top of page

12 నెలలు.. 13 రీఛార్జీలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 11 hours ago
  • 3 min read
  • దోపిడీకి గురవుతున్న సెల్‌ఫోన్ వినియోగదారులు

  • పేరుకే నెలవారీ టారిఫ్.. 28 రోజులే వ్యాలిడిటీ

  • ఆ విధంగా ఏడాదిలో ఒక నెల అదనపు వసూలు

  • వినియోగించని డేటాను కొట్టేస్తున్న కంపెనీలు

  • సామాన్యుడే ‘శర’మెత్తితే - 2

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఒడిశా రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. ‘బారో మాసొకు తీరొ జత్రా’ అని ఒడియా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు అంటుంటారు. ఏడాదిలో ఉండే 12 నెలల్లోనే 13 జాతరలు’ అని దాని అర్థం. ఒడిశాలో జాతరలు, ఉత్సవాలు ఎక్కువని చెప్పడం దీని ఉద్దేశం. దేశంలోని టెలికామ్ నెట్‌వర్క్ ఆపరేటర్లు అచ్చం ఇదే రీతిలో పండుగ చేసుకుంటున్నారు. తమ ఖాతాదారులను అత్యంత విలువైన వారిగా పరిగణిస్తున్నామంటూనే టారిఫ్‌ల మాయాజాలంతో వారి నెత్తిన చెయ్యి పెట్టి.. జేబుకు చిల్లు పెడుతున్నారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎసఎనఎల్‌తోపాటు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, తదితర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఉన్నారు. బీఎసఎనఎల్ సంగతి పక్కనపెడితే ప్రైవేట్ ఆపరేటర్లు నెలవారీ టారిఫ్‌ల పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నాయి. నెల టారిఫ్ అంటే 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే కల్పిస్తూ రెండురోజులు కోత విధిస్తున్నాయి. అదేవిధంగా రోజువారీ డేటా పరిమితి పేరుతో మరో దోపిడీకి కూడా పాల్పడుతున్నాయి. కానీ సామాన్య వినియోగదారులు ఈ దోపిడీని గుర్తించడంలేదు. ఒకవేళ గుర్తించినా ప్రశ్నించే స్థాయిలో వారు లేకపోవడం టెలికాం ఆపరేటర్లకు అవకాశంగా మారింది. అయితే సామాన్యుల తరఫున గళం వినిపించడంలో ముందున్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ దోపిడీని ఎందుకు కొనసాగనిస్తున్నారని ప్రశ్నించారు. టెలికాం ఆపరేటర్ల టారిఫ్‌ల మాయ గురించి ఆయన పూస గుచ్చినట్లు వివరించడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలోనూ దీనిపైనే విస్తత చర్చ జరుగుతున్నది.

మనం ఎలా మోసపోతున్నాం?

మనదేశంలో 1995లో మొదటి సెల్‌ఫోన్ మోగింది. అప్పటినుంచీ సెల్‌పోన్ల వినియోగం బహుముఖంగా విస్తరించింది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. రిలయన్స్‌కు చెందిన జియో రంగప్రవేశంతో సెల్ తరంగం అట్టడుగుస్థాయికి విస్తరించింది. వాయిస్ కాల్స్‌తో పాటు ఇంటర్‌నెట్ కారణంగా ప్రపంచం సామాన్యుడి అరచేతిలోకి వచ్చింది. ఇదే అదనుగా అనేక ఆఫర్లు ప్రకటించి లక్షలు, కోట్ల వినియోగదారులను వలలో వేసుకున్న నెట్‌వర్క్ సంస్థలు.. అదే మత్తులో ఉన్న కస్టమర్లను వంచించడం మొదలుపెట్టాయి. సమాజంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు వీలుగా నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది టారిఫ్‌లు అంటూ ప్రకటించడం మొదలుపెట్టాయి. నెల టారిఫ్ అంటే సాధారణంగా ఎవరైనా నెలకు 30 రోజులు ఉంటాయి కనుక ఆ మేరకు టారిఫ్ వర్తిస్తుందని అనుకుంటారు. కానీ టెలికాం ఆపరేటర్ల లెక్క మాత్రం నెల అంటే 28 రోజులేనట! నెల టారిఫ్ అని ప్రకటించిన రేట్లు 28 రోజులకే వర్తిస్తున్నాయి. అలాగే రెండు నెలలు అంటే 56 రోజులు, మూడు నెలలు అంటే 84 రోజులు మాత్రమే టారిఫ్ అమల్లో ఉంటుంది. ఆ విధంగా ప్రతి నెలా రెండు రోజులు కోత విధిస్తున్నాయి. అంటే ఏడాదికి 24 రోజులు.. అవి కాకుండా 31 రోజులు వచ్చే నెలలు కూడా కొన్ని ఉంటాయి కదా!.. వాటిని కూడా కలుపుకుంటే సంవత్సరంలో దాదాపు నెలరోజులు కోత పడుతున్నది. ఆ నెల రోజులకు మళ్లీ వినియోగదారుడు రీఛార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదిలో 12 నెలలు ఉంటే నెట్‌వర్క్ సంస్థలు మాత్రం తమ విలువైన ఖాతాదారుల నుంచి 13 నెలలకు రీఛార్జి చేయించుకుంటున్నాయి. ఈ దోపిడీని నగదులో లెక్కిస్తే గుండె గుభేల్ మంటుంది. క్యాలెండర్ మంత్ పేరుతో ఒకటి రెండు టారిఫ్‌లు అమల్లో ఉన్నా వాటికి అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు.

