top of page

అక్కడ చదువులు చాలా కాస్ట్లీ గురూ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 hours ago
  • 3 min read
  • అమెరికా కంటే ఇండియా బెటర్ అంటున్నNRI మహిళ

  • ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు విపరీత స్పందన

  • రెండేళ్ల పిల్లాడి ఏడాది చదువు ఖర్చుతో కారు కొనొచ్చట!

  • అక్కడ రోజులు, వయసు లెక్కన ఫీజులు కక్కాల్సిందే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

దూరపు కొండలు నునుపు.. అన్న నానుడి అందరికీ తెలిసిందే. దూరం నుంచి చూస్తే ఏదైనా అందంగానే కనిపిస్తుంది.. దగ్గరికి వెళ్తే తప్ప దాని అసలు సారం తెలియదు.. అన్న భావంతో ఈ నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. విదేశాల విషయంలో భారతీయుల భావనలు కూడా దాదాపు ఇలానే ఉంటున్నాయి. మన దేశం కంటే ఇతర దేశాల్లో సకల సౌకర్యాలు, ఆడంబరాలు అందుబాటులో ఉంటాయని, ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.. జీతాలు కూడా భారత్‌తో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటాయన్న నిశ్చితాభిప్రాయం మెజారిటీ ఇండియన్స్‌లో ఉండటం వాస్తవం. అందుకే తమ పిల్లలు వీలైతే తాము కూడా ఇతర దేశాలకు వెళ్లి ఇబ్బడిముబ్బడిగా సంపాదించి జీవితాన్ని దర్జాగా గడపాలని కోరుకుంటుంటారు. స్వదేశంలో సౌకర్యాలతో విదేశాల్లో పరిస్థితిని పోల్చి చూస్తూ ఎంత వేగం దేశం విడిచి పోదామా అన్న ఆతృత కనబరుస్తుంటారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లినవారిని చూసి కాస్తంత అసూయ పడుతుంటారు. ముఖ్యంగా అమెరికాకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడిన వారిని చూసి తమకూ ఆ భాగ్యం కలగాలని కోరుకుంటుంటారు. అయితే ఇలాంటి అభిప్రాయాల్లో వాస్తవాలు లేవని భారత్‌లో జీతాలు, వసతులు స్వల్పమన్న ప్రచారం ముసుగులో అమెరికా వ్యవస్థల్లోని, సమాజంలోని లోపాలు బయటపడటంలేదని కొన్ని ఉదంతాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. అమెరికా చూడటానికి ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో.. రోజువారీ జీవన వ్యయం అంత ఎక్కువ భారంగా ఉంటుందని అక్కడి నివసిస్తున్నవారే చెబుతున్న వాస్తవం. ముఖ్యంగా పిల్లల పెంపకం, వారి చదువుల ఖర్చులు అమెరికన్ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తాయట! ఈ విషయంలో అమెరికా కంటే భారత్ ఎంతో నయమని కొన్నేళ్లుగా అక్కడ నివసిస్తున్న ఒక భారతీయ మహిళ సోషల్ మీడియా సాక్షిగా కుండబద్దలు కొట్టింది. పిల్లల చదువులకు సంబంధించి భారత, అమెరికా ఫీజుల ను వివరిస్తూ అమెరికాలో చదువు ఎంత ఖరీదైనదో వివరించిన తీరు నెట్టింట విస్తృత చర్చకు తావిచ్చింది.

