top of page

అంతర్జాతీయ క్రికెట్‌ను కబళిస్తున్న రాజకీయం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 16 hours ago
  • 3 min read

ప్రపంచస్థాయి క్రికెట్ సంబరం మరో మూడురోజుల్లో ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఈ నెల ఏడో తేదీన తెరలేవనుంది. వాస్తవంగా చూస్తే క్రికెట్‌ను అభిమానించే, ఈ టోర్నీలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాల్లో క్రికెట్ ఫీవర్ మొదలైపోవాలి.. ఆ జోష్ అంబరాన్ని తాకాలి. కానీ వాటి స్థానంలో ఇప్పుడు అయోమయం, గందరగోళం కనిపిస్తోంది. అసలు అది పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ టోర్నీలో ఆడాల్సిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల వైఖరే. స్నేహవారధిగా ఉండాల్సిన ఈ టోర్నీలోకి రాజకీయ మంటలు రగిలించి చలిమంట కాచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ దానివల్ల మొత్తంగా క్రికెట్ క్రీడకు, అంతిమంగా తమ దేశాల క్రికెట్‌కు ఆర్థికంగా, క్రీడపరంగా చేటు చేస్తాయన్న విషయాన్ని పట్టించుకోవడంలేదు. టీ20 ప్రపంచ కప్ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే సుమారు రెండేళ్లుగా భారత్‌తో విభేదాలు పెరగడం, సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో భారత్‌కు వెళ్లే తమ క్రికెట్ జట్టు సభ్యులకు భద్రత ఉండదని, అందువల్ల లీగ్ దశలో తాము ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబట్టడం, దాన్ని ఐసీసీ తిరస్కరించినా మొండిపట్టు వీడకపోవడంతో టోర్నీ నుంచి బంగ్లాను తప్పించి స్కాట్‌ల్యాండ్‌కు చోటు కల్పించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టి ఎగదోసింది పాకిస్తానే. అయితే ఐసీసీ పట్టించుకోకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు కూడా భారత్‌తో తాము ఆడాల్సిన లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై క్రీడాప్రపంచంలో విమర్శలు వినిపిస్తున్నాయి. లీగ్ మ్యాచ్ సరే.. సెమీస్‌లోనో, ఫైనల్‌లోనూ భారత్‌తో ఆడాల్సి వస్తే ఏం చేస్తారని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పాకిస్తాన్‌ను నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆ దేశం వద్ద ప్రస్తుతానికైతే సమాధానం లేదు. కాగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్`పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌ను పాక్ బహిష్కరణ వల్లో.. ఇంకో కారణం వల్లో జరక్కపోతే జరిగే నష్టం అపారమని క్రికెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తోపాటు భారత్, పాక్ క్రికెట్ బోర్డులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక్కొక్కరి కోణంలో లాభనష్టాలను పరిశీలిస్తే.. పాకిస్తాన్ భారత్‌తో తన లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నిబంధనల ప్రకారం భారత్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి. సెమీస్‌కు చేరేందుకు భారత్‌కు మార్గం సులువవుతుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ఈవెంట్. ఈ మ్యాచ్ జరక్కపోతే సుమారు 500 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.4500 కోట్ల మేరకు వివిధ వర్గాలు వ్యాపారాలు దెబ్బతింటాయని అంచనా. అయితే బీసీసీఐ ఆర్థికంగా చాలా బలంగా ఉన్నందున పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి చూస్తే ఈ నష్టం ఆర్థికంగా కుంగదీస్తుంది. మొదటగా టోర్నీలో పాల్గొన్నందుకు ఐసీసీ ఇవ్వాల్సిన ఆదాయం సుమారు 34.5 మిలియన్ డాలర్లలో భారీగా కోతపడవచ్చు. ఇక మ్యాచ్ ఆడకపోవడం వల్ల పాయింట్లు కోల్పోవడమే కాకుండా సెమీస్, ఫైనల్‌లో కీలకపాత్ర పోషించే నెట్ రన్‌రేట్, ర్యాంకింగు భారీగా పడిపోతాయి. అలాగే భవిష్యత్తులోనూ ఐసీసీ టోర్నీల నుంచి సస్పెండయ్యే ప్రమాదముంది. ఇవన్నీ పాక్ పాలకులకు తెలియని కావు. అయితే దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశాల సంగతి పక్కనపెడితే భారత్`పాక్ మ్యాచ్‌లు జరగకపోతే భారీగా వచ్చే ప్రకటనల ఆదాయం, వ్యూయర్‌షిప్ రికార్డులు అన్నీ మటాష్ అయిపోతాయి. ఫలితంగా బ్రాడ్‌కాస్టర్లు ఐసీసీకి చెల్లించాల్సిన సొమ్ములో కోత విధించే అవకాశం ఉంది. ఇంకో కోణంలో చూస్తే బెట్టింగ్ మాఫియా తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం క్రీడారంగంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ మాఫియా ఒక మహమ్మారిలా విజంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా బెట్టింగ్ యాప్‌లు కొత్త రూపాల్లో మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం ‘ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025’ ద్వారా నగదుతో కూడిన అన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లపై నిషేధం విధించింది. దాంతోపాటు గత నెలలో 242 అక్రమ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. గతంలో సెలబ్రిటీలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ యాప్‌లను ప్రమోట్ చేసి దండిగా సంపాదించేవారు. ఇప్పుడు ఆ పని చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ప్రధాన వెబ్‌సైట్లు బ్లాక్ అయినా మాఫియా నిర్వాహకులు వా{్సప్, టెలిగ్రామ్, డార్క్ వెబ్ వంటి ప్లాట్‌ఫారాల ద్వారా వ్యక్తిగత లింకులు పంపుతూ రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ ద్వారా వచ్చే నల్లధనాన్ని విదేశీ సర్వర్ల ద్వారా మళ్లించి, మనీ లాండరింగ్‌కు పాల్పడుతుంటారు. అక్రమ ఆదాయం కోసమే భారత్-పాకిస్తాన్ వంటి హైవోల్టేజ్ మ్యాచ్‌లు రద్దయితే బెట్టింగ్ మాఫియా మరింత యాక్టివ్ అవుతుంది. వారు అనధికారిక మార్కెట్లలో రేట్లు మారుస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతుంటారు. ప్రస్తుతం భారత్-పాక్ మ్యాచ్ రద్దు అయ్యే సూచనలు ఉండటంతో బెట్టింగ్ మాఫియా ఒక రకమైన అనిశ్చితిలో పడింది. మ్యాచ్ రద్దయితే అధికారిక బ్రాడ్‌కాస్టర్లకు, స్పాన్సర్లకు ఎంత నష్టం వాటిల్లుతుందో.. దాదాపు అదే స్థాయిలో బెట్టింగ్ మార్కెట్‌కు దెబ్బ తగులుతుంది. పందాలు వేసిన వారి డబ్బు హోల్డ్‌లో ఉండిపోవడం లేదా రిఫండ్ విషయంలో గొడవలు జరగడం వంటి ఉద్రిక్త పరిస్థితులు మాఫియాలో అంతర్గత యుద్ధాలకు దారితీస్తాయి. గతంలో పలు కారణాల వల్ల పలు దేశాలు క్రికెట్ మ్యాచ్‌లను, టోర్నీలను బహిష్కరించినప్పటికీ.. అప్పుడెప్పుడూ ఇంత నష్టం గానీ, గందరగోళంగానీ నెలకొనలేదు. క్రీడలను రాజకీయాలకు అతీతంగా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నప్పటికీ, పాక్-బంగ్లా తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ క్రికెట్ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page