top of page

అంత కోపం ఎందుకంట.. బయటకు చెప్పుకోలేక తంటా !

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 5 days ago
  • 3 min read
  • వీడియో కాన్ఫరెన్స్‌లో ఏవోకు కలెక్టర్ చీవాట్లు

  • ఎదురుతిరిగిన ఏవో హైమవతి

  • ఎక్కడైనా తేల్చుకోవడానికి సిద్ధమని స్పష్టీకరణ

  • ఆయన తీరుపై ఇతర అధికారుల్లోనూ అసంతప్తి

  • ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వివాదం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో టÉక్కలి ఆర్డీవో కార్యాలయ ఏవో హైమావతి జిల్లా అధిపతి అయిన కలెక్టర్‌కు జవాబిచ్చిన తీరు ఉద్యోగవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించడంతో ఉద్యోగం మీరిచ్చింది కాదని.. కష్టపడి సంపాదించుకున్నదని.. సస్పెండ్ చేస్తే ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటానని హైమావతి స్వరం పెంచడంతో ఆమె మాటలు బయటకు వినిపించకుండా మ్యూట్ చేసేశారని తెలిసింది. మీరు ఎలా ఈ స్థాయికి వచ్చారో అలాగే నేనూ కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని కలెక్టర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం. చివరికి మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే స్థాయికి ఆమె ఎందుకు వెళ్లారు? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో టెక్కలి ఆర్డీవో పరిధిలో 22ఏ పెండింగ్ ఇష్యూపై కలెక్టర్ ప్రశ్నించగా తహసీల్దారు కార్యాలయంలో ఉన్న పెండింగ్‌లకు ఆర్డీవో కార్యాలయం జవాబుదారీ కాదన్నట్టు ఏవో సమాధానం ఇవ్వడంపై కలెక్టర్ ఆగ్రహించినట్లు తెలిసింది. డివిజన్‌లోని కొత్తూరు మండల పరిధిలోని 22ఏ పెండింగ్‌లపై ఏవోకు కలెక్టర్ చీవాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో హైమావతి గ్రామస్థాయిలో వీఆర్‌వోల వద్ద ఉన్న 22ఏ పెండింగ్‌పై తహసీల్దార్లను ప్రశ్నించాలని, ఆర్డీవో ఆఫీసులో ఉన్న ఏవోను కాదన్నట్లు కలెక్టర్‌కు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో జరగాల్సిన పనులకు ఏవోను బాధ్యురాలిని ఎలా చేస్తారని కూడా ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. మొత్తం మీద వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఏవో మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు అధికారులే చెబుతున్నారు.

మొదటి నుంచీ నిరాదరణ?

ఏవోపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదని, తహసీల్దారుగా ప్రమోషన్ పొందిన హైమావతిని పూర్తిస్థాయి తహసీల్దారుగా కొనసాగించకుండా వివక్ష చూపించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆమెకు మందస తహసీల్దారుగా పోస్టింగ్ ఇచ్చినా తర్వాత రాజకీయ కారణాలతో తప్పించినట్టు రెవెన్యూ వర్గాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా 50 రోజులపాటు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారని భోగట్టా. చివరికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాతనే పోస్టింగ్ ఇచ్చినట్టు తెలిసింది. పోస్టింగ్ ఇచ్చినా 47 రోజుల జీతం పెండింగ్‌లో ఉంచి, ఇబ్బంది పెడుతున్నారనేది ఆమె వాదన. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా జీతం పెండింగ్‌లో పెట్టడంపైనా ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు సమాచారం. బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే ఏవోపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అందులోనూ జిల్లా అధికారులందరూ పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వాడే పరుష పదజాలం బాధిస్తున్నాయని ఎప్పటి నుంచో అధికారుల్లో చర్చ సాగుతోంది. పని ఒత్తిడి, ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు టెలీకాన్ఫరెన్స్, సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్, మధ్యలో ఇతర సమావేశాలు నిర్వహించి అధికారులను చీవాట్లు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని తట్టుకోలేకే ఏవో హైమావతి కలెక్టర్‌కు ఎదురుతిరిగారని చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశం లేకుండా కార్యాలయాలకే పరిమితమయ్యే దుస్థితి నెలకొందన్న విమర్శలు ఉన్నాయి. శాఖాపరమైన పనుల కంటే ఇతర పనులపై ఎక్కువగా ఫోకస్ పెట్టేలా ఉన్నతాధికారులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఆమెలాగే ఇంకెందరో..