కాసులు కుమ్మరించాల్సిందే

మనదేశంలో విద్యావ్యవస్థ ప్రైవేట్‌రంగం చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఫలితంగా విద్య అత్యంత ఖరీదైన వస్తువుగా మారిపోయిందని తరచూ ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఫీజులు, పుస్తకాల ధరలు, యానిఫారాలు ఖర్చులు మోయలేనంత భారంగా మారాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. వీటన్నింటిపై సోనాల్ చౌదరి అనే సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియో పోస్టులో సదరు భారతీయ అమెరికన్ మహిళ స్పందించారు. విద్యా ఖర్చుల విషయంలో అమెరికాలో పరిస్థితి ఇండియా కంటే చాలా దారుణంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో కిండర్‌గార్టెన్, ప్రీస్కూల్ లేదా కాలేజీ విద్యకు చెల్లించే ఫీజులతో పోలిస్తే ఇండియాలో లభించే విద్యా ప్రమాణాలు, వసూలు చేసే ఫీజులు చాలా సహేతుకంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అమెరికాలో చిన్నపిల్లల డే కేర్ లేదా ప్రాథమిక విద్యకే ప్రతినెలా వేలాది డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. ఇక ఉన్నత విద్య కోసమైతే భారీగా అప్పులు చేయాల్సి వస్తుంది. అదే భారతదేశంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించే పాఠశాలలు కూడా అమెరికా స్కూళ్ల కంటే చాలా తక్కువ ఫీజులే వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికాలో ఫీజు స్ట్రక్చర్
  • రెండేళ్ల వయసు వరకు పిల్లలను పాఠశాలలో చేరిస్తే రోజుల లెక్కన ఫీజు నిర్ణయిస్తారు. వారానికి రెండు రోజులే చదువుకు పంపితే వార్షిక ఫీజు 3,879 డాలర్లు అంటే సుమారు రూ. 5.70 లక్షలు ఉంటుంది. వారానికి 3 రోజుల చదువుకు వార్షిక ఫీజు 5661 డాలర్లు .. అంటే సుమారు రూ. 5.40 లక్షలు, వారానికి నాలుగు రోజులైతే 7452 డాలర్లు అంటే సుమారు రూ. 7.10 లక్షలు, వారానికి ఐదు రోజుల చదువుకైతే 9279 డాలర్లు అంటే.. సుమారు రూ. 8.44 లక్షలు వసూలు చేస్తున్నారు.

  • 3 నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న పిల్లల విషయంలో వారానికి రెండు రోజుల చదువుకు 3,054 డాలర్ల (సుమారు రూ. 2.91 లక్షలు) వార్షిక ఫీజు వసూలు చేస్తారు. వారానికి మూడు రోజుల చదువుకు 4,353 డాలర్లు అంటే.. సుమారు రూ. 4.15 లక్షలు), వారానికి నాలుగు రోజుల చదువుకు 5,721 డాలర్లు అంటే.. సుమారు రూ. 5.45 లక్షలు, వారానికి ఐదు రోజుల చదువుకు 7,128 డాలర్లు అంటే.. సుమారు రూ. 6.80 లక్షలు ఉంటుంది.

  • ఇక రోజూ 3 గంటలపాటు తరగతులు చెబుతారు. దానికంటే ఎక్కువ సమయం పిల్లలను పాఠశాలల్లో ఉంచి చదువు చెప్పించాలనుకంటే దానికి రోజువారీ అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు గంటకు 20 లేదా 21 డాలర్లు ఉంటుంది.

ఈ ఫీజులు చూస్తే అమెరికాలో రెండేళ్ల పిల్లాడి వార్షిక ఫీజు ఒక కారు ధరతో సమానమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మనదేశంలో మారుతి సుజుకి బ్రెజా కారు ప్రారంభ ధర సుమారు రూ.7.40 లక్షలు. అమెరికాలో రెండేళ్ల పిల్లవాడిని వారానికి నాలుగు రోజులు పాఠశాలకు పంపడానికి చెల్లించాల్సిన వార్షిక ఫీజు మొత్తం కూడా కారు ధరకు దగ్గరగా రూ.7.10 లక్షలు కావడం విశేషం. అంటే ఒక కారు కొనుగోలు చేయగలిగే మొత్తంతో అమెరికాలో ఒక పిల్లాడిని రోజుకు నాలుగు గంటలు చొప్పున ఒక ఏడాది మాత్రమే చదివించగలమన్నమాట.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

NRI మహిళ పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో చదువుల భారంతో పోలిస్తే ఇండియాలో విద్యా ఖర్చులు తక్కువనేది నిజమేనని పలువురు ఎన్నారైలు, నెటిజన్లు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవించారు. అయితే మరికొందరు మాత్రం విభేదిస్తున్నారు. భారతీయ సగటు ఆదాయంతో పోల్చి చూస్తే ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర భారంగా ఉన్నట్లేనని వాదిస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు అమెరికాలో జీతాలు ఎక్కువనుకుంటే.. ఆ స్థాయిలోనే పాఠశాల ఫీజులు ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page