‘తంతు’ కాదు.. అంతు చూస్తాం!
- BAGADI NARAYANARAO

- 5 hours ago
- 2 min read
ఏసీబీ తీరుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది టెన్షన్
గతంలో మాదిరిగా పరిశీలనతో సరిపెట్టేస్తారని అంచనా
కానీ రికార్డులు పట్టుకుని భవనాల పరిస్థితి విశ్లేషణ
ఎక్కడ అక్రమాలు బయటపడతాయోనని ఆందోళన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ టౌన్ ప్లానింగ్ విభాగంపైకి ఏసీబీ దష్టి మళ్లింది. అయితే అది అప్పట్లో మాదిరిగా పరిశీలన తంతుగా ముగుస్తుందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఈసారి అవినీతిని వెలికితీయాలన్న కశనిశ్చయంతో ఉన్నట్లు వారి చర్యల ద్వారా తెలుస్తోంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో నగర ప్లానింగ్ విభాగంలో 2020 ఫిబ్రవరిలో ఏసీబీ సోదాలు చేసి రెండు రోజులపాటు రికార్డులు పరిశీలించింది. నాటి పరిశీలనలో లోపాలు ఏమైనా కనుగొన్నారా? ఎవరిపైనైనా చర్యలకు సిఫార్సు చేశారా? అన్నవి ఇప్పటికీ బయటపడలేదు. కానీ తాజాగా మంగళవారం నుంచి అటువంటి పరిశీలన తంతే జరుగుతోంది. దాంతో ఏం కాదులే.. అన్న ధీమా ప్లానింగ్ విభాగం ఉద్యోగుల్లో కనిపించింది. అయితే ఏసీబీ అధికారులు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన అధికారులు బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఈ పరిశీలనలో ఒకటి రెండు అనధికార నిర్మాణాల గురించి వెలుగులోకి వచ్చినా.. మిగిలినవి ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేస్తాయి. ఇప్ప్పుడు ఏసీబీ అదే పని చేస్తోంది.
క్షేత్రస్థాయిలోనూ పరిశీలన

ఏసీబీ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది నిర్మాణాలు తనిఖీ చేసి వివరాలు సేకరించారు. రెండోరోజు సోదాలు కొనసాగుతాయని టౌన్ ప్లానింగ్ అధికారులు ముందే గుర్తించి ఏసీబీ బందాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ వేశారు. ఏయే భవనాలు పరిశీలించాలన్న దానిపై ముందుగానే రోడ్డు మ్యాప్ సిద్ధం చేసి ఎటువంటి సమస్య తలెత్తదని గుర్తించిన నిర్మాణాలనే ఏసీబీ అధికారులకు చూపించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారం, అందిన ఫిర్యాదుల ఆధారంగా గుర్తించిన అక్రమ కట్టడాలనే గుర్తించి పరిశీలించారు. మందుగా న్యూకాలనీలోని శ్రీచైతన్య కాలేజీకి ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఆ అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఒక్క నిబంధన కూడా పాటించలేదు. అదేమని అప్పట్లో టౌన్‌ప్లానింగ్ అధికారులను అడిగితే, కోర్టు అలానే ఆదేశాలిచ్చిందని తప్ప్పుదోవ పట్టించేవారు. ఇప్ప్పుడు అదే నిర్మాణాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. దీంతో పాటు బీపీఎస్, ఎలఆరఎస్‌లకు సంబంధించి వివిధ సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులపైనా నగరంలో పలుచోట్ల ఆరా తీశారు. టౌన్ ప్లానింగ్ అధికారులను, సిబ్బందిని వెంటబెట్టుకొని నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భ„వనాలను పరిశీలించి కొలతలు కూడా తీసుకున్నారు. రికార్డుల ప్రకారం నిర్మాణం జరిగిన ప్రదేశం భూస్థితి, ప్లాన్ అప్రూవల్, నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. నిబంధనల ప్రకారం బీపీఎస్ ఛార్జీలు చెల్లించారా అని ఆరా తీశారు. గతంలో అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా ఆరా తీశారు. రెండు రోజులుగా చేపడుతున్న తనిఖీల్లో గుర్తించిన అక్రమాలపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందించనున్నారు. దీనిపై ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి.






Comments