18న సీఎం జిల్లా పర్యటన..?
- BAGADI NARAYANARAO
- Aug 12
- 1 min read
పాస్‌బుక్‌ల పంపిణీకి శ్రీకారం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ నెల 18న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రానున్నట్టు కలెక్టరేట్‌కు మంగళవారం సీఎంవో సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నెల 15 తర్వాత కచ్చితంగా ఎప్పుడు వస్తారో డేట్ ఫిక్స్ చేసి చెబుతామని, అందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని వర్తమానం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. వైకాపా హయాంలో జగన్ ఫోటోతో వచ్చిన పాస్‌బుక్‌లను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం, పంపిణీ చేసిన వాటిని వెనక్కి తీసుకోవడం చేసింది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్‌బుక్‌ను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించి పాస్‌బుక్‌లను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని లాంచ్ చేయడానికి ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో పర్యటించారు. ఆతర్వాత మత్స్యకార భరోసా మొత్తాన్ని ఖాతాలో జమచేసిన సందర్భంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించారు. ఇప్పుడు మూడోసారి పాస్‌బుక్‌లు పంపిణీ చేయడానికి శ్రీకాకుళం జిల్లాను వేదికగా చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడ, ఎప్పుడు పర్యటిస్తారన్న షెడ్యూల్ ఖరారు కాకపోయినా సీఎం చంద్రబాబు పర్యటన ఖాయమైందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15 తర్వాత చంద్రబాబు పర్యటన ఉంటుందని సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు మంగళవారం ఉదయం సమాచారం అందినట్టు కలెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
Comments