మొక్కలేవీ? మేకలు తినేశాయి!
- Prasad Satyam
- 8 hours ago
- 2 min read
2024`25 ఆర్థిక సంవత్సరంలో ప్లాంటేషన్ పేరుతో దోపిడీ
లెక్కే చెప్పకుండా రూ.14 లక్షలు పట్టుకుపోయిన రాజమండ్రి కాంట్రాక్టర్
అధికారులకు ఏటీఎంగా మారిన గ్రీన్ ప్రాజెక్ట్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
డబ్బుదేముందిరా.. కుక్కలకు కొడితే రాల్తాయంటారు మనూరిలో. కుక్కలకు కొడితే రాల్తాయో లేదో తెలీదు గానీ మొక్కల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్‌ను కొడితే డబ్బులు రాలుతాయి. ఇది మేమంటున్న మాట కాదు. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు తమకు అవసరమైనప్ప్పుడల్లా ఏటీఎంలా మనీ విత్‌డ్రా చేసుకోవడం కోసం రచించిన పథకంలో మున్సిపాలిటీలో మొక్కలు నాటడం ఒక కార్యక్రమం. ఆదిత్యనగర్ కాలనీ నుంచి కిల్లిపాలెం జంక్షన్ వరకు లక్ష పైబడి ఖర్చు పెట్టి మొక్కలు వేశారు. మహాలక్ష్మీనగర్ కాలనీ నుంచి అఫీషియల్ కాలనీ వరకు రూ.53వేలు పైచిలుకు ఖర్చుపెట్టి మొక్కలు నాటారు. చైతన్య స్కూల్ నుంచి లక్ష్మీనగర్ వరకు (అంటే ఖాజీపేట పరిధిలో) రూ.1.77 లక్షలు పైచిలుకు ఖర్చుపెట్టి మొక్కలు నాటారు. కంపోస్టు కాలనీ నుంచి సిద్ధార్థ స్కూల్ వరకు అంటే.. కలెక్టర్ బంగ్లా వెనుక వరకు మొక్కలు నాటారు. అందుకు రూ.2లక్షలు పైచిలుకు ఖర్చయింది. ఎస్‌బీఐ ఏటీఎం నుంచి వాంబే కాలనీ వరకు మొక్కలు నాటడానికి అయిన ఖర్చు లక్ష పైచిలుకు. తెలుగు ముసలయ్య కాలనీ నుంచి ఏబీసీ సెంటర్ వరకు రూ.1.63 లక్షలు పైచిలుకు ఖర్చుపెట్టి మరీ మొక్కలు నాటారు. మీరెప్ప్పుడైనా ఆ ప్రాంతం మీదుగా వెళితే.. ఏదైనా మొక్క కనిపిస్తే ఒకసారి మొక్కుకోండి. ఎందుకంటే.. ఇవి చాలా ఖరీదైనవి. అరుదుగా దొరికే మొక్కలు. అందుకే ఒకసారి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది. ఎందుకంటే.. ఎన్ని మొక్కలు నాటారో, ఏ మొక్కలు నాటారో, అసలు ఎప్ప్పుడు నాటారో ఏమీ లేకుండా లక్షలకు లక్షలు మొక్కల మీద పోసేసి ఎంచక్కా లక్షలాది రూపాయల బిల్లులు దిగమింగేశారు. మొక్క ఏదని అడిగితే మేక తినేసిందని చెబుతారు. మేకను కోసి కడుపులో వెతకాలంటే ఇప్ప్పుడు ఆ ఖర్చు అదనం. కాబట్టి ఆ జోలికి వెళ్లకుండా మనం కట్టే పన్నులు మొక్క రూపంలో మన కళ్ల ముందు కనిపిస్తే మాత్రం మొక్కు తీర్చుకోవాల్సిందే.
పైన చెప్పిన ఈ మొక్కలన్నీ మున్సిపల్ కాంట్రాక్టర్ చల్లా సింహాచలం పేరుతో జరిగాయి. మొక్కలేవని మాత్రం అడిగితే కులం కార్డు బయటకు వస్తుంది. మేకలు తినేసే మొక్కలు ఆయనొక్కడే వేయగలడా? మేమÖ వేస్తామంటూ మరికొందరు కాంట్రాక్టర్లు మన అధికారుల వద్దకు వెళ్లారు. అంతే.. అదే బేరం కుదిరింది. ఈసారి ఏకంగా ఇండియన్ ప్లే స్కూల్ నుంచి చాపురం వాటర్ ట్యాంకు వరకు రూ.2.60 లక్షల పైచిలుకుతో మొక్కలు వేశారు. అలాగే టిడ్కో కాలనీ దగ్గర రూ.2.87 లక్షలతో మొక్కలు వేశారు. ఇవి కూడా మనకు కనపడవు. అదేమని అడిగితే, మొక్కలు వేయడమైతే వేశాం గానీ, మున్సిపాలిటీ నీరెయ్యకపోవడం వల్ల చచ్చిపోయాయని చెబుతారు.
ఇప్ప్పుడంటే మున్సిపాలిటీ వైపు చూడటానికి ఒక ఎమ్మెల్యే, నిరంతరం పని చేయడానికి ఒక కమిషనర్ వున్నారు గానీ, 2024`25 ఆర్థిక సంవత్సరంలో గందరగోళంగా ఉన్న పరిస్థితుల మధ్య ఇష్టారాజ్యంగా సొమ్ములు తినేశారు. అయితే ఇప్ప్పుడు మనం చెప్ప్పుకోబోయే మరో అంశం చూస్తే చల్లా సింహాచలం, జీవీ గణేష్‌లే నయమనిపించక మానదు. కనీసం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొక్కలు నాటారో మన అధికారులకు సెలవిచ్చారు. కానీ రాజమండ్రికి చెందిన సాయిగణేష్ మెడికల్స్ అనే ఒక సంస్థ 2024 అక్టోబర్, నవంబర్‌లలో మొక్కలు నాటామని ఏకంగా 14,15,996 రూపాయలు బిల్లు చేసుకుపోయింది. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న రికార్డులు పరిశీలిస్తే ఎక్కడ నాటారు? ఎన్ని నాటారు? అనే వివరాలే లేవు. ఈ సంస్థ సమర్పించిన బిల్లులు మెడికల్స్ పేరుతో ఉండటం గమనార్హం.
శ్రీకాకుళం మున్సిపాలిటీలో మొక్కలు అంటే.. ఎన్విరాన్‌మెంట్ విభాగం గుర్తొస్తుంది. దీనికి బి.సృజన అనే అసిస్టెంట్ ఇంజినీర్ ఉన్నారు. ఇక నాటడం, మొక్కలు తేవడం అనే లెక్కల్లో చెప్ప్పుకుంటే చిన్నారావు అనే హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. ఇవి కాకుండా హార్టికల్చర్ ఏడీ ప్రసాదరావు కూడా ఈ పనులు పర్యవేక్షించవచ్చు. ఇన్ని మొక్కలు, ఇన్ని లక్షలు ఏమయ్యాయో, ఎక్కడున్నాయో వీరిలో ఎవరు చెప్పినా మంచిదే.






Comments