేయించాల్సి వస్తే ఆ వెకేషన్(సెలవు) పీరియడ్‌ను ఎర్న్‌డ్ లీవ్‌గా పరిగణించి ప్రభుత్వం అదనపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చెప్పాలని జీవో జారీ చేయకుండా మౌఖికంగా ఆదేశించడం వల్ల సెలవు కాలంలో చేసే ఈ పనిని ప్రభుత్వం ఎర్న్‌డ్ లీవ్‌గా పరిగణించదేమోనని టీచర్ల సంఘాలు అనుమానిస్తున్నాయి. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సబ్జెక్ట్ టీ¡చర్లకు ఎర్న్‌డ్ లీవ్ వర్తింపజేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఉత్తర్వులు లేకుండానే జిల్లా విద్యాశాఖ అధికారులు టీచర్లను బెదిరించి, ఒత్తిడి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న తమపై తిరిగి ఒత్తిడి ప్రారంభమైందని టీచర్లు విమర్శిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్ధుల సంఖ్య పెంచాలని టార్గెట్ పెట్టడాన్ని తప్ప్పుపడుతున్నారు.





Comments