బుక్కు పోయిందని బుకాయింపు!
- NVS PRASAD

- 2 minutes ago
- 2 min read
రూల్ ఆఫ్ రిజర్వేషన్ జాబితా దేన్ని చూసి చేశారు?
కలెక్టర్ దాన్ని ఎలా ఆమోదించారు?
హెల్త్ అసిస్టెంట్ల ఆందోళనతో నాటకానికి తెరలేపిన డీఎంహెచ్‌వో
మంగళవారం కూడా కొనసాగిన నిరసన

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంలేదంటూ గత రాత్రి నుంచి ఉద్యోగులు కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉంటే.. ఇందులో రోస్టర్ ప్రాతిపదికన 154 మందికి పదోన్నతులు కల్పించాలని గత ఏడాది నవంబరు 31కే ప్రమోషన్ల జాబితా సిద్ధం చేసి కలెక్టర్ అనుమతి పొందినా, తమకు పదోన్నతులు రాలేదంటూ హెల్త్ సెక్రటరీలు నిరవధికంగా ధర్నా చేస్తున్నారు. రోస్టర్ జాబితా ఉండే ఫైలే డీఎంహెచ్‌వో కార్యాలయంలో లేదని స్వయంగా డీఎంహెచ్‌వోనే ఒక పత్రికలో ప్రకటించారు. అసలు రోస్టర్ పాయింట్లు తెలిపే జాబితాయే తమ దగ్గర లేదని ఆమె చెబుతుంటే, రోస్టర్ పాయింట్ల మేరకు పదోన్నతులు కావాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. వాస్తవానికి ఈ ఉద్యోగాల కేటాయింపే తప్ప్పులతడకగా సాగిందని స్వయంగా జాతీయ ఎస్టీ కమిషనే స్పష్టం చేసింది.

2019లో 648 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 625 పోస్టులు ఓసీ, ఎస్సీ, బీసీలో ఉన్న వివిధ కేటగిరీలకు కేటాయించారు. 23 పోస్టులు ట్రైబల్ ఏరియాకు ఇవ్వాలని పేర్కొన్నారు. పద్ధతి ప్రకారమైతే 648 పోస్టులు భర్తీ చేయాలి. లేదూ ట్రైబల్ ఏరియాకు పోస్టులు ఇవ్వలేదంటే.. 635 పోస్టులుండాలి. కానీ ఇక్కడ దేనికీ సరిపెట్టకుండా ఇష్టారాజ్యంగా ఏ రోస్టరూ పాటించకుండా మెరిట్ జాబితాను తయారుచేసి ఉద్యోగాలిచ్చేశారు. దీని మీదే ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని కమిషన్ చీవాట్లు పెట్టింది. దీంతో ఈ ప్రక్రియ మొత్తానికి నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్ప్పుడు తాజాగా గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2కు పదోన్నతులు ఇవ్వాలంటూ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. చావుకబురు చల్లగా, అసలు ఆ రోస్టర్ బుక్కే తమ దగ్గర లేదని, ఆ సమయంలో తాను గాని, ఇప్ప్పుడు ఆ సంబంధిత సీటు చూస్తున్న ఉద్యోగులు గాని లేరని డీఎంహెచ్‌వో తప్పించుకుంటున్నారు. అసలు ఫైలే లేకుండా గ్రేడ్`3 ఏఎనఎంల సీనియారిటీ లిస్టు ఎలా తయారుచేశారు? దానికి కలెక్టర్ నుంచి ఎలా ఆమోదం పొందారు? అనేదే ప్రశ్న. సీనియారిటీ లిస్టు తయారుచేసినప్ప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ బుక్ ఆధారంగా 154 మందికి ప్రమోషన్ ఇస్తున్నామని ఒక లిస్టు పెట్టారు. దానిలో డీఎంహెచ్‌వో సంతకం ఉంది. ఇప్ప్పుడు ఆ ప్రమోషన్లేవో మా మొహాన కొట్టిండి మహాప్రభో అంటే ఏకంగా ఫైలే లేదని డీఎంహెచ్‌వో చెప్ప్పుకొస్తున్నారు. ఒక ప్రభుత్వ కార్యాలయం నుంచి ఫైలు పోతే, ఆమె ఇంతవరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఈ కేసులో ఒక భాగం ఎస్టీ కమిషన్ దగ్గరకు వెళ్లినప్ప్పుడు ఏ ఫైలు చూసి సమాధానం ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ బుక్‌లో వివరాలు కావాలని వాబ యోగి కొద్ది కాలం క్రితం సమాచార హక్కు చట్టం మేరకు దరఖాస్తు చేస్తే, అందులో నాలుగు డబుల్ ఎంట్రీలు వచ్చాయి. అంటే.. నలుగురికి రెండేసి ఉద్యోగాలిచ్చారన్నమాట. ఇది దేన్ని చూసి ఇచ్చారు. అలాగే ఆర్‌వోఆర్ బుక్‌లో లేని 24 మంది అభ్యర్థుల పేర్లు ఇప్ప్పుడు ఈ సీనియారిటీ లిస్టులోకి ఎలా వచ్చాయి? గ్రేడ్`3 నుంచి గ్రేడ్`2 ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 6 శాతం కోటాను అమలుచేస్తూ 154 మందిలో 9 మంది ఆదివాసీలకు అవకాశం ఇవ్వాలని ఎస్టీ కమిషన్ తేల్చింది. ఇప్ప్పుడు ఆ బుక్కే లేదని బుకాయిస్తున్నారు. గట్టిగా అడిగితే, ఆ సమయంలో తాము లేమంటున్నారు. ఇది కేవలం బ్యాంకుబుక్కు మీద ఉన్న దష్టి ఆర్‌వోఆర్ బుక్ మీద లేదని చెప్పడానికి నిదర్శనమని వాబ యోగి అంటున్నారు. ప్రస్తుత డీఎంహెచ్‌వో అనిత ఆ సమయంలో లేకపోవచ్చు. కానీ కార్యాలయంలో ఫైలు లేదని ఆమెకు గత ఏడాది నవంబరు 30 నాటికే తెలిసుండాలి. కానీ ఇష్టానుసారంగా ప్రమోషన్ల జాబితా తయారుచేసి, కలెక్టర్‌ను మోసం చేసి, పబ్బం గడుపుకోవాలని చూశారు. ఎప్ప్పుడైతే ఈ కథలోకి ఎస్టీ కమిషన్ ఎంటరైందో.. ఇప్ప్పుడు ఫైలే లేదని చెతులెత్తేశారు.






Comments