top of page

బిల్డప్‌లు ఆపితే బాగుంటుంది!

  • Guest Writer
  • 3 days ago
  • 3 min read

‘ఏం వదినా? మీవాడిని ఐటీ ఫౌండేషన్ కోర్స్‌లో చేర్చలేదా? అయ్యో.. అదేమమ్మా.. అయినా ఇంత ఘోరమా? ఏమైపోవాý వాడి బతుకు..’ బిడ్డ ఆరో తరగతిలో ఉన్నపుడు మాటలు.

‘ఇంటర్‌లో ఎన్ని మార్కులు? మా అమ్మాయికి 600కు 599.99. అయ్యో మీవాడికి 594? ఏమయ్యింది. ఇంత తక్కువా?”

“ఎంత ప్యాకేజీ? మా వాడికి టీసీఎస్‌లో మొత్తం యాభై లక్షలు. ఆఫీస్‌లో పొద్దున్న చికెన్ బిర్యానీ, మధ్యాహ్నం మటన్ బిర్యానీ. రాత్రికి ఫిష్ బిర్యాని. ఇంటికొచ్చిందే పడుకొని నిద్రపోవడమే. ఎంత సుఖమమ్మా!..”

“ఇప్పుడే అమెరికా ఫ్లైట్ దిగినా. సాన్‌జోస్‌లో మా బిడ్డ ఉండేది. నీకు తెలుసా? అక్కడ టాయిలెట్‌లు కూడా మన ఫలక్‌నుమా పాలస్ అంత పెద్దవి. బెడ్ ఏసుకొని పడుకోవచ్చు అనుకో. మనకు ఈడ ఉండాది ఎందుకమ్మా. పొల్యూషన్.. ఇరుకైన రోడ్లు”

“కోకాపేట్‌లో రెండు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రెండు కొన్నా”

...ఇదీ గత ముప్పై ఏళ్లుగా పెద్దవారి మాటలు.

టీవీ పెడితే... ఒకటి.. ఒకటి.. ఒకటి.. రెండు.. రెండు.. రెండు.. అని అరుపులు. పత్రికల్లో పేజీల నిండా ఫోటోలు.. నెంబర్‌లు.

జాతర.. వెర్రి.. వేలం వెర్రి..

ఒకటి వాస్తవం. మధ్య తరగతి బతుకులకు ఈ 30 ఏళ్లు పండుగ.. ఎన్నో రకాలుగా మేలు జరిగింది. కాకపోతే.. ఫండమెంటల్స్ మరిస్తే? ఇప్పుడదే జరుగుతోంది. ఫండమెంటల్స్‌ను మరచిన జాతిని కరెక్ట్ చేసేందుకు ప్రకృతి సిద్ధమవుతోంది. బాల్యం నుంచే కేవలం మార్కులపై దృష్టి నిలిపి, బట్టీ పద్ధతిలో బుర్ర నిండా సమాచారం నింపి, దాన్ని డేటా సెంటర్‌గా మార్చినవారికి ఉద్యోగాలు రావు. చదువు సాగే తీరు మారాలి.

‘గొప్పగా బతకాలి అనుకోకండి.. హ్యాపీగా బతకాలి అనుకోండి’. లేదంటే ఉద్యోగం లేక కేవలం చేతిలో పట్టాతోనే కాలం వెల్లబుచ్చాల్సి ఉంటుంది. ఒకప్ప్పుడు సాఫ్ట్‌వేర్ మన బతుకులను మార్చిన మాట వాస్తవం. కానీ ఇప్ప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఈ కథనం వైపు లుక్కేయండి.

ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ప్రపంచం నలుచెరగులా.. ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేయగానే ప్రపంచం పిలిచేది. ఇటు ఆస్ట్రేలియా మొదలు అటు కెనడా దాకా ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉండేది. మంచి జీతం 25 దాటకముందే, కలల జీవితాన్ని గడిపే అవకాశం.. ఇదీ 1997 నుంచి 2025 వరకు ఉన్న పరిస్థితి.

సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు బాగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా డిగ్రీ పూర్తిచేసినవారికి ఉద్యోగ అవకాశం కనుమరుగైపోయింది. ఇందులో కృతిమ మేధ 100కి 50 ఉద్యోగాలను తినేస్తే, కేవలం 15-20 ఉద్యోగాలను మాత్రం సృష్టిస్తుంది. అవి కృతిమ మేధతో పనిచేయించే ఉద్యోగాలు, కత్రిమ మేథ చేయలేని ఉద్యోగాలు. దీనికి మానవ నైపుణ్యాలు కావాలి.