డేటా చౌర్యం

టారిఫ్‌లో దోపిడీకి పాల్పడుతున్న ఆపరేటర్లు మరోవైపు వినియోగదారుల డేటాను సైతం చోరీ చేస్తున్నాయి. అదేలాగో చూద్దాం. ప్రస్తుతం ఉన్న టారిఫ్‌ల వివరాలు పరిశీలిస్తే.. వన్ జీబీ, 1.5 జీబీ, 2 జీబీ రోజువారీ పరిమితితో చాలా ప్లాన్లను అన్ని సంస్థలూ అమలు చేస్తున్నాయి. ఈ ప్లాన్లు రీఛార్జి చేయించుకున్నవారు వాటికి అనుగుణంగా ఒకరోజులోనే ఆ డేటాను పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆలోపే ఆ పరిమితి దాటిపోతే మళ్లీ డబ్బులు పెట్టి అదనపు డేటా కొనుక్కోవాల్సిందే. కానీ చాలామంది సామాన్య వినియోగదారులు రోజువారీ డేటానే పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. అదనపు డేటా కావాలంటే కొనుక్కోవాలంటున్న కంపెనీలు రోజువారీ కోటాను పూర్తిగా వాడుకోలేకని వారికి సంబంధించి మిగిలిన డేటాను అవసరానికి వాడుకునే వెసులుబాటు మాత్రం కల్పించడంలేదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు రోజుకు 2 జీబీ డేటా కోసం రీఛార్జ్ చేయించుకున్నా డనుకుందాం. అయితే రోజుకు 1.5 జీబీ మాత్రమే వాడుకున్నాడు. ఆ మిగిలిన అర జీబీ మరుసటి రోజు అతని డేటాలో కలుపుతారా అంటే లేదు. రాత్రి 12 గంటలకు అయిన వెంటనే ఆ అర జీబీ మాయమైపోతుంది. అంటే ప్రతిరోజూ హాఫ్ జీబీ చొప్పున నెలలో.. సారీ 28 రోజుల్లో 14 జీబీ వరకు వినియోగదారుడు మిగిల్చిన డేటా తిరిగి కంపెనీ ఖాతాలోకి వెళ్లిపోతున్నది. తద్వారా సంస్థ వేరే వారికి ఆ డేటా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నది. ఈ చౌర్యాన్ని అరికట్టడానికి డేటా ట్రాన్స్‌ఫర్ విధానం అమలు చేయాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. అంటే ఈరోజు మిగిలిపోయిన డేటాను అదే వినియోగదారుడి మరునాటి డేటా కోటాలో కలపాలన్నది ఆయన డిమాండ్. మరోవైపు రీఛార్జి గడువు ముగిసిన మరుక్షణమే నెట్‌వర్క్ సంస్థలు వినియోగదారుడి అవుట్ గోయింగ్‌తోపాటు ఇన్‌కమింగ్ సేవలను కూడా కట్ చేసేస్తున్నాయి. దీనివల్ల వినియోగాదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో అంతా ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఆధార్, బ్యాంకు, బీమా.. ఇలా అనేక వ్యవహారాలకు వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు సెల్‌ఫోన్లకే వస్తుంటాయి. ఇలాంటి తరుణంలో గడుపు ముగిసేలోగా రీఛార్జి చేసుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో ఇన్‌కమ్ కాల్స్ నిలిపివేస్తే వినియోగదారుడు సంక్షోభంలో పడతాడు.

కేంద్ర ప్రభుత్వ స్పందన

రాజ్యసభలో రాఘవ్ చద్దా నిలదీతతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం 30 రోజుల రీఛార్జి ప్లాన్లు అందుబాటులోకి తేవాలని టెలికాం సంస్థలకు సూచించింది. దీనిపై కేంద్ర సమాచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు టెలికాం సంస్థలు తమ 30 రోజుల టారిఫ్‌ల గురించి మరింత ప్రచారం చేయాలని సూచించడంతోపాటు 28 రోజుల కాలపరిమితి ఉన్న టారిఫ్‌లను నెలరోజులుగా మార్చాలన్నారు. 2022లో ట్రాయ్ జారీ చేసిన టారిఫ్ ఆర్డర్ ప్రకారం టారిఫ్‌లలో కనీసం ఒక్క 30 రోజుల ప్లాన్ అయినా ఉండాలి. దాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page