అది కాదు సర్దుబాటు.. తెలుగుకు వెన్నుపోటు!
- DV RAMANA

- 6 days ago
- 2 min read
UP పాఠశాలల్లో తెలుగు టీచర్ పోస్టులు రద్దు
తద్వారా భాషోపాధ్యాయులను మిగులు సిబ్బందిగా చూపిన వైనం
వారి సర్దుబాటు పేరుతో ఇతర సబ్జెక్టు టీచర్లుగా నియామకం
విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న విద్యాశాఖ
ఈ నిర్వాకాలతో పాఠశాలల్లో తెలుగు బోధనకు గండం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
పరభాష తెలియని వ్యక్తిని ఆ భాషలోనే మాట్లాడమని ఒత్తిడి చేస్తే ఆ వ్యక్తి చేతకాక బిక్కచచ్చిపోతాడు. అదేరీతిలో ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి, ఏళ్ల తరబడి అదే సబ్జెక్టు బోధనలో కాకలుతీరిన టీచర్లను ఉన్నఫళంగా వేరే సబ్జెక్టు బోధించమంటే వారేం చెప్పగలరు!.. విద్యార్థులు ఏం నేర్చుకోగలరు!!
దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలు అదే దురవస్థను ఎదుర్కొంటున్నాయి. విద్యాశాఖ నిర్వాకమే దీనికి కారణమని ఆరోపిస్తూ ఉపాధ్యాయవర్గాలు ఆందోళనబాట పట్టాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో వేల సంఖ్యలో టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో భర్తీ చేసి బోధన వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు మెగా డీఎస్సీ అంటూ ఆర్భాటం చేస్తూనే మరోవైపు విద్యాశాఖలో వేలాది మిగులు పోస్టులు ఉన్నట్లు చూపిస్తూ.. ఉన్న టీచర్లను ఖాళీల్లో అడ్డదిడ్డంగా, విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా సర్దుబాటు చేసేసి.. ఖాళీ పోస్టుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భాషోపాధ్యాయుల(లాంగ్వేజ్ పండిట్)ను ఇతర సబ్జెక్టులకు టీచర్లుగా సర్దుబాటు చేసేసి మీ పాట్లు మీరు పడండి అన్నట్లు చోద్యం చూస్తున్నది. ఫలితంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాలల్లో బోధన గాడి తప్పే ప్రమాదం ఏర్పడిందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
అడ్డగోలు సర్దుబాట్లు
అసలు ఈ పరిస్థితికి మÖలం ఎక్కడుంది. సమస్య ఎందుకు వచ్చిందని ఆరా తీస్తే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయమే కారణమని తేటతెల్లమైంది. ప్రాథమికోన్నత(యÖపీ) పాఠశాýల్లో తెలుగు టీచర్ పోస్టులను గత విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వం రద్దు చేసేసేంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7129 సర్‌ప్లస్(మిగులు) పోస్టులు ఉన్నట్లు చూపించారు. అదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో 168 భాషోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్లు) పోస్టులను మిగులుగా చూపించారు. విడ్డూరమేమిటంటే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు యథాప్రకారం తెలుగు పాఠపుస్తకాలు సరఫరా చేసిన ప్రభుత్వం.. ఆ భాష బోధించే టీచర్లను మాత్రం లేపేసింది. ఫలితంగా తెలుగు సబ్జెక్టు బోధించేవారు కరువయ్యారు. ఈ పోస్టుల్లో ఏళ్లతరబడి పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టీచర్లను మిగతా చోట్ల సర్దుబాటు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. కానీ వారిని భర్తీ చేయడానికి తగినన్ని పోస్టులు రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో లేవు. ఇక్కడే అడ్డగోలు నిర్ణయాలకు తెర తీశారు. భాషా పండిట్లుగా రెండు మÖడు దశాబ్దాల