top of page

డబ్బు కొట్టు.. బడ్డీ పెట్టు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 9 hours ago
  • 1 min read
  • ‘పేట’లో రోడ్డు మీద వ్యాపారానికి వసూళ్లు

  • ప్రాంతాలవారీగా రేట్లు నిర్ణయిస్తున్న చోటానేతలు

(సత్యంన్యూస్, నరసన్నపేట)

చిరువ్యాపారులు రోడ్డెక్కాలంటే స్థానిక చోటా నాయకులకు డబ్బులు ఇవ్వాల్సిందేనా? అంటే.. ఔననే సమాధానాలే పేటలో వినిపిస్తున్నాయి. పంచాయతీకి చెందిన స్థలాల్లో ఫుట్‌పాత్ కాలువలపై తోపుడుబళ్లు, పాన్‌షాపు, టీ, టిఫిన్ బడ్డీలు, పండ్ల జ్యూస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూటమి పార్టీల నాయకులు అనధికారికంగా వేలల్లోనే డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల అధికమయ్యాయి. పంచాయతీ కార్యాలయానికి ఎలాగూ ఆశీలు కట్టాలి. ఇది కాకుండా అసలు రోడ్డు మీద బడ్డీ పెట్టాలంటేనే స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను ప్రసన్నం చేసుకోవాలనే వాదన వినిపిస్తోంది.

ప్రభుత్వం మారిన ప్రతిసారీ స్థానికంగా ఉండే చోటా నాయకులు చిరు వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ స్థలంలో ఉన్న బడ్డీల నుంచి వేలల్లోనే గుంజుకుంటున్నారని ఆరోపణలున్నాయి. నరసన్నపేటలో ఒక్కో ప్రాంతానికి ఒక రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారట. ఇటీవల ఒకర్ని చూసి మరొకరు దీన్ని ఆదాయ వనరుగా భావించడంతో ఈ దందా ఎక్కువైందని స్థానికంగా చర్చ సాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల గోడలకు ఆనించి కాలువలపై, పంచాయతీ, రోడ్డుపక్కన కొత్తగా స్టాల్ పెట్టాలంటే వేలల్లో సమర్పించుకుంటున్నారని తెలుస్తుంది. దీనిపై పార్టీ పెద్దలు దృష్టి సారించకపోతే నష్టపోతామని స్వయంగా కొందరు కూటమి నేతలే మాట్లాడుతుండటం గమనార్హం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page