వీడియో కాన్ఫరెన్సుల్లో కలెక్టర్ తరచూ పలువురు అధికారులపై ఇలాగే నోరు పారేసుకుంటున్నారన్న ఆవేదన చాలామందిలో ఉంది. గతంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్ప్పుడు రెవెన్యూ సంఘాలు, ఎన్జీవో సంఘ నాయకత్వాలు స్పందించేవి. రాష్ట్రస్థాయిలో వస్తున్న ఒత్తిడో లేక జిల్లాల సగటులో దిగువ నుంచి రెండు మూడు స్థానాల్లోనే జిల్లా ఉండటమో తెలియదు గానీ ప్రతి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కలెక్టర్ మాటల వేడికి ఎవరో ఒక జిల్లా అధికారి మాడి మసైపోతున్నారు. మరోవైపు ఆరోపణలున్న అధికారులు మాత్రం జిల్లాలోనే పబ్బం గడిపేస్తున్నారు. ఇటువంటి విషయాలను గతంలో ఉద్యోగ సంఘ నాయకులు డీల్ చేసేవారు. ప్రస్తుతం వీరందరూ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సచివాలయాలను మానిటర్ చేస్తున్న ఓ మహిళా అధికారిపై కూడా కలెక్టర్ నోరు పారేసుకున్నారని చెబుతున్నారు. రాత్రిపూట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చీవాట్లు పెడుతుండటంతో ఒకవైపు వంట చేసుకుంటూనే మరోవైపు ఆ అధికారి కళ్లు తుడుచుకుంటూ వీడియోలో మిగతా అధికారులకు కనిపించారు. ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా తోటి అధికారుల ముందు కలెక్టర్ మాట్లాడటంపై ఆమె కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే జిల్లా సివిల్ సప్లై అధికారికి కూడా కలెక్టర్ అందరి సమక్షంలో చీవాట్లు పెట్టడంతో ఆయన తీవ్రంగా వణికిపోయారని, కలెక్టర్ వెళ్లిన తర్వాత మిగిలిన ఉద్యోగులు సపర్యలు చేసి గుండెపోటు రాకుండా ట్రీట్మెంట్ ఇప్పించారని ప్రచారంలో ఉంది. జిల్లాలో అనేకమంది అధికారులు ఇప్ప్పుడు ఇదే కంప్లైంట్ చేస్తున్నారు.

ఒత్తిడితో పనులు జరగవు

ఆమధ్య ముఖ్యమంత్రి కలెక్టర్లతో రివ్యూ చేసినప్ప్పుడు ముందస్తు ప్రిపరేషన్‌గా రోజుల తరబడి మహిళా అధికారులతో సహా జిల్లా అధికారులందరితోనూ మాట్లాడి డేటా తీసుకున్నారని అంటున్నారు. డీఆర్వో స్థాయి అధికారిని కూడా తమ ముందు కూర్చోనివ్వని విధంగా జిల్లాలో బ్యూరోక్రసీ నడుస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఇటువంటివి జరిగితే కలెక్టర్ దష్టిలో పెడతామని, కానీ కలెక్టరే అలా వ్యవహరిస్తే సహాయ నిరాకరణ తప్ప మరో మార్గం కనిపించడంలేదని వ్యాఖ్యానించినవారూ ఉన్నారు. మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఏవో హైమవతి స్పందించి తీరు చూసి అదే బాటలో నడవడానికి మరికొందరు అధికారులు సిద్ధపడుతున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు వినకుండా, వాటికి పరిష్కారాలు చూపకుండా కేవలం చీవాట్లు పెట్టడానికే వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించడం సరికాదని ఓ అధికారి ‘సత్యం’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నిత్యం రెవెన్యూ యంత్రాంగం మీద కలెక్టర్ విరుచుకుపడుతుండటం వల్ల ఆ సంఘ నాయకులు ముందుకు రావడంలేదని, ఇదే జరిగితే, అటు ఎన్జీవో నాయకులను, ఇటు సంబంధిత శాఖ నాయకులను పూర్తిగా బహిష్కరిస్తామని వారు చెబుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్లుగా పని చేసిన అనేకమంది తమ సొంత ముద్ర వేసి వెళ్లారు. అధికారులకు టార్గెట్లు ఇవ్వడం, ఆ మేరకు పనులు చేయించుకోవడంలో తగిన నేర్పు ప్రదర్శించాలి. లక్ష్మీనసింహం కలెక్టర్‌గా ఉన్నప్ప్పుడు రెవెన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. అయినా ఆయన గర్ల్‌చైల్డ్ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి రాష్ట్రస్థాయిలో వాటిని అమలుచేసేలా చూశారు. నివాస్ కలెక్టర్‌గా వచ్చిన మొదట్లో ఉద్యోగులు ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆయన పని విధానం ఉద్యోగులకు అర్థమైంది. అలాగే ఉద్యోగులు ఎంత కష్టపడుతున్నారో నివాస్‌కూ తెలిసొచ్చింది. దాంతో అందరూ కలిసి జిల్లా ఆరోగ్య రంగానికి జవసత్వాలు అందించారు. ఇలా చెప్ప్పుకుంటూపోతే.. వెనుకబడిన ఈ జిల్లాకు ఒక్కో కలెక్టర్ ఒక్కో మేలు చేశారు.. కేవలం కొద్దిరోజులు మాత్రమే ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన ముగ్గురు నలుగురు తప్ప. చివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో కలెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పేషీలో చేరిన ధనుంజయరెడ్డి కూడా ఈ జిల్లాలో తన మార్క్ వదిలి వెళ్లారు. ప్రస్తుతం వంశధార నుంచి ఉద్దానం ప్రాంతానికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ధనుంజయరెడ్డే. కానీ ఇప్పటిలా ఉద్యోగుల అసంతప్తికి ఎవరూ గురికాలేదు. అన్నిటికీ మించి ఈ జిల్లాలో పని చేస్తున్న అధికారుల్లో ఎక్కువమంది ఈ జిల్లావాసులే. ఇక్కడే ఉన్న తమ బంధు, స్నేహ వర్గాల్లో తమ ఆత్మాభిమానం దెబ్బతినకుండా పని చేయించుకోవాలని వారందరూ కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page