top of page

పాఠ్యభారం తగ్గితేనే నిజమైన అభ్యాసం

  • Guest Writer
  • 6 hours ago
  • 2 min read

కంఠస్థ విద్యకు బదులు ఆలోచనాత్మక విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం

భారతీయ పాఠశాల విద్య ఇప్పటికీ ‘సమాచార భారంతో నిండిన బోధన’ అనే పాత విధానంలోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ మానవ జ్ఞానం విస్తరిస్తుండటంతో, ఆ సమాచారాన్ని మొత్తం విద్యార్థులకు బోధించాలనే ఒత్తిడి పాఠ్య ప్రణాళికలపై పెరుగుతోంది. అయితే పాఠశాల విద్యకు పరిమిత కాలమే ఉండటంతో, పిల్లలపై అధిక పాఠ్యభారం మోపబడుతోంది.

ప్రస్తుతం ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఒకే రోజులో అనేక సబ్జెక్టుల్లో గాఢమైన సిద్ధాంత అంశాలను నేర్చుకోవాల్సి వస్తోంది. గతంలో డిగ్రీ స్థాయిలో బోధించిన విషయాలు కూడా ఇప్పుడు పాఠశాలల్లో చేరుతున్నాయి. దీంతో పిల్లలు విషయాలను అర్థం చేసుకునే అవకాశానికి బదులు, కంఠస్థం చేయడానికే పరిమితమవుతున్నారు.

అవగాహనకు బదులు కంఠస్థ విద్య

విషయ పరిమాణం పెరగడం వల్ల విద్యార్థులకు లోతైన అభ్యాసం కోసం సమయం దొరకడం లేదు. ఫలితంగా విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక దృష్టి వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందకుండా, ‘గుర్తుపెట్టుకొని పరీక్షల్లో రాయడం’ అనే విధానమే ప్రధానంగా మారుతోంది.

పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధిక పాఠ్యభారం విద్యార్థులను ఉపరితల అభ్యాసానికి నెట్టివేస్తుందని, దీనివల్ల నిజమైన అవగాహన తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది విద్యార్థుల లేదా ఉపాధ్యాయుల వైఫల్యం కాదు, వ్యవస్థాత్మక సమస్య.

NEP-2020 లక్ష్యం ఇదే

ఈ సమస్యను జాతీయ విద్యా విధానం (NEP-2020) స్పష్టంగా గుర్తించింది. కేవలం కంటెంట్ బోధనకే పరిమితమవకుండా, సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించింది. పిల్లలు ఎలా నేర్చుకుంటారో దానికి అనుగుణంగా పాఠ్య నిర్మాణం ఉండాలని ప్రతిపాదించింది. దీనిని అమలు చేసే దిశగా రూపొందించిన జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం (ఎన్‌సీఎఫ్-2023) కూడా కంటెంట్ భారాన్ని తగ్గించి, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, స్వయంగా నేర్చుకునే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. పరీక్షా విధానాన్ని కూడా కంఠస్థ విద్యకు బదులు సామర్థ్యాలను అంచనా వేసేలా మార్చాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.

అమలులోనే అసలు సవాలు

అయితే సంస్కరణలు కాగితాలపైనే కాకుండా తరగతి గదుల్లో కనిపించాలంటే అమలులో సమగ్ర మార్పులు అవసరం. పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, పరీక్షా విధానం అన్నీ ఒకే దిశగా మారాలి. ముఖ్యంగా, సిలబస్ ఆధారిత బోధనకు అలవాటుపడిన ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, మద్దతు అవసరం.

అలాగే మార్కులు, కంఠస్థ విద్య ఆధారంగా పెరిగిన తల్లిదండ్రులను కూడా ఈ మార్పులో భాగస్వాములను చేయాలి. ‘ఇది కూడా పిల్లలకు నేర్పాలి’ అనే సహజ భావన వల్లే పాఠ్యభారం పెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రతి అంశాన్ని చేర్చాలనే ప్రయత్నం చివరకు పిల్లలపై అధిక ఒత్తిడిగా మారుతోంది.

తక్కువ కంటెంట్... ఎక్కువ అభ్యాసం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ విషయాన్ని లోతుగా బోధించడం వల్లే నిజమైన అభ్యాసం సాధ్యమవుతుంది. సరైన అవగాహన లేకుండా ఎక్కువ సమాచారాన్ని బోధించడం కన్నా, కొద్దిపాటి విషయాన్ని విశ్లేషణాత్మకంగా నేర్పడం విద్యార్థులకు ఉపయోగకరం. పాఠశాల విద్య లక్ష్యం పిల్లల మెదళ్లలో ఎంత ఎక్కువ సమాచారం నింపడమో కాదు.. నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం కావాలి. జాగ్రత్తగా చదవడం, సాక్ష్యాలతో ఆలోచించడం, మంచి ప్రశ్నలు అడగడం, కొత్త విషయాలపై ఆసక్తిని కొనసాగించడం వంటి నైపుణ్యాలను పెంపొందించడమే అసలు విద్య.

ముందున్న బాధ్యత

ఎనఈపీ-2020, ఎన్‌సీఎఫ్-2023లు ఈ దిశలో స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఆ సూత్రాలను తరగతి గదుల్లో అమలు చేయడం, పాఠ్యపుస్తకాలు, పరీక్షా విధానాల్లో ప్రతిబింబింపజేయడం కీలకం. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును నిజంగా మార్చగలిగేది ఇదే.

- నౌపడ సత్యనారాయణ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page