సర్వీసు ఉన్న టీచర్లను సైతం హైస్కూళ్లలో సర్దుబాటు చేసి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ బోధించమని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా మిగిలిపోయినవారిని హైస్కూళ్లకు అనుబంధంగా ఏర్పాటు చేసిన క్లస్టర్లకు అటాచ్ చేసేసి చేతులు దులుపుకొంటున్నారు. విద్యాహక్కు చట్టానికి ఇది పూర్తి విరుద్ధం. తగిన అకడమిక్ అర్హతలు, అనుభవం ఉన్నవారినే ఆయా సబ్జెక్టులకు టీచర్లు నియమించాలని విద్యాహక్కు చట్టం స్పష్టంగా నిర్దేశిస్తున్నది. కానీ సర్దుబాటు పేరుతో భాషోపాధ్యాయులను హైస్కళ్లలో కుక్కేసి తెలియని సబ్జెక్టులు బోధించమనడం, దానికి బీఈడీలో మెథడాలజీ చేసిన అంశాన్ని సాకుగా చూపుతుండటాన్ని ఉపాధ్యాయవర్గాలు తప్పుపడుతున్నాయి. ఎప్పుడో చదువుకున్న బీఈడీలో మెథడాలజీ ఉన్నంతమాత్రాన ఇప్పుడు సోషల్ లాంటి సబ్జెక్టులు బోధించమనడం నిర్హేతుకమని విమర్శిస్తున్నారు. ఏళ్లతరబడి భోషా బోధనలోనే నిమగ్నమైన తాము విస్తారమైన సోషల్ సబ్జెక్టును ఎలా బోధించగలమని ప్రశ్నిస్తున్నారు.
క్లస్టర్ల పేరుతో ఇష్టారాజ్యం
భాషా పండిట్‌లను నిబంధనలకు విరుద్ధంగా ఇతర సబ్జెక్టులు బోధించమని ఒత్తిడి చేస్తున్న అధికారులు.. ఆ విషయంలో టీచర్ల విల్లింగ్‌ను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉన్న టీచర్ల విద్యార్హతల్లో మెథడాలజీ ఉంటే చాలు.. వీరిని ఏకపక్షంగా తీసుకెళ్లి హైస్కూళ్లలో పడేస్తున్నారు. తెలియని సబ్జెక్టు బోధించమంటున్నారు. ఈ విధంగా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు 15 మండలాý హైస్కూళ్లకు భాషోపాధ్యాయులను సాంఘిక శాస్త్ర టీచర్లుగా నియమించినట్లు తెలిసింది. ఇక సర్దుబాటు కోసమే ఏర్పాటు చేసిన క్లస్టర్ల స్థాయిలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. క్లస్టర్ల పర్యవేక్షకులు భాషోపాధ్యాయులను సర్దుబాటు చేసి వారి సేవలు వినియోగించుకునే విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పరిధిలోని అన్ని రకాల పాఠశాలల్లో సెలవులు, తదితర కారణాల వల్ల ఏర్పాటే టీచర్ల లోటును భర్తీ చేయడం ఈ క్లస్టర్ల బాధ్యత. దీన్ని ఆసరా చేసుకున్న క్లస్టర్ బాధ్యులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో నియమించరాదు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే వారి సేవలను వినియోగించుకోవాలి. కానీ క్లస్టర్ నిర్వాహకులు మిగులు టీచర్లుగా ఉన్న భాషోపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలకు కూడా పంపుతున్నారు. అది కూడా ముందుగానే చెప్పకుండా.. పాఠశాల సమయాలు ప్రారంభమైన తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో చెబుతుండటంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. మిగిలిన భాషలైన హిందీ, ఇంగ్లిషు టీచర్లు నిక్షేపంగా పనిచేసుకుంటుంటే.. తెలుగు రాష్ట్రంలో, తెలుగును ఉద్ధరిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ పాలనలో తెలుగు భాష బోధించే ఉపాధ్యాయులకు ఇంతటి దురవస్థ పట్టించడం విమర్శల పాలవుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏకంగా తెలుగు టీచర్ పోస్టులనే తీసివేయడం, తెలుగు భాషోపాధ్యాయులను ఇతర సబ్జెక్టుల బోధనకు మళ్లించడం వల్ల పాఠశాలల్లో తెలుగుకు తెగులు పట్టే ప్రమాదం ఉందని ఉపాధ్యాయలోకం ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.






Comments