కృతిమ మేధ నిపుణులు, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. లాంటి హై ఎండ్ టెక్ నిపుణులుగా ఒక వైపు. మంచి అవకాశాలు ఉంటే మరోవైపు నర్సులు, కేర్ టేకర్స్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (టీవీ మొబైల్ ఏసీ, తదితర), ఫిజియోథెరపీ, జిం ట్రైనర్లు లాంటి ఉద్యోగాల వెల్లువ రానుంది.

బల్గేరియా, లిథుయేనియా, ఇటలీ, గ్రీస్, పోర్చుగల్, హంగేరి, క్రోషియా, సెర్బియా, యుక్రెయిన్, దక్షిణకొరియా లాంటి దేశాల్లో జనాభా క్షీణత భారీగా ఉంది. యువతీయువకుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది.

కృతిమ మేధ అన్ని పనులూ చేయలేదు

విదేశాల నుంచి పైన పేర్కొన్న స్కిల్డ్, సెమి స్కిల్డ్ వ్యక్తులను దిగుమతి చేసుకోవడం మినహా.. మరో దారి లేదు. దేశం నడవాలంటే సైనికులు, పోలీస్ కావాలి. అక్కడేమో యువత తక్కువ. దానికి తోడు వారికి కష్టించి పనిచేసే ఓపిక తగ్గిపోతోంది. మరికొన్ని సంవత్సరాల్లో మన దేశం నుంచి అనేక దేశాలు సైన్యం కోసం యువతను నియమించుకునే అవకాశముంది. ఒకటి నిజం.. తెలివున్నవాడికి, కష్టపడే వాడికి ఉద్యోగం కష్టం కాదు.

ముప్పై ఏళ్లుగా భారతీయులు.. ముఖ్యంగా తెలుగువారి మైండ్‌సెట్ మారిపోయింది. చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే. ఈ రెండూ గొప్ప చదువులే. కాకపోతే కోళ్ల ఫారం ఇంజనీరింగ్ కాలేజీ, రోగులు లేని, శవాలు లేని, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు. ఇక్కడ చదివినవారికే దిక్కు లేకుంటే.. ఎక్కడో చంద్రమండలం అవతల దిక్కులేని దేశంలో మెడికల్ కోర్స్‌ల కోసం ఆరో తరగతి నుంచి రుబ్బి దంచుడు ఐఐటీ/ మెడికల్ ఫౌండేషన్ కోర్స్‌లు.

అదొక దశ.. మూడవ పారిశ్రామిక యుగం ముగింపు దశ !

భవిషత్తును మరచి తెలుగు జాతి సూపర్ స్పెషలైజ్ చేసేసింది. ఇదెలా వుందంటే.. ఒక ఊరి శివారుల్లో గ్రానైట్ ఫ్యాక్టరీ వెలసింది. ఉద్యోగాల వెల్లువ.. మంచి జీతం.. పదేళ్లు వ్యవయాసాన్ని ఇంకా అన్ని వృత్తుల్ని మరచి ఆ గ్రామ జనాభా అందులో మునిగి తేలింది. ఆస్తులు ఐశ్వర్యాలు విలాసాలు సాగితే బాగుంటుంది. కానీ అక్కడ ఇప్పుడు గ్రానైట్ రాళ్లూ లేవే..!!

బిల్డప్ కబుర్లు మానితే.. బాగుపడుతుంది.

1997-2025 కాలం నాటి బిల్డప్ పేరెంట్స్, వారికోసం వెలసిన విద్యా దుకాణాలు, ప్రకటనల రెవెన్యూ కోసం ప్రభంజనం.. పిండాకూడు అంటూ.. వంతపాడిన మీడియా.. వీరే విలన్‌లు. వీరి అతికి ఇకనైనా బ్రేక్ పడితే మంచిది. మేధోమధనం జరగాలి. తెలుగు వారి మైండ్‌సెట్ మారాలి. చదువు చదువులా సాగాలి. 1980కి ముందు ఇదే జరిగేది. బిడ్డను బిడ్డలా పెంచాలి. వందల వేల తరాలుగా ఇదే జరిగేది. రాబోయే రోజుల్లో పిల్లలకు మించిన ఆస్తి ఇంకోటి లేదు. నిన్నటి దారిలో నడిచేవాడు క్యాడర్. రేపటి దారిని వెదికి పట్టుకొనేవాడు లీడర్. ఇప్పుడు ఉద్యోగ అభద్రత ఎదుర్కొంటున్న వారు ఏఐ నేర్చుకోవాలి. స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. హ్యూమన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. కాలం మారింది. ఇంకా పాత దారిలో పోతానంటే ఎలా? ఇది సరిదిద్దుకునే కాలం.. కొంత ఇబ్బంది తప్పదు.

- వాసిరెడ్డి అమర్నాధ్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page